YS Jagan: అప్రమత్తతతో ఎదుర్కొందాం

26 May, 2021 04:23 IST|Sakshi
యాస్‌ తుపానుపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ 

సాక్షి, అమరావతి: యాస్‌ తుపాన్‌ను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ నివేదికలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తుపాను కదలికలకు అనుగుణంగా అవసరమైన చర్యలను చేపట్టాలని, ఈ విషయంలో అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. యాస్‌ తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 

పెద్దగా ప్రభావం కనిపించడం లేదు 
శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం కనిపించడం లేదని చెప్పారు. ఉన్నతాధికారులంతా ఇక్కడే ఉన్నారని, తాత్కాలిక నిర్మాణాల్లో కోవిడ్‌ రోగులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని సీఎంకు తెలిపారు. ఆక్సిజన్‌ కొరత రాకుండా, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ సమీక్షలో ఆయా జిల్లాల కలెక్టర్లు సీఎంకు నివేదించిన వివరాలు ఇలా ఉన్నాయి.   

సర్వసన్నద్ధంగా ఉన్నాం 
► ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని శ్రీకాకుళం కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌ తెలిపారు. ఆక్సిజన్‌ ట్యాంకర్ల రవాణాలో ఇబ్బందులు వచ్చిన పక్షంలో వెంటనే ఆ సమస్యను తీర్చడానికి ఇచ్ఛాపురం వద్ద ప్రత్యేక బృందాలను పెట్టామన్నారు. 

► విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు తుపాను ప్రభావం ఏమీ కనిపించలేదని, అయినా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తెలిపారు. కోవిడ్‌ రోగులు ఉన్న 28 ఆస్పత్రుల్లో  జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. ముందస్తుగా డీజిల్, మందులు, ఆక్సిజన్‌ను నిల్వ ఉంచామని చెప్పారు.

► విశాఖలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు. అయినా సరే.. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని.. ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లకు, సిలిండర్‌ ఫిల్లింగ్‌ ప్లాంట్లకు కరెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 80 ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు. 

► ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు