పైసా తగ్గకుండా ‘మద్దతు’ధర

6 Dec, 2022 03:58 IST|Sakshi
ధాన్యం సేకరణ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

ప్రతి రైతుకు సంపూర్ణ మద్దతు ధర కల్పించడమే లక్ష్యం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

డీబీటీతో పారదర్శకంగా నేరుగా ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము జమ 

రవాణా, హమాలీ ఖర్చులను ప్రభుత్వం అదనంగా ఇస్తోంది

ధాన్యం సేకరణలో కొత్త విధానంపై ఆర్బీకేల్లో పోస్టర్లు ప్రదర్శించాలి

యాప్‌లో సిగ్నల్‌ సమస్యలొస్తే ఆఫ్‌లైన్‌లో వివరాల నమోదు 

రైతుల ఫోన్లకు ఆడియో, వీడియో సందేశాలు పంపాలి

క్షేత్ర స్థాయిలో ఎక్కడా గోనె సంచులకు కొరత రానివ్వొద్దు.. వచ్చే ఖరీఫ్‌ నుంచి సీఎంఆర్‌ మిల్లుల్లో డ్రయర్ల ఏర్పాటు 

జిల్లా పౌరసరఫరాల అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా ఎస్‌వోపీలు

ప్రజలు కోరితే పీడీఎస్‌ ద్వారా చిరుధాన్యాలను సరఫరా చేయాలి

పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలపై సమీక్షలో సీఎం

సాక్షి, అమరావతి: ధాన్యం రైతులకు ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కళ్లాల నుంచి ధాన్యం తరలించేందుకు అయ్యే రవాణా, హమాలీ చార్జీలను ప్రభుత్వం అదనంగా ఇస్తోందన్న  విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయాన్ని పూర్తిగా తొలగిస్తూ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. ధాన్యం సేకరణలో కొత్త విధానాలపై ఆర్బీకేల్లో పోస్టర్లను ప్రదర్శిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో పాటు రైతుల ఫోన్లకు ఆడియో, వీడియోల రూపంలో సందేశాలను పంపాలని సూచించారు.

రైతులకు జరిపే చెల్లింపులన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలని, పౌరసరఫరాల కార్పొరేషన్‌ నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి(డీబీటీ)లో పూర్తి మద్దతు ధరను జమ చేయాలని నిర్దేశించారు. ధాన్యం సేకరణ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా శాఖల అధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలివీ..

ధాన్యం సేకరణ యాప్‌..
ధాన్యం సేకరణలో కొత్త విధానం అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. చిన్నచిన్న సమస్యలు ఎదురైతే అక్కడికక్కడే పరిష్కరిస్తూ రైతులకు మరింత మెరుగ్గా సేవలందించేలా చర్యలు తీసుకోవాలి. కొనుగోళ్ల లక్ష్యానికి అనుగుణంగా గోనె సంచులను సమకూర్చుకోవాలి. పంట ఉత్పత్తులను తరలించుకునేందుకు రైతులు ఎక్కడా ఇబ్బంది పడకూడదు. ధాన్యం సేకరణ యాప్‌లో సిగ్నల్స్‌ సమస్యలు తలెత్తితే ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి.

సిగ్నల్స్‌ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లగానే ఆ వివరాలు ఆటోమేటిక్‌గా యాప్‌లో అప్‌లోడ్‌ అయ్యేలా మార్పులు చేసుకోవాలి. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నారు. అవసరమైతే వారి నుంచి సాంకేతిక సహకారాన్ని పొందాలి. ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి పరిష్కారంగా వచ్చే ఖరీఫ్‌ నుంచి సీఎంఆర్‌ రైస్‌ మిల్లుల్లో డ్రయర్లు ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలి. కొనుగోళ్ల సమయంలో ఇబ్బంది లేకుండా ఇతర శాఖల నుంచి అవసరమైన మేరకు సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించుకోవాలి.

జవాబుదారీతనం పెరిగేలా..
పౌరసరఫరాల శాఖలో ఎక్కడా అవినీతి, అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలి. జిల్లా పౌరసరఫరా అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించేలా వారి విధివిధానాలపై స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌ఓపీ) రూపొందించాలి. వీటిని కచ్చితంగా పాటించేలా సమర్థంగా పర్యవేక్షించాలి.

ప్రత్యామ్నాయ పంటలపై ప్రత్యేక దృష్టి
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి. ఆసక్తి ఉన్న వారిని గుర్తించి అన్ని విధాలా తోడ్పాటు అందించాలి. మన ప్రభుత్వం వచ్చాక చిరుధాన్యాల (మిల్లెట్స్‌) సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. పుష్కలమైన పోషకాలను అందించే చిరుధాన్యాలు కావాలని ప్రజలు కోరితే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి. 

హాజరైన మంత్రులు, అధికారులు..
సమీక్షలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రవాణా శాఖ కార్యదర్శి పీఎస్‌ ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్, మార్కెటింగ్‌ æశాఖ కమిషనర్‌ రాహుల్‌ పాండే, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌ విజయ సునీత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు