ఆ ఘటనపై చలించిపోయిన సీఎం జగన్‌.. అనాథలైన చిన్నారులకు చెరో రూ.5 లక్షలు

8 Sep, 2022 12:02 IST|Sakshi

సాక్షి, అమరావతి/తూర్పుగోదావరి: ఆన్‌లైన్‌ లోన్‌ యాప్ బారినపడి రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు నాగసాయి(4), లిఖిత(2) ఇద్దరికి చెరో రూ.5 లక్షల సాయం అందించాలని సీఎం ఆదేశించారు. చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ మాధవీలతకి ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య

కాగా, అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజవొమ్మంగి చెందిన కొల్లి దుర్గాప్రసాద్‌ (32), రమ్యలక్ష్మి (24) దంపతులు గత కొంతకాలంగా రాజమహేంద్ర వరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి మూడేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్‌ జొమాటో డెలివరీ బాయ్‌గా, అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్‌ కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

కాగా కొద్దిరోజుల క్రితం ఇంటి అవసరాల నిమిత్తం సెల్‌ఫోన్‌ ద్వారా లోన్‌ యాప్‌లో కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నారు. అయితే అది సకాలంలో చెల్లించకపోవడం, వడ్డీ పెరిగిపోవడంతో లోన్‌ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్‌ తరచూ ఫోన్‌ చేసి వేధించేవారు. ‘మీ నగ్న చిత్రాలు మా వద్ద ఉన్నాయి.. అప్పు చెల్లించకపోతే వాటిని బయటపెడతాం’ అని బెదిరించారు. అంతేకాకుండా దుర్గాప్రసాద్‌ బంధువులకు, స్నేహితులకు ఫోన్‌ చేసి అప్పు తీసుకున్న విషయాన్ని చెప్పారు. దీంతో పరువు పోయిందని భార్యాభర్తలిద్దరూ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ క్రమంలో లోన్‌ యాప్‌ల ఆగడాలపై కఠిన చర్యలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


 

మరిన్ని వార్తలు