-

‘అసని’పై అప్రమత్తం

12 May, 2022 04:41 IST|Sakshi
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు బూడి ముత్యాలనాయుడు, తానేటి వనిత, దాడిశెట్టి రాజా

తుపాను నేపథ్యంలో కోస్తా తీర ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి  

18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం 

సహాయక కేంద్రాల కోసం ఇప్పటికే నిధులు కేటాయించాం 

ఒక్క మరణానికీ తావివ్వొద్దు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించాలి 

ఇళ్లకు వెళ్లేటప్పుడు ఒక్కో వ్యక్తికి రూ.1,000, కుటుంబానికి రూ.2 వేలు సాయం   

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఖాళీ చేయించి.. సహాయ, పునరావాస కేంద్రాలకు తరలించాలి. వారికి భోజనం, వసతితో సహా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలి. బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారు ఇంటికి వెళ్లేటప్పుడు ఒక్కొక్కరికి రూ.1,000, కుటుంబానికి రూ.2 వేలు చొప్పున సాయం అందించాలి. ఈ సొమ్ము వారి ఇళ్లు బాగు చేసుకోవడానికి, తక్షణ అవసరాలకు ఉపయోగపడుతుంది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న ఏడు జిల్లాల్లో ఈ ఏర్పాట్లు చేయాలి.    
 – సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: అసని తుపాను నేపథ్యంలో జిల్లాల అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు కోస్తా తీర ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఉదయం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒక్క మరణం కూడా సంభవించకుండా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే అవసరమైన నిధులు విడుదల చేశామని, అవసరమైన మేర ఖర్చు చేసుకోవచ్చని చెప్పారు. ఈ విషయంలో వెనుకాడవద్దని స్పష్టం చేశారు. బాధితులకు పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 

తీర ప్రాంతాలపై దృష్టి సారించాలి 
► నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుంది. ఈ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా కోస్తా తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలి.   
► కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలి. వారికి  భోజనంతో పాటు అవసరమైన సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇప్పటికే 454 చోట్ల సహాయ, పునరావాస కేంద్రాలను గుర్తించినప్పటికీ, ఇంకా అవసరమైన చోట్ల మరిన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. 

నిత్యావసరాలను సిద్ధం చేసుకోండి 
► సహాయ, పునరావాసానికి ఉపయోగపడే డీజిల్‌ జనరేటర్లు, జేసీబీల వంటి వాటిని సిద్ధం చేసుకోవాలి. బియ్యం, పప్పులు, వంట నూనెలు తదితర నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రభుత్వ విభాగాల వారీగా సహాయ చర్యల కోసం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. 
► ప్రభుత్వ శాఖలు పరస్పర సహకారంతో పని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గాలుల వేగం గంటకు 30 నుంచి 80 కిలోమీటర్లు వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతాయన్న సూచనలు కూడా ఉన్నాయి.  
► ఈ దృష్ట్యా కలెక్టర్లు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. త్వరితగతిన సహాయ పునరావాస చర్యలు చేపట్టాలి. పునరావాస కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ పునరావాస కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి. 

తీరం దాటే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి 
► కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ ప్రాంతాలకు మధ్యాహ్నానికి (బుధవారం) తుపాను తాకే అవకాశం ఉంది. సాయంత్రానికి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలపైనా ప్రభావం చూపిస్తుంది. రాత్రికి తీరం దాటి బలహీనపడే సమయంలో అధికారులందరూ మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. బాధితులకు హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు పక్కాగా ఉండాలి. ఉప్పాడ రోడ్డుకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలి. (ఇందుకోసం చెన్నై ఐఐటీ నిపుణులతో మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు.) 
► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, హోం, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ శాఖ మంత్రి తానేటి వనిత, ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, రవాణా, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ అంబేడ్కర్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు