యూజీసీ నిబంధనల నుంచి మినహాయించాలి

13 Feb, 2021 03:44 IST|Sakshi

ఢిల్లీ ఎస్వీ కాలేజీ ఆఫ్‌లైన్‌ క్యాంపస్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రికి సీఎం జగన్‌ లేఖ

టీటీడీ నిర్వహించే ఈ కాలేజీ తెలుగు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం

యూజీసీ నిబంధనలు అఫిలియేషన్‌కు అడ్డుగా ఉన్నాయి

ఏపీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని సడలింపు కల్పించాలి

సాక్షి, అమరావతి: ఢిల్లీలో టీటీడీ సహకారంతో ఏర్పాటైన శ్రీవేంకటేశ్వర కాలేజీ ఆఫ్‌లైన్‌ క్యాంపస్‌కు యూజీసీ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం లేఖ రాశారు.  ఆ వివరాలివీ..  

అఫిలియేషన్‌కు ఇబ్బందులు.. 
‘ఢిల్లీలోని తెలుగు విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలను అందించాలన్న లక్ష్యంతో ప్రముఖ నాయకురాలు దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్, కె.ఎల్‌.రావు, సి.అన్నారావుల చొరవతో 1961లో ఏర్పాటైన శ్రీ వేంకటేశ్వర కాలేజీ ఆఫ్‌లైన్‌ క్యాంపస్‌గా కొనసాగుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ యాక్ట్‌ 1922 ప్రకారం టీటీడీ చైర్మన్‌ నేతృత్వంలోని గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఈ కాలేజీ పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తోంది. కౌన్సిల్‌లోని 15 మంది సభ్యుల్లో పది మందిని టీటీడీ నామినేట్‌ చేస్తుంది. కాలేజీ అభివృద్ధి, ఇతర అంశాలను బోర్డు పర్యవేక్షిస్తోంది. టీటీడీ ఇందుకు నిధులను అందిస్తోంది. దేశ రాజధానిలో తెలుగు విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తున్న ఈ కాలేజీ 2020లో ఎన్‌ఆర్‌ఐఎఫ్‌ ర్యాంకింగ్‌లో 14వ స్ధానంలో నిలిచింది. అయితే 2009 ఏప్రిల్‌ 16న యూజీసీ రాసిన లేఖలో యూనివర్సిటీలు ఆయా రాష్ట్రాల భౌగోళిక పరిధిలో మాత్రమే ఆఫ్‌లైన్‌ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొంది.

రాష్ట్రాల యూనివర్శిటీ యాక్ట్‌ ప్రకారం వాటి భౌగోళిక పరిధుల్లో మాత్రమే క్యాంపస్‌ లను ఏర్పాటు చేయాలని, ఆ పరిధికి వెలుపల ఏర్పాటు చేయడానికి వీలులేదని 2013 జూన్‌ 27న యూజీసీ నోటీసు జారీ చేసింది. ఈ కారణంగా ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కాలేజీకి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొందేందుకు యూజీసీ నిబంధనలు ఆటంకంగా మారాయి. ఫలితంగా ఢిల్లీలోని తెలుగు విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విభజన వల్ల పలు ఉన్నత విద్యా సంస్థలు తెలంగాణలోనే  ఉండిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఉన్నత విద్య కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

యూజీసీ నిబంధనలతో రాష్ట్రానికి చెందిన తెలుగు విద్యార్థులు ఢిల్లీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర కాలేజీ ఆఫ్‌లైన్‌ క్యాంపస్‌కు ఆంధ్రా యూనివర్సిటీ అఫ్లీయేషన్‌ కల్పించేలా యూజీసీ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలి’ అని లేఖలో సీఎం కోరారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకంలో రాష్ట్రం ఉన్నత విద్యలో పురోగతి సాధిస్తోందని, జాతీయ విద్యా విధానంలో నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని లేఖలో సీఎం పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు