రాష్ట్రానికి అండగా నిలిచిన కార్పొరేట్లకు కృతజ్ఞతలు

25 May, 2021 04:46 IST|Sakshi

ట్వీట్లు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 సంక్షోభ సమయంలో ఆక్సిజన్‌ సరఫరా చేయడం ద్వారా రాష్ట్రానికి అండగా నిలిచిన రిలయన్స్, టాటాస్టీల్, జిందాల్‌ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ వంటి కార్పొరేట్‌ సంస్థలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వేర్వేరుగా ట్వీట్‌ చేశారు.

కోవిడ్‌–19కు వ్యతిరేకంగా పోరాడుతున్న రాష్ట్రానికి రిలయన్స్‌ ఫౌండేషన్‌ తరఫున ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును పంపడం ద్వారా మద్దతు తెలిపిన ముఖేష్‌ అంబానీకి ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో కూడా ఇదే విధమైన మద్దతు కొనసాగుతుందంటూ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికైన పరిమళ్‌ నత్వాని ట్విటర్‌ ఖాతాకు ట్యాగ్‌ చేస్తూ సీఎం ట్వీట్‌ చేశారు.

‘ఈ కష్టసమయంలో పార్లమెంటు సభ్యుడు, జిందాల్‌ గ్రూపు చైర్మన్‌ నవీన్‌ జిందాల్‌ రాష్ట్రానికి అండగా నిలిచారని, ఈ కష్టకాలంలో జేఎస్‌పీఎల్‌ నుంచి రాష్ట్రానికి 500 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ పంపిన నవీన్‌ జిందాల్‌ను అభినందిస్తున్నా’ అంటూ మరో ట్వీట్‌ చేశారు.

అదే విధంగా రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలుస్తూ 1,000 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ పంపిన టాటాస్టీల్, రాయలసీమ ప్రాంతానికి ఆక్సిజన్‌ సరఫరా చేసిన జేఎస్‌డబ్ల్యూ గ్రూపు సీఎండీ సజ్జన్‌ జిందాల్‌లకు సీఎం కృతజ్ఞతలు తెలియచేస్తూ మరో రెండు ట్వీట్లు చేశారు.  

మరిన్ని వార్తలు