వరద సాయం శరవేగం

15 Oct, 2020 02:01 IST

మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకోవాలి

పునరుద్ధరణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి

భారీ వర్షాలు, వరదలు, సహాయ కార్యక్రమాలపై కలెక్టర్లతో సమీక్షలో సీఎం జగన్‌

సహాయ శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 చొప్పున ఇవ్వండి

వారు ఇళ్లకు తిరిగి వెళ్లాక ఇబ్బందులకు గురికాకుండా చూడాలి

వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద..

కృష్ణా, గుంటూరు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి

విద్యుత్‌ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలి. కాలువలు, చెరువుల గండ్లు పూడ్చాలి. రహదారుల మరమ్మతులు తక్షణం చేపట్టాలి. భారీ వర్షాలు, వరదల కారణంగా వేర్వేరు జిల్లాల్లో మృతి చెందిన పది మంది కుటుంబాల వారికి వెంటనే పరిహారం చెల్లించాలి. వారంలోగా నష్టంపై అంచనాలు పంపించాలి. చిత్తూరు జిల్లాలో 40 శాతం అధిక వర్షాలు కురిసినా, కేవలం 30 శాతం మాత్రమే ట్యాంకులు నిండాయి. ఈ పరిస్థితిని మార్చాలి. కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి.. రిజర్వాయర్లు, చెరువులు నింపాలి. కరువు నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలి. 
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారికి రూ.500 చొప్పున ఇవ్వాలన్నారు. వారు ఇళ్లకు తిరిగి వెళ్లాక ఇబ్బందులకు గురి కాకుండా అన్ని విషయాలు ఆరా తీసి సహకరించాలని చెప్పారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, సహాయ కార్యక్రమాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై కలెక్టర్లను ఆరా తీశారు. వాయుగుండం నిన్న(మంగళవారం)నే తీరం దాటింది కాబట్టి ఇబ్బంది లేదని, అయినా పూర్తి అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. 
వరద సహాయక కార్యక్రమాలపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో హోం మంత్రి సుచరిత తదితరులు 

ప్రకాశం బ్యారేజీకి భారీ వరద
– తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తోంది. బ్యారేజీ వద్ద ఇప్పటికే భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరో 24 గంటల్లో ఆ వరద చేరుతుంది. 
– ప్రకాశం బ్యారేజీ వద్ద 7.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడం కోసం గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. విజయవాడలో ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించాలి. 

45 నెలల్లో శాశ్వత మరమ్మతులు
– రహదారుల మరమ్మతు పనులు వేగంగా జరగాలి. 45 నెలల్లో శాశ్వత ప్రాతిపదికన కూడా మరమ్మతులు పూర్తి చేయాలి. వారం రోజుల్లో నష్టంపై అంచనాలు పంపించాలి. 
– తూర్పు గోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్‌ వల్ల పిఠాపురంలో వరద వస్తోంది. కాబట్టి అవసరమైన ఆధునికీకరణ చర్యలు చేపట్టాలి.

వ్యాధులు ప్రబలకుండా చర్యలు
– కలుషిత నీరు లేకుండా పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేయాలి. ఎక్కడా వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయేరియా వంటివి పూర్తిగా నివారించాలి. 
– అన్ని పీహెచ్‌సీలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి. క్లోరినేషన్‌ చేయాలి. వరదలు తగ్గాక పాము కాట్లు పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. 

నీటి వృథాను అరికట్టాలి
– రిజర్వాయర్లు నింపాలి. అక్కడి నుంచి కాలువల ద్వారా ప్రతి చెరువు నింపడంపై రాయలసీమ, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. 
– నెల్లూరు జిల్లా కండలేరులో ఈసారి గరిష్టంగా 60 టీఎంసీల నీరు నిల్వ చేయబోతున్నాం. ఇప్పటి వరకు గరిష్టంగా 50 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశాం.

వరద తగ్గాక వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు 
– వరదలు తగ్గుముఖం పట్టాక వ్యవసాయ, ఉద్యానవన వర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సూచనలు చేస్తారని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. పంటల పరిస్థితిపై కలెక్టర్లు వీలైనంత త్వరగా అంచనాలు పంపాలన్నారు. ధాన్యం సేకరణకు రైతు భరోసా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్‌ కొనసాగుతోందని చెప్పారు.
– వరదలు సంభవించిన అన్ని చోట్ల శానిటేషన్‌ కోసం తగిన ఏర్పాట్లు చేశామని, బ్లీచింగ్‌ పౌడర్‌ అందుబాటులో ఉంచామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ పేర్కొన్నారు. తాగు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. 
– ఈ సమీక్షలో మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు