మహిళల భద్రతపై సీఎం జగన్‌ కీలక నిర్ణయాలు

4 Mar, 2021 19:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: అంగన్‌వాడీల్లో నాడు–నేడు, వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూల్స్, సంపూర్ణ పోషణ పథకం, అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించాలని తెలిపారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో 2000 స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  మహిళా దినోత్సవం రోజున ఎంపిక చేసిన షాపింగ్‌ సెంటర్లలో మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేసే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలన్నారు.

మహిళా భద్రత, సాధికారితపై షార్ట్‌ఫిల్మ్‌ పోటీలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి వింగ్‌ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలన్నారు. పోలీసు డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్న మహిళలందరికీ ఆరోజు స్పెషల్‌ డే ఆఫ్‌గా ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. అదనంగా మహిళా ఉద్యోగులకు 5 క్యాజువల్‌ లీవ్స్‌ ఇచ్చేందుకు సీఎం జగన్‌ అంగీకారం తెలిపారు. నాన్‌ గెజిటెడ్‌ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. చేయూత కిరాణా దుకాణాల్లో అందుబాటులో శానిటరీ పాడ్స్‌, దానికోసం సెర్ప్, మెప్మా, హెచ్‌ఎల్‌ఎల్‌ మధ్య ఎంఓయూ చేసుకోవాలని ఆధికారులను ఆదేశించారు.
 

పదో తరగతి పూర్తిచేసిన బాలికలకు ప్లస్‌–1, ప్లస్‌–2ల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను అదేశించారు. జూనియర్‌ కాలేజీల నుంచి పైస్థాయి కాలేజీల వరకు ‘దిశ’ పై ప్రచారం నిర్వహిస్తూ హోర్డింగులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. అందులో ‘దిశ యాప్‌’ సహా అన్నిరకాల వివరాలు ఉంచాలని సూచించారు. దిశ కింద తీసుకుంటున్న చర్యలు, వాటిపై అవగాహన కోసం విస్తృతంగా ప్రచారంకొనసాగించాలని అధకారులకు సీఎం జగన్‌ సూచించారు. వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూల్స్‌పై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌కు మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అంగన్‌వాడీల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఇవ్వనున్న పుస్తకాలు, బోధనోపకరణాలను చూపించగా వాటిని సీఎం జగన్‌ పరిశీలించారు.

అంగన్‌వాడీల్లో నాడు–నేడు
44,119 అంగన్‌ వాడీల్లో నాడు–నేడు కింద ఉన్నవాటి అభివృద్ధి, కొత్త నిర్మాణాలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారలును ఆదేశించారు. అర్బన్, రూరల్‌ ప్రాంతాల్లో ఏక కాలంలో అంగన్‌వాడీ భవనాల పనులు ప్రారంభం కావాలన్నారు. పీపీ–1 పిల్లలకు 4,17,508 పుస్తకాలు, అలాగే పీపీ–2 పిల్లలకు 4,17,508 పుస్తకాలను ప్రభుత్వం అందించనున్నట్లు తెలిపారు. మార్చి 20 నుంచి మొదలు కానున్న పుస్తకాల పంపిణీ ఏప్రిల్‌ 5 నాటికి పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. వాటితోపాటు అంగన్‌వాడీలకు ఇవ్వనున్న 26 బోధనోపకరణాల్లో ప్రభుత్వం ఇప్పటికే 16పంపిణీ చేసిందని, మిగిలిన 10 బోధనోపకరణాలు నెల రోజుల్లోగా పంపిణీ చేయనున్నట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. స్కూళ్లలో పిల్లలకు ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ కూడా ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలని సూచించారు. ఈ తరహాలోనే అంగన్‌వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.


వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం
వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పథకాలపై పోస్టర్ల ద్వారా వివరాలు అందిస్తున్నామని అధికారులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ, వార్డు సచివాలయం, అంగన్‌వాడీ సెంటర్లలో కూడా ఈ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అలాగే పిల్లలకు మంచి ఆహారం అందించడం, శుభ్రతలపై నిర్దేశించిన విధివిధానాలతో ఎస్‌ఓపీ బుక్‌ను అందిస్తున్నామని అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. దానిపై రూపొందించిన వీడియోలను వారికి షేర్‌ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో మహిళా, శిశు సంక్షేమశాఖా మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ ఏ రవిశంకర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్, డీఐజీ (టెక్నికల్‌ సర్సీసెస్‌) జి పాలరాజు,  ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: సహకార రంగం.. బలోపేతం

మరిన్ని వార్తలు