ప్రకృతి సేద్యంపై యూనివర్సిటీ 

8 Jul, 2022 03:29 IST|Sakshi
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో న్యూటెక్‌ బయో సైన్సెస్‌ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పంద పత్రాలతో ప్రభుత్వ అధికారులు, ఆ సంస్థ ప్రతినిధులు

డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలూ అందించబోతున్నాం 

ఏపీ కార్ల్‌లో న్యూటెక్‌ బయో సైన్సెస్‌కు శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రపంచ స్థాయి పరిశోధనకు ఇండో–జర్మన్‌ అకాడమీ ఏర్పాటు 

ఆహారంలో కెమికల్స్‌ను తగ్గించడమే లక్ష్యం 

తద్వారా క్యాన్సర్, వివిధ రోగాల నియంత్రణ 

ఆర్బీకేల ద్వారా ప్రకృతి వ్యవసాయానికి పూర్తి సహకారం 

విడతల వారీగా సాగుకు ప్రత్యేక ప్రణాళిక 

అప్పుడు ప్రపంచం అంతా ప్రకృతి సేద్యం బాట 

ఇంతకు ముందు స్కూళ్ల పరిస్థితి ఎలా ఉంది.. ఈ రోజు పరిస్థితి ఎలా మారిందో మీరు చూడొచ్చు. (గతంలో స్కూల్‌ – పునర్‌ నిర్మాణం తర్వాత ఇప్పటి స్కూల్‌ ఫోటో చూపిస్తూ) మీరంతా బాగా చదివాలి.  పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు ఏ మాదిరిగా చదువుతారో, మాట్లాడుతారో అదే మాదిరిగా గొప్పగా చదవాలి. గొప్పగా ఇంగ్లిష్‌ మాట్లాడాలి. ప్రపంచంతో పోటీ పడేలా ఎదగాలి.      
    – వేంపల్లె విద్యార్థులతో సీఎం జగన్‌ 

సాక్షి ప్రతినిధి, కడప/వేంపల్లి : ‘జర్మన్‌ ప్రభుత్వం, కేంద్రం సహకారంతో మనం ప్రకృతి వ్యవసాయంలో ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా ప్రకృతి సేద్యంలో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీలతోపాటు పీహెచ్‌డీలు కూడా అందిస్తాం. అప్పుడు ఇక్కడి నుంచి వచ్చే విద్యార్థులకు ప్రపంచం మొత్తం ఆహ్వానం పలుకుతుంది. ప్రపంచం మొత్తానికి ప్రకృతి సేద్యం అందుబాటులోకి వస్తుంది. అదే మన స్వప్నం. ఆ లక్ష్యంతోనే ప్రకృతి సేద్యంపై ప్రపంచ స్థాయి పరిశోధనకు ఇండో–జర్మన్‌ అకాడమి ఏర్పాటు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ఏపీ కార్ల్‌ ప్రాంగణంలో ఇండో–జర్మన్‌ ప్రపంచ వ్యవసాయ విజ్ఞాన పరిశోధన–శిక్షణా అకాడమి (ఐజీజీఏఏఆర్‌ఎల్‌ –ఇండో – జర్మన్‌ గ్లోబల్‌ అకాడమి ఫర్‌ ఆగ్రో ఎకాలజీ రీసెర్చి అండ్‌ లెర్నింగ్‌.. ఐజీ గార్ల్‌) ఏర్పాటుకు గురువారం ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా న్యూటెక్‌ బయో సైన్సెస్‌కు శంకుస్థాపన చేశారు. ప్రకృతి వ్యవసాయ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో దేశ విదేశాల్లో విస్తరింపజేసే ఆశయంతో రూ.222 కోట్ల ఖర్చుతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..       
ఇండో–జర్మన్‌ గ్లోబల్‌ అకాడమీని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 
  
