ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే: సీఎం జగన్‌

19 Apr, 2023 13:35 IST|Sakshi

Updates

దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా..
‘‘మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేదు’’ అని సీఎం జగన్‌ అన్నారు.

సీఎం జగన్‌ కీలక ప్రకటన
శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్‌ నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామన్నారు. ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటానని సీఎం తెలిపారు.

ఇవాళ నాలుగు మంచి కార్యక్రమాలు జరుపుకున్నాం: సీఎం జగన్‌
మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం
నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేసుకున్నాం
ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ సహా హిర మండలం వంశధార లిప్ట్‌ లిరిగేషన్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకున్నాం
ఈ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళం ముఖచిత్రాన్ని మార్చివేస్తాయి
గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేశారు
ఇకపై మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుంది
భవిష్యత్‌లో మూలపేట, విష్ణు చక్రం మరో ముంబై, మద్రాస్‌ కాబోతున్నాయి
24 నెలల్లో పోర్ట్‌ పూర్తవుతుంది
పోర్టు నిర్మాణానికి రూ.4,362 కోట్లు ఖర్చు చేస్తున్నాం
పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 35వేల మందికి ఉపాధి లభిస్తుంది

పోర్టు వస్తే.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి
అప్పుడు లక్షల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి
మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు
గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం
గంగపుత్రులు వేరే ప్రాంతాలకు వలసలు పోకుండా ఉండేందుకు కృషి
పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం
బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌
రాష్ట్రంలో ఇప్పటివరకు 4 పోర్టులు మాత్రమే ఉండగా.. మనం అధికారంలోకి వచ్చాక మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం
తీరప్రాంత అభివృద్ధికి సంబంధించి గతంలో ఇలాంటి అభివృద్ధి ఎందుకు జరగలేదు?
సెప్టెంబర్‌ నుంచి విశాఖ నుంచే పాలన

చరిత్రలో గుర్తుండిపోయేలా..
చరిత్రలో గుర్తుండిపోయేలా మూలపేట పోర్టుకు ఈ రోజు శంకుస్ధాపన జరిగిందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. దాదాపు 30 నెలల్లో పూర్తి చేయనున్న ఈ పోర్టు ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు 50 వేల నుంచి 75 వేల మంది స్ధానిక యువతకు ఉపాధి కల్పించబోతున్నారన్నారు.

గతంలో అనేక మంది ముఖ్యమంత్రులను అనేక ప్రభుత్వాలను చూశాం, ఈ రోజు మన రాష్ట్రానికి సహజసిద్దంగా ఉన్నటువంటి సముద్రతీరాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలని, తద్వారా ఈ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో సీఎం 2019లో ఏపీ మ్యారిటైమ్‌ బోర్డు ఏర్పాటు చేసి దాదాపు రూ. 16 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు. దీంతో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టు, మరో 10 ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తున్నారు. ఈ ఘట్టం శ్రీకాకుళం చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతుంది.రానున్న కాలంలో ఈ ప్రాంతంలో మరిన్ని మంచి కార్యక్రమాలు సీఎంద్వారా చేస్తామని మంత్రి అన్నారు. 

75 ఏళ్ల చరిత్రలో ఇవాళ చరిత్రాత్మక ఘట్టం: ఎమ్మెల్సీ దువ్వాడ
నవరత్నాల ద్వారా పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సీఎం జగన్‌ అండగా నిలుస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతిరహిత పాలన అందిస్తున్నారన్నారు. రైతులను విత్తనం నుంచి విక్రయం వరుకు ఆదుకుంటున్నారని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సీఎం జగన్‌ నెరవేర్చారు. నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎం శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ సహా హిర మండలం వంశధార లిప్ట్‌ లిరిగేషన్‌ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.

గంగమ్మ తల్లికి సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు
సీఎం జగన్‌ మూలపేటలో పర్యటిస్తున్నారు. గంగమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ మూలపేటకు చేరుకున్నారు. కాసేపట్లో మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

శ్రీకాకుళం జిల్లా మూలపేట పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు కాసేపట్లో సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేయనున్నారు. 23.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్‌ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలని నిర్ణయించారు.

విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. అంతేగాక వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీని సైతం నిర్మిస్తోంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది. 

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్‌ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ పనులకు కూడా బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం కాగా, కాకినాడ సెజ్‌ పోర్టులో శరవేగంగా పనులు సాగుతున్నాయి.

వచ్చే నెలలో మచిలీపట్నం (బందరు) పోర్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. పదేళ్లలో ఒక పోర్టు కడితేనే గొప్ప అనుకునే పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్ల లోపే నాలుగు పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం విశేషం. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టుల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుకే ఎగుమతులు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు