చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీఎం జగన్‌ అభినందన

27 Nov, 2020 07:06 IST|Sakshi

ఒకరు మృతి

తుడా చైర్మన్‌ చెవిరెడ్డి చొరవతో క్షేమంగా ఒడ్డుకు చేరిన ఇద్దరు

సాక్షి, తిరుపతి రూరల్‌/ రేణిగుంట: నివర్‌ తుపానుతో కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగిన రాగుళ్లవాగు వరదలో ముగ్గురు రైతులు కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకోగా  మరొకరు మృతిచెందారు. రైతుల్ని కాపాడేందుకు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చూపించిన చొరవ, సహాయక సిబ్బందిని సమన్వయ పరిచిన తీరు సీఎం వైఎస్‌ జగన్‌ సహా పలువురి ప్రశంసలందుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..

పొలంలో మోటార్లు తీసుకువస్తూ..
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కుమ్మరిపాలెంకు చెందిన ముగ్గురు రైతులు వెంకటేష్, ప్రసాద్, లోకేష్‌లు గురువారం వర్షాలకు దెబ్బతింటాయని పొలం వద్ద ఉన్న మోటార్లను తీసుకువచ్చేందుకు వెళ్లారు. తిరిగి వస్తూ రాగుళ్ల వాగు ఉధృతికి వరదలో చిక్కుకుని దాదాపు అర కిలోమీటరు కొట్టుకుపోయారు. వారిలో వెంకటేష్, లోకేష్‌లు చెట్టును పట్టుకుని కాపాడాలని కేకలు వేయగా.. ప్రసాద్‌ మృతిచెందాడు. విషయం సీఎం కార్యాలయం ద్వారా తుడా చైర్మన్‌ చెవిరెడ్డికి తెలిసింది. ఆయన హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి హెలికాప్టర్‌ తెప్పించారు. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో రైతుల్ని కాపాడటం వీలుకాలేదు. దీంతో జిల్లా కలెక్టర్, పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులతో మాట్లాడి స్పీడ్‌ బోటును తెప్పించారు. దానిలో వెళ్లిన ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది రైతులను క్షేమంగా ఒడ్డుకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైతుల్ని కాపాడటానికి చొరవ చూపించిన చెవిరెడ్డిని సీఎం జగన్‌ అభినందించారు. పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయి అధికారులు కూడా ఆయన్ను ప్రశంసించారు. కాగా హెలికాప్టర్‌ పంపిన సీఎం జగన్‌కు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.  చదవండి: (‘నివర్‌’ బీభత్సం)

రెస్క్యూ బృందానికి ఎమ్మెల్యే రూ.లక్ష నజరానా 
రైతులు వాగులో చిక్కుకున్న సమాచారం తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి.. తాను దూరంగా ఉండటంతో తొలుత పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి అక్కడికి పంపారు. జిల్లా కలెక్టర్‌తో, స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకున్నారు. తర్వాత ఘటనా స్థలానికి చేరుకుని రైతుల్ని పరామర్శించారు. వారిని కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బందిని అభినందించి లక్ష రూపాయలు ప్రోత్సాహకంగా అందజేశారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా