ఏపీలో మరో 12 వైద్య కళాశాలలు 

1 May, 2022 03:42 IST|Sakshi
ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్‌ మాండవీయాకు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రికి సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి 

రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక వైద్య సేవలకు లోటు 

కొత్త జిల్లాల నేపథ్యంలో 12 చోట్ల కొత్తవి మంజూరు చేయాలి 

2023కు పూర్తి చేసి, 2024లో క్లాసులు ప్రారంభిస్తాం 

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 12 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన కేంద్ర మంత్రితో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ఆవశ్యకత గురించి వివరిస్తూ కేంద్ర మంత్రికి లేఖ అందజేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. 

► రాష్ట్ర విభజన వల్ల ఏపీ ప్రజలకు ప్రత్యేక వైద్య సంరక్షణ (టెర్షియరీ కేర్‌) సదుపాయాలు అందుబాటులో లేకుండా పోయాయి. కీలక వైద్య సేవలకు సంబంధించిన చికిత్స కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి మీకు తెలిసిందే. 
► ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజా వైద్య రంగాన్ని పూర్తి స్థాయిలో పటిష్టం చేసే విధంగా భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రైమరీ, సెకండరీ వైద్య సేవలతో పాటు సూపర్‌ స్పెషాలిటీ స్థాయి ఆరోగ్య సేవలను అందించే విధంగా మౌలిక వసతులను కల్పిస్తోంది.  
► పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏహెచ్‌లు, డీహెచ్‌లను ఆధునీకరించడంతో పాటు మెడికల్, నర్సింగ్‌ కాలేజీల్లో భారీగా నియామకాలను చేపట్టింది. పెద్ద ఎత్తున సుశిక్షితులైన మానవ వనరులతో పాటు ప్రభుత్వ రంగంలో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం.  
► కోవిడ్‌ వంటి మహమ్మారిని ఎదుర్కోవడం, ఈ సందర్భంగా కీలక వైద్య సేవలను అందించడంలో దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆస్పత్రులు కీలక పాత్ర పోషించడాన్ని మనం చూశాం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. వైద్య రంగాన్ని పటిష్టం చేసే విధంగా తగు నిర్ణయాలను ఎప్పటికప్పుడు తీసుకుంటోంది.  

ప్రతి జిల్లాకు ఓ మెడికల్‌ కాలేజ్‌ 
► 5.4 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రంలో ఇదివరకు 13 జిల్లాలు ఉండేవి. పాలన మరింత సమర్థవంతంగా అందించడానికి కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశాం. మొత్తం 26 జిల్లాల్లో ఏప్రిల్‌ 4 నుంచి పాలన సాగుతోంది. ఏపీలో ప్రస్తుతం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. కేంద్రం 2020 మార్చి 20న పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో 3 కళాశాలలకు అనుమతి ఇచ్చింది. వీటి పనులు పురోగతిలో ఉన్నాయి. 
► కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకొంటే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, బాపట్ల, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు లేవు. దేశంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరు చేయాలని కోరుతున్నాం. 
► మీ మద్దతుతో ఈ 12 వైద్య కళాశాలల ఏర్పాటుకు వెంటనే అనుమతిస్తే, 2023 డిసెంబర్‌ నాటికి వాటిని పూర్తి చేసి.. 2024 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామన్న నమ్మకం ఉంది. ఇది ఇరు ప్రభుత్వాలు కలిసి ఏపీ రాష్ట్రానికి అందించే శాశ్వత సహాయం. 

సీఎంలు, సీజేల సదస్సుకు హాజరైన వైఎస్‌ జగన్‌  
శనివారం ఉదయం విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశానికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి భవన్‌లో ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేలకు ఇచ్చిన విందులోనూ పాల్గొన్నారు. శనివారం రాత్రికి తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. కాగా, సీఎంలు, సీజేల సదస్సుకు ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా కూడా హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు