మీ బిడ్డకు నిజాయితీ ఉంది.. చెప్పిందే చేసి చూపిస్తాడు: సీఎం జగన్‌

30 Nov, 2022 13:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహిళలను దగా చేసిన చంద్రబాబు మహిళా సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను దగా చేసి నేడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు చంద్రబాబు మాటలు చూస్తుంటే ప్రజలు 'ఇదేం ఖర్మరా బాబూ' అనుకుంటున్నారని సీఎం జగన్‌ చెప్పారు.  

జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం. పేదరికం చదువులకు అవరోధం కావొద్దని దివంగత నేత వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తెచ్చారు. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడ్డారు. ఆతర్వాత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగార్చాయి. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నాం అని సీఎం జగన్‌ చెప్పారు. 

11.02లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లు
చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించాం. జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించాం. జులై- సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లు జమ చేస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేస్తున్నాం. పిల్లల చదువుకు పెట్టే ఖర్చును ఖర్చుగా భావించం.. ఆస్తిగా భావిస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందిని చదివిస్తానని భరోసా ఇస్తున్నా. మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటా. మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే అని సీఎం జగన్‌ అన్నారు. 

ఏపీలో తప్ప మరే రాష్ట్రంలోనూ లేదు
పిల్లల చదువుతోనే ఇంటింటా వెలుగులు నింపాలని నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం. విద్యారంగాన్ని ఉపాధికి చేరువుగా తీసుకెళ్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌, ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాం. పిల్లలను పాఠశాలలకు పంపితే అమ్మ ఒడి కింద సాయం చేస్తున్నాం. అమ్మ ఒడి పథకం ఏపీలో తప్ప ఏ రాష్ట్రంలోనూ లేదు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు విద్యార్థులకు, టీచర్లకు ట్యాబ్‌లతో సమూల మార్పులు చేశాం. 

ఉన్నత విద్యలో కూడా మార్పులు తెచ్చాం. ప్రఖ్యాత కంపెనీల సర్టిఫైడ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నాం. అమ్మ ఒడి కింద రూ.19,617 కోట్లు, జగనన్న విద్యాకానుకకు రూ.2,368 కోట్లు విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్‌లకు రూ.685 కోట్లు ఖర్చు చేశాం. నాడు-నేడు తొలి దశకు రూ.3,669 కోట్లు, రెండో దశకు రూ.8వేల కోట్లు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణకు రూ.4,895 కోట్లు.. ఇలా మూడున్నరేళ్లలో విద్యారంగానికి రూ.55వేల కోట్లు ఖర్చు చేశాం. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా 85వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాం. 

తేడా గమనించండి
'ప్రతిపక్షాలకు వివేకం రావాలని కోరుకుంటున్నా. నా భూముల్లోనే రాజధాని కట్టాలనే ఆలోచన నుంచి బయటపడే.. దేవుడు బుద్ది, జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నా. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదించే వారికి జ్ఞానం రావాలి. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఇంగిత జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నాను.

మనం రాక్షసులు, మారీచులతో యుద్ధం చేస్తున్నాం. దుష్టచతుష్టయం మాటలు నమ్మొద్దు. మీ బిడ్డ పత్రికలు, చానళ్లు, దత్తపుత్రుడ్ని నమ్ముకోలేదు. మీ బిడ్డకు నిజాయితీ ఉంది.. చెప్పిందే చేసి చూపిస్తాడు. ప్రజల్ని, ఆ దేవుడ్ని మీ బిడ్డ నమ్ముకున్నాడు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా గమనించండి. మంచి జరిగితే మీ జగనన్నకు తోడుగా ఉండండి' అని సీఎం జగన్‌ ప్రజల్ని కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు