ఆక్సిజన్‌ కోటా పెంచినందుకు కృతజ్ఞతలు

16 May, 2021 02:50 IST|Sakshi

జామ్‌నగర్‌ నుంచి రోజూ ఆక్సిజన్‌ రైలు నడపండి 

ఏపీకి నిత్యం 910 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ కావాలి 

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ 

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఆక్సిజన్‌ కోటా పెంచడంతోపాటు ఏడు ఐఎస్‌వో కంటైనర్లను కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయనకు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా రెండో దశ ఉధృతిని ఎదుర్కొనేందుకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఏప్రిల్‌ 24న 480 మెట్రిక్‌ టన్నులుగా (ఎంటీ) ఉన్న లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరాను మే 6 నాటికి 590 మెట్రిక్‌ టన్నులకు పెంచినందుకు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జామ్‌నగర్‌లోని రిలయెన్స్‌ ప్లాంట్‌ నుంచి 80 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎంవోతో ప్రత్యేక రైలు శుక్రవారం రాష్ట్రానికి చేరిందని ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మరో 30 వేల ఆక్సిజన్, ఐసీయూ పడకలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుత కేసుల లోడు, ఆస్పత్రుల్లో చేరికలను పరిగణనలోకి తీసుకుంటే రోజూ 910 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ కావాల్సి ఉంటుందని వివరించారు. 

విశాఖ నుంచి వస్తున్నది 100 మెట్రిక్‌ టన్నులే.. 
విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)లో స్టోరేజీ సామర్థ్యం తగ్గడంతో తమకు కేటాయించిన 170 మెట్రిక్‌ టన్నులకు బదులు 100 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే వస్తోందని సీఎం.. ప్రధాని దృష్టికి తెచ్చారు. ఇదే సమయంలో తమిళనాడు నుంచి ఏపీకి కేటాయించినంత ఆక్సిజన్‌ రావడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనివల్ల రాయలసీమలోని పలు పెద్ద ఆస్పత్రుల్లో తీవ్ర అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు. ఈ నెల 10న చెన్నై, కర్ణాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ సకాలంలో రాకపోవడంతో తిరుపతిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి 11 మంది మరణించారన్నారు. రాయలసీమలో మా భయానక దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని.. తమిళనాడు, కర్ణాటకలపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఈ రెండు రాష్ట్రాల నుంచి కేటాయింపులు పెంచాలని తాము డీపీఐఐటీకి చేసిన వినతిని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇటువంటి స్థితిలో జామ్‌నగర్‌లోని రిలయెన్స్‌ ప్లాంట్‌ నుంచి 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌తో వచ్చిన ప్రత్యేక రైలు రాయలసీమ ప్రాణదాతగా నిలిచిందని తెలిపారు. ఇది రాయలసీమ ఆస్పత్రుల్లో రానున్న రెండు రోజుల పాటు ఆక్సిజన్‌ సరఫరా స్థిరీకరణకు తోడ్పడుతుందన్నారు.  

రాయలసీమలో ఆక్సిజన్‌ అవసరాన్ని తీర్చండి.. 
ఐఎస్‌వో కంటైనర్లతో ఒడిశా నుంచి ఆక్సిజన్‌ను తరలించేందుకు తాము శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నప్పటికీ రాయలసీమ నుంచి వస్తున్న డిమాండ్‌ను తట్టుకునే అవకాశం కనిపించడం లేదని సీఎం తెలిపారు. అందువల్ల రాయలసీమలో ఆక్సిజన్‌ అవసరాన్ని తీర్చేందుకు జామ్‌నగర్‌ నుంచి రోజూ కనీసం 80 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎంవోతో ఆక్సిజన్‌ రైలును నడపాల్సిందిగా విన్నవించారు. రాయలసీమలో పెరుగుతున్న కేసులను, ఆక్సిజన్‌ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. పై పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కరోనా కేసుల లోడును అదుపు చేయగలిగే స్థితి వచ్చే వరకు జామ్‌నగర్‌లోని రిలయెన్స్‌ ప్లాంట్‌ నుంచి ఆక్సిజన్‌ రైలును కొనసాగించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. అదేవిధంగా ఏపీలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని అధిగమించేందుకు 910 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు