ఉద్యోగుల డీఏ మార్గదర్శకాలపై జీవోకు సీఎం ఆదేశం

30 Jul, 2021 04:54 IST|Sakshi

ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకటరామిరెడ్డి వెల్లడి

వీఆర్వోల సమస్యలు పరిష్కారం 

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపి సత్కరించిన ఉద్యోగుల ప్రతినిధులు

సాక్షి, అమరావతి: ఉద్యోగుల డీఏకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంవో అధికారులను ఆదేశించినట్టు ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. జూలై నుంచి ఇవ్వాల్సిన డీఏకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ఇంకా విడుదల చేయలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. వీఆర్‌వో ల సమస్యలు విని, వారి సర్వీస్‌ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల మేనిఫెస్టోలో పె ట్టి, చెప్పినట్టుగానే  సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్న తి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారన్నారు.

ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్, ఏపీ వీఆర్వోల సంఘం నేతలు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్‌ కొనసాగింపు జీవో విడుదలకూ సీఎం సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పరీక్షలపై ఆందోళన చెందుతున్నారని, పరీక్ష విధానాన్ని, సిలబస్‌ను సులభతరం చేయాలని సీఎంను కోరగా.. దీనిపై అధికారులతో మాట్లాడతానని చెప్పినట్టు వెంకటరామిరెడ్డి తెలిపారు.  ఫెడరేషన్‌ సెక్రటరీ జనరల్‌ అరవ పాల్, ఏపీ వీఆర్వోల సం ఘం అధ్యక్షుడు రవీంద్రరాజు, సంఘ ప్రతినిధులు రాజశేఖర్, లక్ష్మీనారాయణ, అనిల్‌  పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు