వైద్య విద్యకు పట్టం

30 May, 2021 04:10 IST|Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా రేపు 14 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన

మొత్తం 16 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు సర్కారు నిర్ణయం

ఇప్పటికే పులివెందుల, పాడేరు కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన

అత్యాధునిక వసతులతో నిర్మాణం

మొత్తం అంచనా వ్యయం రూ.7,880 కోట్లు

2023 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో సర్కారు అడుగులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఒకే రోజున 14 వైద్య కళాశాలల నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఒకేసారి ఇన్ని వైద్య కళాశాలలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టడం దేశంలోనే అరుదైన రికార్డుగా నిలిచిపోనుంది. దీనివల్ల స్పెషాలిటీ వైద్యాన్ని రాష్ట్రం నలుమూలలకూ విస్తరించడంతోపాటు వేలాది ఎంబీబీఎస్‌ సీట్లు, నిరుద్యోగ వైద్యులకు ఉద్యోగాల కల్పన వంటి బహుళ ప్రయోజనాలు రాష్ట్రానికి కలుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుండగా.. ఇప్పటికే పులివెందుల, పాడేరు వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన పూర్తయింది. 

అంచనా వ్యయం రూ.7,880 కోట్లు
స్పెషాలిటీ వైద్యం ఆవసరమైన వారిని ప్రైవేటు ఆస్పత్రులకు పంపించి.. వాటికి నిధులు వెచ్చించడం కంటే ప్రభుత్వ ఆస్పత్రులనే కార్పొరేట్‌ ఆస్పత్రులుగా మారిస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందనేది ప్రభుత్వ ఆలోచన. ఇందులో భాగంగానే ఒకేసారి 16 మెడికల్‌ కాలేజీలు.. వాటికి అనుబంధంగా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రమారమి 2 వేల ఎంబీబీఎస్‌ సీట్లు పెరగనున్నాయి. సుమారు 32 విభాగాలకు సంబంధించి స్పెషలిస్ట్‌ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం 16 వైద్య కళాశాలలను 2023 నాటికి అందుబాటులోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుగు సాగుతోంది.

అత్యాధునిక వసతులు ఇలా..
– ప్రతి ఆస్పత్రిలో 500 పడకలకు తగ్గకుండా ప్రత్యేక సర్వీసులతో కూడిన ఏర్పాట్లు
– ప్రతి వైద్య కళాశాలలో ఐటీ సర్వీసులు, సీసీ కెమెరాల అనుసంధానం
– ప్రతి కాలేజీలోనిఅనుబంధ ఆస్పత్రిలో 10 మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్ల ఏర్పాటు
– కేంద్రీకృత ఏసీతో కూడిన ఐసీయూ, ఓపీడీ రూమ్‌లు, డాక్టర్‌ రూమ్‌లు
– అన్ని పడకలకు మెడికల్‌ గ్యాస్‌ పైప్‌లైన్ల ఏర్పాటు
– ఆక్సిజన్‌ స్టోరేజీ ట్యాంకులతో పాటు ఆక్సిజన్‌ జనరేటెడ్‌ ప్లాంట్ల నిర్మాణం

వైఎస్సార్‌ హయాంలో 4 కాలేజీలకు..
2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒకేసారి 4 మెడికల్‌ కాలేజీలు నిర్మించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్, ఒంగోలు, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకూ ఒక్క వైద్య కళాశాల కూడా రాష్ట్రంలో ఏర్పాటు కాలేదు. విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ వైద్యకాలేజీలు లేకపోయినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ధ్యేయంతో ముందుకెళుతోంది.

ప్రభుత్వ పరిధిలో ఇన్ని కాలేజీలు రావడం రికార్డు
ప్రభుత్వ పరిధిలో ఒకేసారి 16 కొత్త వైద్య కళాశాలలు రావడం చాలా గొప్ప విషయం. ఇదో రికార్డు. వేలాది మందికి ఎంబీబీఎస్‌ చదువుకునే అవకాశంతోపాటు లక్షలాది మందికి స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. పేద ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుంది. ప్రభుత్వ పరిధిలో స్పెషాలిటీ వైద్యం అన్ని ప్రాంతాలకై విస్తరిస్తుంది. ఈ పరిస్థితుల వల్ల పేద కుటుంబాలకు గొప్ప భరోసా లభిస్తుంది. మరోవైపు వైద్యుల్లోనూ నిరుద్యోగులున్నారు. అలాంటి వారికి ప్రభుత్వంలో పనిచేసే అవకాశం లభిస్తుంది.
– డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు  

మరిన్ని వార్తలు