ఏపీకి పరిశ్రమల పట్టం

26 Feb, 2023 02:49 IST|Sakshi
తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీస్‌ ప్రారంభోత్సవంలో సీఎం జగన్, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా తదితరులు (ఫైల్‌)

44 నెలల్లో వాస్తవ రూపంలోకి రూ.75,649.77 కోట్ల పెట్టుబడులు

ఇందులో భారీ, మెగా యూనిట్ల రూపేణా రూ.56,534.53 కోట్లు 

సగటున ఏటా రూ.15,418 కోట్లు.. 

రూ.13,766 కోట్ల విలువైన 6 భారీ పరిశ్రమలను ప్రారంభించిన సీఎం

వీటి ద్వారా 15,040 మందికి ఉపాధి

రూ.13,962 కోట్ల విలువైన 17 భారీ పరిశ్రమలకు భూమి పూజ

తద్వారా 24,866 మందికి లభించనున్న ఉపాధి

రూ.35,672.28 కోట్ల విలువైన 7 భారీ యూనిట్లు ప్రారంభానికి సిద్ధం

రూ.46,621.82 కోట్ల విలువైన మరో 5 భారీ యూనిట్లు భూమి పూజకు సిద్ధం 

ఏపీ ప్రభుత్వ సహకారం నేపథ్యంలో త్వరలో మరిన్ని పరిశ్రమలు

సుదీర్ఘ తీర ప్రాంతం.. అపారమైన సహజ వనరులు.. మానవ వనరుల కొరత లేకపోవడం.. వీటన్నింటికీ తోడు అన్ని విధాలా ప్రభుత్వ సహకారం.. కొత్తగా పరిశ్రమ స్థాపించడానికి ఏ పారిశ్రామికవేత్తకైనా ఇంతకంటే ఏం కావాలి? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో ఉండటంతో దిగ్గజ సంస్థల చూపు ఇప్పుడు రాష్ట్రంపై పడింది. పరిశ్రమలు పెడుతున్న వారిని చేయి పట్టుకుని నడిపించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకు రావడంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇతరుల కంటే నాలుగడుగులు ముందుండటం కలిసివస్తోంది. 

సాక్షి, అమరావతి: పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని దిగ్గజ సంస్థలు పారిశ్రామిక అనుకూల విధానాలున్న మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఇప్పటికే టాటాలు, బిర్లాలు, అదానీ, అర్సెలర్‌ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్‌ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)లో పెట్టుబడులు పెట్టడానికి అనేక దిగ్గజ సంస్థలు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సీఎం అధ్యక్షతన ఢిల్లీతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబయి, హైదరాబాద్‌ వంటి పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలకు పెట్టుబడి­దారుల నుంచి విశేష స్పందన వచ్చింది. కోవిడ్‌ సంక్షోభ సమయంలో రాష్ట్ర పరిశ్రమలను ఆదుకునేలా సీఎం జగన్‌ చూపిన చొరవ దేశ పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది.

అప్పటికే రాష్ట్రంలో అడుగుపెట్టిన పరిశ్రమలు త్వరిత­గతిన ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటూనే.. మరో పక్క కొత్త పెట్టుబ­డులను ఆకర్షించే విధంగా ప్రభు­త్వం వేగంగా అడుగులు ముందుకు వేసింది. గత 44 నెలల్లో పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడంతోపాటు, సులభతర వాణిజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉండటం పారిశ్రామిక వేత్తలను ఇటువైపు వచ్చేలా చేస్తోంది.

కోవిడ్‌ సమయంలో ఉపాధి
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పగ్గాలు చేపట్టి్టన తర్వాత 2019 జూన్‌ నుంచి 2023 జనవరి వరకు రూ.75,649.77 కోట్ల విలువైన పెట్టుబడులు (ఎంఎస్‌ఎంఈ సహా) వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో 111 భారీ, మెగా యూనిట్లు రూ.56,534.53 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 73,876 మందికి ఉపాధి లభించింది. అంటే సగటున ఏడాదికి రూ.15,418 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి మొదలైంది.

ఇందులో సీఎం వైఎస్‌ జగన్‌ చేతులు మీదుగా రూ.13,766 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఆరు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. వీటి ద్వారా 15,040 మందికి ఉపాధి లభించింది. ఇవి కాకుండా రూ.7,305 కోట్ల విలువైన కియా పరిశ్రమ వాణిజ్య పరమైన ఉత్పత్తిని కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 2019 డిసెంబర్‌ 5న లాంఛనంగా ప్రారంభించారు.

వీటికి అదనంగా ఎంఎస్‌ఎంఈ రంగంలో 1,52,558 కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.19,115.24 కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా 13,63,706 మందికి ఉపాధి లభించింది. ప్రస్తుత ప్రభుత్వంలో గత 44 నెలల్లో సుమారు 24 నెలలు కోవిడ్‌ సంక్షోభంతో గడిచి పోయిన­ప్పటికీ భారీ ఎత్తున పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో ముందంజలో ఉందని స్పష్టమవుతోంది.

మరో రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడులు 
ఇవికాక  మరో 86 ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,35,125.60 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవీ వాస్తవ రూపంలోకొస్తే 2,36,806 మందికి ఉపాధి లభించనుంది. వీటిలో రూ.35,672.28 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఏడు భారీ యూని­ట్లు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వా­రా 7,015 మందికి ఉపాధి లభించనుంది.

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక సుమారు రూ.13,962 కోట్ల పెట్టుబ­డులకు సంబంధించిన 17 యూనిట్ల భూమి పూజ కార్యక్ర­మంలో పాల్గొన్నారు. వీటి ద్వారా 24,866 మందికి ఉపాధి లభించనుంది. మరో 5 భారీ యూనిట్లు అన్ని అనుమ­తులు తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించడానికి  సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా రూ.46,621.82 కోట్ల పెట్టుబడులతో 15,800 మందికి ఉపాధి లభించనుంది.  

>
మరిన్ని వార్తలు