శ్రద్ధ వహిస్తేనే.. సత్ఫలితాలు: సీఎం జగన్‌

3 Feb, 2023 03:51 IST|Sakshi
విద్యాకానుక కింద ఇచ్చే బ్యాగ్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం జగన్‌ 

విద్యా కానుక వస్తువుల్లో నాణ్యతపై రాజీ పడొద్దు

విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికే కిట్లు స్కూళ్లకు చేరాలి

నాడు–నేడు పూర్తయిన స్కూళ్లలో డిజిటల్‌ తరగతులు 

ఐఎఫ్‌పీల ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ బోధన

సబ్జెక్టు టీచర్లతో బోధనపై మరింత శ్రద్ధ

ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ ప్రావీణ్యం 

టోఫెల్‌ (ఈటీఎస్‌), కేంబ్రిడ్జి లాంటి సంస్థల సహకారంతో శిక్షణ

ఇంగ్లిష్‌ సామర్ధ్యాన్ని పెంచేందుకు టీచర్లకూ తగిన ట్రెయినింగ్‌

మార్చి 2 నుంచి వారంలో 3 రోజులు బ్రేక్‌ఫాస్ట్‌గా రాగి మాల్ట్‌

విద్యార్థులు 6వ తరగతిలోకి రాగానే విద్యను సీరియస్‌ అంశంగా తీసుకుని చదువుపై మరింతగా దృష్టి పెట్టేలా చర్యలు చేపట్టాలి. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌ ఏర్పాటు, సబ్జెక్టుల వారీ టీచర్లతో పాటు బోధన కార్యక్రమాలపై అన్ని స్థాయిల్లోనూ అధికారులు, క్షేత్ర స్థాయిలోని సిబ్బంది సీరియస్‌గా వ్యవహరించాలి. మొక్కుబడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుంది.

ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని విజయాలు సాధించేలా మన విద్యా­ర్థుల్లో ఇంగ్లిష్‌ ప్రావీణ్యం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం కేంబ్రిడ్జి, టోఫెల్‌ (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఎ ఫారిన్‌ లాంగ్వేజ్‌ను ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీ­సెస్‌–ఈటీఎస్‌ అనే సంస్థ నిర్వహిస్తుంది) లాంటి సంస్థల భాగ­స్వామ్యాన్ని కూడా తీసుకోవాలి. 3వ తరగతి నుంచే పరీక్షలు నిర్వహించి పిల్లలకు సర్టిఫికెట్లు జారీ చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి. అప్పుడు మరిన్ని మంచి ఫలితాలుంటాయి. 
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను తరచూ సమీక్షించడంతో పాటు, అవి పూర్తి స్థాయిలో సత్ఫ­లి­తాలు ఇచ్చేలా క్షేత్ర స్థాయి వరకు నిరంతర పర్య­వేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌­మోహన్‌­రెడ్డి అధికారులను ఆదేశించారు. మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద పథకాల్లో ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు మరింత మెరుగు పడేలా బోధనాభ్యసన కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.

ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ బోధన, డిజిటల్‌ తరగతుల ఏర్పాటు తరుణంలో అధికారులు ఆ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరంతర సమీక్ష, పర్యవేక్షణ వల్ల విద్యాకానుక దగ్గర నుంచి పాఠ్యాంశాల వరకు.. మౌలిక సదుపా­యాల కల్పన దగ్గర నుంచి గోరుముద్ద వరకు నాణ్యత పెరుగుతుందన్నారు. పిల్లలకు అద్భుత­మైన స్కూలు వాతావరణం అందుబాటులో ఉంటు­ం­దని, తద్వారా చదువుపై వారు మరింత ఏకా­గ్రత చూపగలుగుతారని చెప్పారు.  