గ్రామ స్థాయిలో సమగ్ర అవగాహన ముఖ్యం 
► ఇవాళ మనం రకరకాల క్యాన్సర్‌ వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటీవల కాలంలో క్యాన్సర్‌ విస్తరిస్తోంది. ప్రధానంగా మనం ఆహారం రూపంలో తీసుకుంటున్న వివిధ రకాల కెమికల్స్‌ వల్ల రకరకాల వ్యాధుల బారిన పడుతున్నాం. దీన్ని నివారించేందుకు ఉన్న ఏకైక మార్గం మనం తీసుకుంటున్న ఆహారంలో రసాయనాలు (కెమికల్స్‌) తగ్గించడమే.  
► అది కేవలం గ్రామ స్థాయిలో సమగ్రమైన అవగాహన, విజ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రకృతి వ్యవసాయంపై గ్రామ స్థాయిలో సరైన అవగాహన అవసరం. గ్రామ స్థాయిలో ఇప్పటికే ఆర్బీకేలు  పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం సుమారు 10,700 గ్రామాల్లో రైతులకు వాటి ద్వారా సేవలు అందుతున్నాయి.  
► ఆర్బీకేలు రైతులను విత్తనం నుంచి విక్రయం వరకు సాగులో చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్‌ నాణ్యతను పరీక్షించి వాటికి గ్యారంటీ ఇస్తూ కల్తీ విత్తనాలు, ఎరువులను నివారించడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి.    
ఆర్బీకేల పాత్ర మరింత కీలకం 
► ఇకపై ఆర్బీకేలకు ప్రకృతి సేద్యాన్ని కూడా జత చేస్తున్నాం. ఇందుకు సంబంధించి తొలుత మనం నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అన్ని ఆర్బీకేల్లో కచ్చితంగా ఆగ్రో ఎకాలజీపై పరిశోధన చేసిన మాస్టర్‌ ట్రైనర్, సైంటిస్టు ఉండాలి.   
► గ్రామంలో ఉన్న కమ్యూనిటీ రీసోర్స్‌ పర్సన్‌ (సీఆర్‌పీస్‌), అగ్రి సైంటిస్టు ఇద్దరూ కలిస్తే వారికున్న పరిజ్ఞానాన్ని గ్రామంలోని మిగిలిన రైతులకు అందించగలుగుతారు. ప్రకృతి సాగుకు కావాల్సిన ఉపకరణాలను కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ) ద్వారా అందుబాటులో ఉంచుతారు. తద్వారా గ్రామాలను ప్రకృతి సాగు దిశగా నడిపించే ప్రయత్నం చేస్తాం.  
► రసాయనాల వినియోగం తగ్గించి, ప్రకృతి సాగు వైపు వస్తే వెంటనే విపరీతమైన ఆదాయాలు వస్తాయని చెప్పలేం. ఆదాయాలు తొలుత తగ్గవచ్చు కూడా. అందుకే రైతుకు మూడు ఎకరాలు ఉంటే తొలి ఏడాది మూడవ వంతు మాత్రమే ప్రకృతి సాగు చేపట్టాలి. రెండవ ఏడాది 50 శాతం, మూడవ ఏడాది మొత్తం ప్రకృతి సాగువైపు మళ్లాలి. నాల్గవ సంవత్సరంలో ఫెస్టిసైడ్స్‌  వాడకపోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. భూమిలో సారం పెరగడం వల్ల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది.   

ఎఫ్‌పీఓ సర్టిఫికేషన్‌   
► ఐజీజీఏఏఆర్‌ఎల్‌ ఏర్పాటు ద్వారానే ఇదంతా సాధ్యమవుతుంది. గ్రామ స్థాయిలో ఈ రకమైన శిక్షణ కోసం మనం ఈ అకాడమి ఏర్పాటు చేసుకుంటున్నాం. రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది రైతులు ఉంటే కేవలం ఆరు లక్షల మంది మాత్రమే ప్రకృతి సాగులో మమేకమై ఉన్నారు. సుమారు కోటిన్నర ఎకరాల్లో కేవలం ఆరు లక్షల ఎకరాల్లో మాత్రమే ప్రకృతి వ్యవసాయం సాగులో ఉంది.  
► సహజ సాగు ఉత్పత్తులకు ఆర్బీకే స్థాయిలో సర్టిఫికేషన్‌ చేసే సౌలభ్యం అందుబాటులో ఉన్నప్పుడే మన ఉత్పత్తులకు అధిక ధరలు లభిస్తాయి. ప్రతి ఆర్బీకే పరిధిలో ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌పీఓ) కనీసం ఒక్కటి ఉండేలా భవిష్యత్తులో అడుగులు వేస్తాం. ఒక్కసారి ప్రకృతి సాగు ఉత్పత్తులకు అధిక ధరలు లభించడం మొదలైతే అప్పుడు రసాయనాల వాడకానికి రైతులు స్వస్తి చెబుతారు. 

ఇదీ మన స్వప్నం 
► ఇది మనం ఆశిస్తున్న మార్పు, మనం కంటున్న కల. ఇవాళ మనం మొదటి అంకంలో ఉన్నాం. ఏడెనిమిది ఏళ్లలో అసా««ధారణమైన ఫలితాలను చూడవచ్చు. పులివెందులలో ఐజీ కార్ల్‌(ఏపీ కార్ల్‌) గా ఉన్న కాలేజీ ఐజీ గార్ల్‌గా ఇవాల్టి నుంచి మారిపోతోంది. త్వరలో ఒక యూనివర్సిటీగా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడి నుంచి సహజ సాగులో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు వచ్చే పరిస్థితి ఉంటుంది.  
► జర్మన్‌ ప్రభుత్వం, కేంద్రంతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీలను కూడా భాగస్వాములను చేసి గొప్ప వ్యక్తులను తీసుకు రావాలన్న ప్రయత్నం జరుగుతోంది. దేవుడి దయవల్ల అది కచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాను.    

పులివెందుల అభివృద్ధి పనులపై సీఎం జగన్‌ సమీక్ష 
► వైఎస్సార్‌ జిల్లాలో రెండు రోజుల పర్యటన కోసం సీఎం జగన్‌ గురువారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి 11.40 గంటలకు పులివెందుల చేరుకున్నారు. నియోజకవర్గ పరిధిలో పాడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్షించారు.  
► పాడా అభివృద్ధి పనులను ఓఎస్‌డీ అనిల్‌కుమార్‌రెడ్డి, పులివెందుల మోడల్‌ టౌన్‌ పనుల పురోగతిని రాష్ట్ర ప్రణాళిక ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్‌లు వివరించారు. డిసెంబర్‌ నాటికి దాదాపు అన్ని పనులు పూర్తి అవుతాయని చెప్పారు. పనుల్లో నాణ్యత ముఖ్యం అని సీఎం వారికి సూచించారు.   
► పులివెందుల మున్సిపాలిటీ, పలు మండలాలకు చెందిన ముఖ్య నేతలతో సీఎం సమావేశమయ్యారు. అందరి సమస్యలు విని, పరిష్కరిస్తామని చెప్పారు.   
► వేంపల్లెలో రూ.3.32 కోట్లతో నిర్మించిన వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్కును ప్రారంభించారు. ఆ తర్వాత వేంపల్లెలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో రూ.7.80 కోట్లతో నిర్మించిన బాలికల పాఠశాల భవనాలను, మరో రూ.7 కోట్లతో నిర్మించిన బాలుర జిల్లా పరిషత్‌ పాఠశాల భవనాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో ముచ్చటించారు.  
► ఈ కార్యక్రమంలో అభివృద్ధి సహకార మంత్రిత్వ శాఖ రాష్ట్ర కార్యదర్శి జోచన్‌ ప్లాస్‌బార్ట్, జర్మన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఇండియా ఆఫీసు కేఎఫ్‌ డబ్లు్య డైరెక్టర్‌ క్రిస్టోఫ్‌ కెస్లర్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్‌బాష, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

మా ఊరు మొత్తం ప్రకృతి వ్యవసాయమే 
నా భర్త మరణించిన తర్వాత రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండే ప్రకృతి వ్యవసాయానికి మళ్లాను. లాభసాటిగా ఉండడంతో డ్వాక్రా సంఘాల మహిళలకు పని కల్పించాను. ఇప్పుడు మా ఊరు ఊరంతా ప్రకృతి వ్యవసాయం చేస్తోంది. పెట్టుబడి సగమైంది. ఆదాయం రెట్టింపు అయింది.   
– సుశీలమ్మ, మన్యం జిల్లా, కురుపాం మండలం 

దేశం మొత్తం మీ వెంటే నడవడం ఖాయం 
కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహిస్తోంది. కానీ మీరు (ముఖ్యమంత్రి) ప్రతి ఒక్క రైతుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను చేరవేయాలని ఆలోచిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా మీ అడుగు జాడల్లో నడుస్తాయి. ఐజీ గార్ల్‌ న్యూటెక్‌ బయో సైన్సెస్‌గా నిలిచిపోతుంది.     
– నీలం పటేల్, నీతి అయోగ్‌ సీనియర్‌ అడ్వయిజర్‌ 

విశ్వజనానికి ప్రకృతి వ్యవసాయ ఫలాలు 
ఐజీ గార్ల్‌ సంస్థ కేవలం ఆంధ్రప్రదేశ్‌కో లేదా దేశంలోని ఒక ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్క రైతుకు విజ్ఞానాన్ని అందించి ప్రకృతి వ్యవసాయ ఫలాలను ప్రతి ఒక్కరికీ అందించే ఆలోచనకు ప్రతి రూపం. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ ద్వారా ఈ సంస్థలో భాగస్వామ్యమైనందుకు సంతోషిస్తున్నాం.     
 – ఎన్‌ఎన్‌ సిన్హా, కేంద్ర పంచాయతీరాజ్‌ సెక్రటరీ 

సీఎం కృషి అమోఘం 
సీఎం వైఎస్‌ జగన్‌  రైతాంగం, వ్యవసాయం పట్ల చూపుతున్న ఆసక్తి గతంలో ఏ సీఎం చూపించలేదు. జర్మన్‌ ప్రభుత్వం, కేంద్రం, నీతి అయోగ్, ఐకార్‌తోపాటు పలు విశ్వవిద్యాలయాల సహకారంతో రైతాంగానికి అండగా నిలబడేందుకు కృషి చేశారు.  
    – కాకాణి గోవర్దన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి 

మా స్కూలు చాలా బాగుంది 
ఇప్పుడు మా స్కూళ్లు చాలా బాగున్నాయి. ఇదంతా మీ (సీఎం) వల్లే. అమ్మ ఒడి పథకం చాలా గొప్పగా ఉంది. గోరుముద్ద వల్ల మంచి భోజనం తింటున్నాం. మీరు లెజండరీ సీఎం. మీలాంటి సీఎం దొరకడం మా అదృష్టం. మీ అండతో మేము గ్లోబల్‌ స్టూడెంట్స్‌గా మారుతాం. 
    – శశికుమార్, జి.భానుశ్రీ, 10వ తరగతి, జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, వేంపల్లె   

మరిన్ని వార్తలు