గ్రీన్‌ ఫీల్డ్‌ కాలనీల నిర్మాణానికి సహకరించండి

9 Jun, 2021 03:38 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి అందరికీ ఇళ్లు ఇవ్వాలనేది మహత్తర లక్ష్యం  

ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ఇది దోహదం చేస్తుంది

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలిచ్చి గృహ నిర్మాణాలను కూడా చేపట్టిన నేపథ్యంలో గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసేలా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఙప్తి చేశారు. ప్రస్తుతం పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన) కింద గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వాలే కల్పించాలని నిబంధన విధించారని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలను కల్పించడానికి భారీగా ఖర్చవుతుందని.. అంత వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించడం సాధ్యం కాదన్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోతే వాటిలో లబ్ధిదారులు నివాసం ఉండలేరని వివరించారు. అప్పుడు ఇళ్ల స్థలాల సేకరణ, ఇంటి నిర్మాణానికి చేసిన వ్యయం నిరర్ధకమవుతుందని, పీఎంఏవై పథకం ద్వారా ఆశించిన లక్ష్యాలను సాధించలేమన్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి (ఎస్‌డీజీ) లక్ష్యాల్లో కీలకమైన లక్ష్యాన్ని (ఆహ్లాదకర  వాతావరణంలో ప్రజలు జీవించేలా పట్టణాలు, గ్రామాలను తీర్చిదిద్దడం) దేశం అధిగమిస్తుందని వివరించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం లేఖ రాశారు. అందులో ప్రధానాంశాలు ఇవీ..


మహత్తర లక్ష్యం...
► దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి అంటే 2022 నాటికి మురికివాడల్లో నివసిస్తున్న వారితోపాటూ అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యం మహత్తరమైనది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలు పీఎంఏవై పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. ప్రపంచవ్యాప్తంగా అమలవుతోన్న మహత్తర సంక్షేమ పథకాల్లో పీఎంఏవై పథకం ఒకటి. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకం వల్ల ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఎస్‌డీజీలను దేశం అధిగమిస్తుంది.

పీఎంఏవై లక్ష్యం సాధించాలంటే..
► సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అందరికీ ఇళ్లు పథకాన్ని కేంద్రం చేపట్టింది. గత ఏడేళ్లగా 308.2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. భారీ ఎత్తున కాలనీల్లో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి కేంద్ర వాటా కింద రూ.2.99 లక్షల కోట్లను విడుదల చేసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడం మూడు అంశాలపై ఆధారపడింది. అవేమిటంటే.. 1. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలను మంజూరు చేయడం 2.ఆ స్థలంలో పక్కా ఇంటిని నిర్మించుకోవడానికి సహాయం అందించడం 3.ఆ ఇంటిని నిర్మించుకున్న కాలనీ, లేఅవుట్‌లలో రహదారులు, విద్యుత్‌ సరఫరా, నీటి సరఫరా, మురుగునీటి కాలువలు లాంటి కనీస సదుపాయాలను కల్పించడం.

మిషన్‌ పూర్తయ్యేలోగా 30.76 లక్షల ఇళ్ల నిర్మాణం..
► ప్రజాసాధికారతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన అందరికీ ఇళ్లు పథకం తరహాలోనే రాష్ట్రంలో 68,381 ఎకరాలను 30.76 లక్షల మందికి ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేశాం. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేశాం. ఇళ్ల స్థలాల పంపిణీకే రూ.23,535 కోట్లను ఖర్చు చేశాం.  ఇందులో 28.30 లక్షల ఇళ్లను 17,005 గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో రూ.50,944 కోట్లతో చేపట్టాం.
► ఇళ్లను సకాలంలో నాణ్యతతో పూర్తి చేయడానికి అడిషినల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ ర్యాంకులో అన్ని జిల్లాల్లోనూ ‘జాయింట్‌ కలెక్టర్, హౌసింగ్‌’ పేరుతో ప్రత్యేక పోస్టును ఏర్పాటు చేశాం. ఈ పోస్టుల్లో యువ ఐఏఎస్‌ అధికారులను నియమించాం. మిషన్‌ గడువు ముగిసేలోగా ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందనే విశ్వాసం ఉంది.

కనీస సదుపాయాలు కల్పిస్తేనే లక్ష్యం సాకారం..
► గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోతే పీఎంఏవై పథకం లక్ష్యం సాకారం కాదు. రాష్ట్రంలో 17,005 గ్రీన్‌ ఫీల్డ్‌ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.34,109 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
► పీఎంఏవై పథకం కింద  అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడానికే రూ.23,535 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి అయ్యే భారీ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం సాధ్యం కాదు.
► పీఎంఏవై పథకం సాకారం కావాలంటే గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ అంశంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టడానికి నిధులు ఇచ్చేలా కేంద్ర పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించాలని కోరుతున్నా.

మరిన్ని వార్తలు