లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్‌

27 Dec, 2022 14:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకూడదన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తమది రైతులు, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమన్నారు. అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మందికి రూ.590.91 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి ఖాతాల్లో జమ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందని వారికి అవకాశం ఇచ్చాం. పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధులు జమ చేస్తున్నాం. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఈ మాదిరిగా సంక్షేమ పథకాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదని సీఎం అన్నారు.

‘‘లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మూడున్నరేళ్లలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.85 లక్షల కోట్లు జమ చేశాం. డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా మొత్తం రూ.3.30 లక్షల కోట్లు అందించాం. సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్ల పాత్ర చాలా కీలకం. గత ప్రభుత్వంలో ఏ పార్టీ అని అడిగి పథకాలు ఇచ్చేవారు. లంచాలు  లేకుండా గత ప్రభుత్వం ఏ పథకం ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయి’’ అని సీఎం జగన్‌ అన్నారు.

వంద శాతం సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం
సాధ్యమైనంత వరకు పథకాలను ఎలా ఎగ్గొట్టాలనే గత పాలకుల ఆలోచనలకు పూర్తి భిన్నంగా అర్హులందరికీ వంద శాతం సంతృప్త స్థాయిలో సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పాలన కొనసాగుతోంది.

ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని వారు ఆ పథకం ద్వారా లబ్ధి చేకూర్చిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే వెరిఫై చేసి ప్రభుత్వం ఏటా రెండు దఫాలు ప్రయోజనాన్ని అందచేస్తోంది. డిసెంబర్‌ నుంచి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని జూన్‌లో అందిస్తుండగా జూన్‌ నుంచి నవంబర్‌ వరకు అమలైన పథకాల ప్రయోజనాన్ని మిగిలిపోయిన అర్హులకు డిసెంబర్‌లో అందిస్తోంది.  

దీంతోపాటు కొత్తగా జూన్‌  22 నుంచి నవంబర్‌ వరకు పెన్షన్‌ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలకు సంబంధించి అర్హుల వెరిఫికేషన్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఈ నెల 30వ తేదీన తుది జాబితాను ప్రకటిస్తారు. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్‌తో పాటు అన్ని కార్డులను వలంటీర్లు ఇంటికే వచ్చి అందిస్తారు.  

మరిన్ని వార్తలు