మనం ప్రజా సేవకులం

27 Apr, 2022 03:20 IST|Sakshi

ఎదిగే కొద్దీ ఒదిగి ఉందాం.. ఉన్నతాధికారులతో ‘స్పందన’లో సీఎం జగన్‌

సచివాలయాలపై ఎంత దృష్టి పెడితే అంత సమర్థంగా వాటి పనితీరు

స్పందనపై కలెక్టర్ల మార్కు కచ్చితంగా ఉండి తీరాలి.. ఇది మీ కార్యక్రమం

సిటిజన్‌ అవుట్‌ రీచ్‌తో ప్రతి నెలా ఇంటింటికీ సచివాలయ సిబ్బంది

పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు

ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత బాధ్యతగా వ్యవహరించేందుకే

ఏప్రిల్, మే, జూన్‌లో ముమ్మరంగా ఉపాధి హామీ.. మూడు నెలల్లో కనీసం 60 శాతం పనులు పూర్తి లక్ష్యం

కలెక్టర్లు, జేసీలు, పీడీలు, ఎంపీడీఓలు.. అంతా బాధ్యత తీసుకోవాలి

ఏడు కార్యక్రమాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరు మదింపు

ఎస్పీల పనితీరు మదింపు కోసం నాలుగు అంశాలు ప్రామాణికం

సాక్షి, అమరావతి: మనం బాస్‌లం కాదు.. ప్రజా సేవకులమనే విషయాన్ని నిరంతరం దృష్టిలో ఉంచుకోవాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించేందుకే 26 జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల సమస్యల పట్ల మరింత మానవీయ దృక్పథంతో ఉండాలని, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించిన అధికార యంత్రాగానికి తానిచ్చే సలహా ఇదేనని కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలనుద్దేశించి ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘స్పందన’లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మరింత మెరుగ్గా స్పందన కార్యక్రమం అమలుతోపాటు ఉపాధి హామీ, కలెక్టర్లు, ఎస్పీలు, జేసీల పనితీరు మదింపునకు సంబంధించి సీఎం జగన్‌ మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..

వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ
స్పందన అర్జీల పరిష్కారంపై వివిధ స్ధాయిల్లో పర్యవేక్షణ జరగాలి. సచివాలయం నుంచి మండల స్ధాయి, జిల్లా స్ధాయి వరకు వివిధ దశల్లో పర్యవేక్షణ ఉండాలి.  ప్రస్తుతం జిల్లాల పరిణామం తగ్గింది.స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత ముఖ్యం. మా కలెక్టర్‌ బాగా పనిచేస్తున్నారని ప్రజలు చెబుతున్నారంటే అర్జీలు నాణ్యతతో పరిష్కారమైనట్లే. ప్రధానంగా నాలుగైదు అంశాలపై కలెక్టర్లు దృష్టి సారించాలి. నిర్దేశిత కాలపరిమితిలోగా పరిష్కరించాలి. నిర్ణీత సమయానికి మించి పెండింగ్‌లో పెట్టకూడదు. ఒకే సమస్యపై తిరిగి రెండోసారి అర్జీ వస్తే కలెక్టర్‌ దృష్టికి రావాలి. ఈసారి అదే అధికారితో కాకుండా ఆపై అధికారితో అర్జీని పరిష్కరించాలి. నాణ్యతతో పరిష్కరించలేకపోతే మొత్తం ప్రక్రియ అంతా అర్థంలేనిది అవుతుంది. గ్రామ సచివాలయాల దగ్గర నుంచి అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ఉండాలి. మనం సక్రమంగా చేస్తున్నామా? లేదా? అన్నది పరిశీలించుకోవాలి. అర్జీలను పరిష్కరిస్తున్న విధానాన్ని పరిశీలించేందుకు జిల్లా, డివిజన్, మండలాల స్థాయిలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. ఆయా స్ధాయిల్లో వారానికి ఒకసారి అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించాలి. ఆ విధులను మరొకరికి అప్పగించరాదు.
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  
 
ఇతరులకు అప్పగించొద్దు..
స్పందనపై కలెక్టర్ల మార్కు కచ్చితంగా ఉండి తీరాలి. ఇది మీ కార్యక్రమం.. మీరు మాత్రమే దీనిపై దృష్టి సారించాలి. ఇతరులకు అప్పగించొద్దు. మీరే స్వయంగా పర్యవేక్షించండి. కలెక్టర్లు సక్రమంగా వ్యవహరిస్తేనే స్పందన విజయవంతం అవుతుంది. సచివాలయాల్లో రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్పందన నిర్వహిస్తున్నారు. అలా ఎవరైనా నిర్వహించకుంటే సంబంధిత నివేదికలు  తెప్పించుకుని పరిశీలించాలి. అర్జీలు తీసుకున్న రోజే రశీదు ఇచ్చి మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయాలి. అర్జీపై విచారణ జరుగుతున్నప్పుడు పిటిషనర్‌ను ఈ ప్రక్రియలో భాగస్వామిగా చేయాలి. క్షేత్రస్థాయి విచారణ సమయంలో తప్పనిసరిగా పిలవాలి. ఫొటో తీసి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. తమ సమస్యను పట్టించుకుంటున్నారనే భరోసా పిటిషనర్‌కు కలుగుతుంది. అర్జీని పరిష్కరిస్తున్నామా? తిరస్కరిస్తున్నామా? అన్నది తెలియజేయాలి.  

దృష్టి సారిస్తే మరింత సమర్థంగా..
సచివాలయాలపై ఎంత దృష్టి పెడితే అంత సమర్థంగా పనిచేస్తాయి. కలెక్టర్లు, జేసీలు వారానికి రెండు సచివాలయాల్లో పర్యటించాలి. మిగతా అధికారులు వారానికి కనీసం నాలుగు సచివాలయాలను సందర్శించాలి. సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించాలి. మీరు వెళ్లినప్పుడు వచ్చే నెలలో పథకాలకు  సంబంధించి లబ్ధిదారుల జాబితాను సోషల్‌ ఆడిట్‌ చేశారా.. లేదా? అన్నది పరిశీలించాలి. అంతకు ముందు నెలలో అమలైన పథకానికి సంబంధించి మిగిలిపోయిన అర్హులు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి.

మూడు నెలలు ముమ్మరంగా ‘ఉపాధి’.. 
ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో ఉపాధిహామీ పనులను ముమ్మరంగా చేసేందుకు అవకాశం ఉంటుంది. నిర్దేశించుకున్న లక్ష్యంలో కనీసం 60 శాతం పనులను ఈ మూడు నెలల్లోనే పూర్తి చేసేలా కలెక్టర్లు దృష్టి సారించాలి. ఏప్రిల్‌లో 250 లక్షల పనిదినాలను లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 185 లక్షల పనిదినాలు చేశాం. మిగిలినవి వేగంగా చేపట్టాలి. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి జిల్లాలో రోజూ కనీసం లక్ష పని దినాలు చేయాలి. నెలలో కనీసం 25 లక్షల పని దినాలను ప్రతి జిల్లాలో చేపట్టాలి. కలెక్టర్లు విస్తృతంగా పర్యటించి సమీక్షిస్తూ లక్ష్యాలను సాధించాలి. కలెక్టర్లు, జేసీలు, పీడీలు, ఎంపీడీఓలు.. ప్రతి అధికారీ దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
 
బిల్లులు క్లియర్‌.. 
సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌.. భవనాల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను క్లియర్‌ చేశాం. ఈ నెలలో కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. నెలాఖరులోగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉపాధి హామీ నిధులను ఈ నెలాఖరులోగా తెచ్చేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్స్, డిజిటల్‌ లైబ్రరీలు.. అన్నింటినీ పూర్తి చేయాలి. కంపెనీల నుంచి సిమెంట్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణకు కలెక్టర్లు నోడల్‌ అధికారిని నియమించాలి. సిమెంట్, స్టీలు, ఇసుక, మెటల్‌ సరఫరా సవ్యంగా సాగేలా నోడల్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలి.  దీనిపై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సచివాలయం పరిధిలో మరోసారి పునఃపరిశీలన చేసి భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి.  డిసెంబర్‌ నాటికి 4,545 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తి కావాలి. అదే సమయానికి ఇంటర్నెట్‌ కేబుల్‌ కూడా సంబంధిత గ్రామాలకు సమకూరుతుంది. తద్వారా గ్రామాల్లోనే వర్క్‌ఫ్రం హోమ్‌ అందుబాటులోకి వస్తుంది.

ప్రగతి ఆధారంగా పనితీరు మదింపు
ఏడు రకాల ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరును మదింపు చేస్తాం. ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ స్కూళ్లు – ఆస్పత్రుల్లో నాడు–నేడు, సమగ్ర భూసర్వే, స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత, ఎస్‌డీజీ లక్ష్యాలు, ఉపాధిహామీ పనులు, సచివాలయాల పనితీరు... ఈ అంశాల్లో ప్రగతి ఆధారంగా వారి పనితీరును మదింపు చేస్తాం. ఏసీబీ, ఎస్‌ఈబీ, దిశ, సోషల్‌ మీడియా ద్వారా వేధింపుల నివారణ అంశాల్లో ప్రగతి ఆధారంగా ఎస్పీల పనితీరును మదింపు చేస్తాం. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగాలి. కానీ సమీక్ష పేరుతో అనవసరంగా కాలహరణం వద్దు. గంట లోపలే ముగించి పనిలో ముందుకుసాగాలి. 

సిటిజన్‌ అవుట్‌ రీచ్‌తో ప్రతి ఇంటికీ.. 
ప్రతి నెలలో చివరి శుక్రవారం, శనివారం వలంటీర్లు, సచివాలయ సిబ్బంది సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటికీ వెళ్లాలి. వచ్చే నెలలో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రతి వారం రెండు రోజులపాటు కలెక్టర్లు, జేసీలు గ్రామ సచివాలయాలను పర్యవేక్షించాలి. 

మే నెలలో పథకాలు ఇవీ 
జగనన్న విద్యా దీవెన, ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్‌ రైతు భరోసా,  మత్స్యకార భరోసా పథకాలను మే నెలలో అమలు చేస్తున్నాం. ఈ నాలుగు కార్యక్రమాల గురించి సిటిజన్‌ అవుట్‌రీచ్‌లో వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ప్రజలకు వివరించాలి. సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ను కూడా కలెక్టర్లు పర్యవేక్షించాలి. 

మీరు మంచి చేస్తే.. నేను మంచి చేసినట్లవుతుంది. మీరే నా కళ్లు, చెవులు. రాష్ట్రంలో ఎలాంటి అవినీతి, వివక్షకు తావు లేకుండా పథకాలను అమలు చేస్తున్నాం. రూ.1.37 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బటన్‌ నొక్కి పారదర్శకంగా జమ చేశాం. ఇదంతా మీ పర్యవేక్షణ వల్లే సాధ్యమైంది.
– ఉన్నతాధికారులతో సీఎం జగన్‌  

మరిన్ని వార్తలు