ఏటా విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులను క్షుణ్ణంగా పరి­శీలించాలని, నాణ్యతలో  రాజీ ఉండ­కూ­డదని ఆదేశించారు. పాఠ్య పుస్తకాల్లో పేపర్‌ క్వా­లి­టీగా ఉండేలా చూడాలన్నారు. వచ్చే ఏడాది అందించాల్సిన విద్యా కానుక కిట్‌లను ఈ విద్యా సంవత్సరం ఆఖరుకే స్కూళ్లకు చేర్చాలని చెప్పారు. మార్చిలో మొదలు పెట్టి ఏప్రిల్‌ చివరి నాటికి విద్యా కానుక వస్తువు­లన్నింటినీ స్కూళ్లకు చేరుస్తా­మని, స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యా కానుక కిట్‌ అందిస్తామని  అధికారులు చెప్పారు. గోరుముద్దలో భాగంగా రాగి మాల్ట్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నా­మ­న్నా­రు. సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఐఎఫ్‌పీల ద్వారా బోధనపై మరింత నిశిత దృష్టి
► ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు వీలుగా ఐఎఫ్‌పీ(ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌)లను ఏర్పాటు చేస్తు     న్నాం. 6వ తరగతి ఆపై ప్రతి తరగతి గదిలోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నాం.  వీటి వల్ల బోధన, నేర్చుకోవడం మరింత సులభతరమవుతుంది. 6వ తరగతి కన్నా దిగువ తరగతులకు టీవీ స్క్రీన్లను అందుబాటులోకి తెస్తున్నాం. తర్వాత 8వ తరగతి నుంచి ట్యాబ్‌లిస్తున్నాం. దీని వల్ల ఇంటి దగ్గర కూడా పిల్లలు ఆడియో, వీడియో, గ్రాఫిక్స్‌ ఎలిమెంట్స్‌ ఉన్న పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశం కల్పించాం. 

► వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఐఎఫ్‌పీ, టీవీ స్క్రీన్లను స్కూళ్లలో ఏర్పాటు చేయాలి. వీటిని ఏర్పాటు చేసినప్పుడే నాడు–నేడు పూర్తవు­తుంది. 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ట్యాబులను వచ్చే విద్యా సంవ­త్సరంలో స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా అందించేలా చర్యలు తీసుకోవాలి. సబ్జెక్ట్‌ టీచర్లు, పా­ఠ్య పుస్తకాల్లో అంశాలు, ట్యాబుల్లోని బైజూస్‌ కంటెంట్, ఐఎఫ్‌పీ కంటెంట్‌.. మొత్తంగా పూర్తి సిన­ర్జీతో ఉండాలి. 

► టీచర్లకూ ఇంగ్లిష్‌పై పట్టు పెరిగేందుకు శిక్షణ ఇచ్చే­లా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు క్రమ­ం­గా ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో మెరు­గైన ప్రావీణ్యం సాధించాలి. ట్యాబ్‌ల విని­యో­గం, పాఠ్యాంశాలను నేర్చుకుంటున్న తీరుపై పిల్లల తల్లిదండ్రులకు ఫీడ్‌బ్యాక్‌ అందించాలి.

► నాడు–నేడులో మొత్తం 11 రకాల మౌలిక సదు­పాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. వీటిలో లోపా­లుంటే  వెంటనే సరిదిద్దాలి.

విద్యార్థులకు అందించే బూట్ల నాణ్యతను పరిశీలిస్తున్న సీఎం జగన్‌ 

మార్చి 2 నుంచి పిల్లలకు రాగి మాల్ట్‌
జగనన్న గోరుముద్దలో భాగంగా వారంలో మూడు రోజులు ఉదయం పూట విద్యార్థులకు రాగి మాల్ట్‌ అందించాలి. మార్చి 2వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. మరో మూడు రోజులు చిక్కి అందించాలి. ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో రక్తహీనత (ఐరన్‌ లోపం)ను నివారించవచ్చు.

అధికారులు ఏం చెప్పారంటే..
► సబ్జెక్ట్‌ టీచర్‌ విధానంతో అర్హతలున్న టీచర్లు అందు­బా­టులోకొచ్చారు. 
► గతంలో 3, 4, 5  తరగతుల పిల్లలకు సబ్జెక్టుల వారీగా బోధన లేదు. ఇప్పుడు వీరికి మంచి బోధన అందుతోంది.
► ఐఎఫ్‌పీల కొనుగోలు టెండర్‌ జ్యుడీషియల్‌ ప్రివ్యూకు వెళ్లింది. 
► ట్యాబ్‌ల వినియోగంలో వైఎస్సార్‌ కడప, విజయనగరం, చిత్తూరు జిల్లాల విద్యార్థులు మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.
► మొదటి దశ నాడు–నేడుపై, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఆడిట్‌ పూర్తయ్యింది.

అంగన్‌వాడీలు, హాస్టళ్లలోనూ నాడు–నేడు
► మొదటి దశలో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసిన ప్రభుత్వం రెండో దశలో 23,221 స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. మూడో దశలో 16,968 స్కూళ్లను మౌలిక వసతులతో తీర్చిదిద్దనుంది. వీటితోపాటు అంగన్‌వాడీలు, హాస్టళ్లను కూడా నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తోంది.
► సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌  డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, విద్యా శాఖ సలహాదారు సాంబశివారెడ్డి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌  సురేష్‌కుమార్, పాఠశాల మౌలిక వసతుల శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఎంవీశేషగిరిబాబు తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు