వారానికి రెండుసార్లు సచివాలయాల్ని సందర్శిస్తా 

7 Jul, 2021 03:03 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెల్లడి 

కలెక్టర్లు వారానికి రెండు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాలి 

జేసీలు, మునిసిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు వారానికి 4 సచివాలయాల్ని సందర్శించాలి.. దీనివల్ల అక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుస్తుంది 

సచివాలయాల ద్వారా ప్రజలకు అదనంగా మరో 200 సేవలు 

అందుబాటులోకి.. మొత్తంగా 740 సేవలు 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ తగ్గుముఖం పట్టగానే వారానికి రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. స్పందనలో భాగంగా తన క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు, సేవలు, పేదల ఇళ్ల నిర్మాణాలు, ఇంటి స్థలాలు ఆర్వోఎఫ్‌ఆర్‌ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్‌ కలెక్టర్లకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఇక నుంచి ప్రతి వారం గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండింటిని కలెక్టర్లు, వారానికి 4 సచివాలయాల్ని జాయింట్‌ కలెక్టర్లు సందర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా మునిసిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు వారానికి 4 సచివాలయాలను సందర్శించేలా చర్యలు చేపట్టాలన్నారు. దీనిని కలెక్టర్లు, జేసీల పనితీరుకు సూచికలుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. కచ్చితంగా గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేస్తేనే అక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుస్తాయన్నారు. దీనిపై సీఎంవో కార్యాలయం స్వయంగా పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు.

సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన తాజా పోస్టర్లు, అమలవుతున్న పథకాలకు సంబంధించిన జాబితాలు, ముఖ్యమైన ఫంక్షన్‌ నంబర్లు, వెల్ఫేర్‌ క్యాలెండర్‌ ఉందా? లేదా?, కోవిడ్‌పై పోస్టర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేవా?, సేవల జాబితా ఉందా? లేదా? అనేది చూడాల్సిందిగా సీఎం సూచించారు.

కోవిడ్‌ తగ్గుముఖం పట్టగానే ఎమ్మెల్యేలు, అధికారులు మండల స్థాయిలో ప్రతిరోజు ఒక గ్రామ, వార్డు సచివాలయాన్ని సందర్శించాలన్నారు. తద్వారా పెండింగ్‌ సమస్యలు, ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సచివాలయం పరిధిలో హౌసింగ్‌ కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని, దిశ యాప్‌ డౌన్‌లోడ్‌పైనా దృష్టి సారించాలని అన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. 

బీమాల అమలుపై ప్రత్యేక పరిశీలన 
వైఎస్సార్‌ బీమా, పశువుల బీమా, దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం చెల్లింపు, మత్స్యకారులు వేట సమయంలో మరణిస్తే ఆ కుటుంబాలకు పరిహారం అందించడమనే నాలుగు అంశాలపైనా ప్రత్యేక పరిశీలన చేయాలి. ఆరోగ్యశ్రీ కార్డులు, పెన్షన్‌ కార్డులు, రైస్‌ కార్డులు, ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న నాటినుంచి నిర్దేశిత సమయంలోగా ఇచ్చారా? లేదా? అన్న దానిపై దృష్టి పెట్టాలి. కలెక్టర్లు, జేసీలు, మునిసిపల్‌ కమిషనర్లు, పీఓలు దృష్టి పెడితే గ్రామ, వార్డు సచివాలయాలు బలంగా పనిచేస్తాయి. 

ఇంటి స్థలాలపై ప్రత్యేక దృష్టి 
పట్టణాల్లో మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకే ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమంపైనా కలెక్టర్లు దృష్టిపెట్టాలి. మరోవైపు 3,69,584 మంది ఇంటి స్థలాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు ఉన్నాయి. ఈ సమస్యపై దృష్టి పెట్టి వెంటనే కేసులు పరిష్కారమయ్యేలా చూడండి. 1,29,945 మందికి పట్టాలు ఇవ్వడానికి భూసేకరణ పూర్తిచేయాలి. పెండింగ్‌లో ఉన్న 13,636 దరఖాస్తులను కూడా వెంటనే వెరిఫికేషన్‌ చేయాలి. 

గిరిజనుల జీవనోపాధిపై దృష్టి 
గిరిజనుల జీవనోపాధిని పెంచడంపై  దృష్టి పెట్టండి. ఆర్వోఎఫ్‌ఆర్‌ కింద పంపిణీ చేసిన భూముల అభివృద్ధిపై దృష్టి సారించాలి. హార్టీకల్చర్, సెరీకల్చర్‌ను ఆయా భూముల్లో సాగయ్యేలా చేయండి. భూమిని అభివృద్ది చేసి ఇవ్వగలిగితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. గిరిజనులకు మేలు జరుగుతుంది. 

4,024 గ్రామాలకు ఫైబర్‌ నెట్‌ 
డిసెంబర్‌ 31 కల్లా 4,024 గ్రామాలకు ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ అందుతుంది. ఆ సమయానికల్లా ఆ పంచాయతీల్లో డిజిటల్‌ లైబ్రరీలు రెడీ కావాలి. దీనివల్ల వర్క్‌ ఫ్రం హోమ్‌ కాన్సెప్ట్‌ బలోపేతం అవుతుంది.  

వీడియో కాన్ఫరెన్స్‌కు ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.    

సచివాలయాల ద్వారా మరో 200 సేవలు 
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరో 200 సేవలను అదనంగా ప్రజలకు అందించబోతున్నాం. మొత్తంగా 740 సేవలు వీటిద్వారా అందుతాయి. సిబ్బందిలో అవసరమైన వారికి కౌన్సెలింగ్‌ చేయాలి. ప్రజల గడప వద్దకే సేవలందించాలన్న లక్ష్యం కోసం వేస్తున్న అడుగులు బలంగా ఉండాలి. ప్రజలతో ఎలా వ్యవహరించాలి, నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాలను ఏవిధంగా అందుకోవాలన్న దానిపై శిక్షణ అందించాలి. ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దేలా దృష్టిపెట్టాలి. రిజిస్టర్లను, రికార్డులను తనిఖీ చేయాలి. బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను పరిశీలించాలి. వలంటీర్లు కూడా అందుబాటులో ఉంటున్నారా? లేదా? గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన సందర్భంగా పరిశీలన చేయాలి. 

వచ్చే జూన్‌కల్లా ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి 
ఊహించని విధంగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మొత్తంగా 9.95 లక్షల ఇళ్ల పనులు మొదలయ్యాయి. అధికారులందరినీ అభినందిస్తున్నాను. సెప్టెంబర్‌ 15కల్లా బేస్‌మెంట్‌ స్థాయి వరకూ ఇళ్లు కట్టేలా చర్యలు తీసుకోవాలి. వచ్చే ఏడాది ఏప్రిల్‌–జూన్‌ నాటికల్లా ఈ ఇళ్లను పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకోండి. లే–అవుట్లలో కరెంటు, నీటి సౌకర్యాలను పూర్తిచేయాలి. వచ్చే స్పందన కార్యక్రమం నాటికి ఈ పనులు పూర్తి కావాలి.  

ఈ నెల 22న కాపు నేస్తం 
జూలై 8న వైఎస్సార్‌ రైతు దినోత్సవం చేస్తున్నాం. 22న వైఎస్సార్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నాం. ఇదే నెల 29న జగనన్న విద్యా దీవెన అమలు చేస్తున్నాం.  

మరిన్ని వార్తలు