మన మహిళలు దేశానికే ఆదర్శం

30 Jun, 2021 02:46 IST|Sakshi
దిశ యాప్‌ పోస్టర్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు, ఉన్నతాధికారులు

అక్కచెల్లెమ్మల భద్రతకు పటిష్ట చర్యలు..  ‘దిశ’ యాప్‌పై అవగాహన సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌

ఆపద ఎదురైతే ఈ యాప్‌ ద్వారా నిమిషాల్లోనే పోలీసు రక్షణ 

మహిళా పోలీసులు, వలంటీర్లు ‘దిశ’ రాయబారులు కావాలి

ప్రతి ఇంటికీ వెళ్లి ఈ యాప్‌ ఆవశ్యకత వివరించాలి

అందరి ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేయించగలిగితే ఎంతో మేలు 

ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఓ అన్నయ్య తోడున్నట్టే

ప్రయాణాల్లోనూ ఎంతో భద్రత

అక్క చెల్లెమ్మల భద్రత కోసమే దిశ యాప్‌ను రూపొందించాం. ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మ మొబైల్‌ ఫోన్లో దిశ యాప్‌ ఉండాలి. కనీసం కోటి మందికిపైగా సెల్‌ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించాలి. ఈ యాప్‌ ఉంటే అన్నయ్య తోడున్నట్టే. ఆపదలో చిక్కుకుంటే ఈ యాప్‌లోని ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే చాలు. అందుకు అవకాశం లేకుంటే సెల్‌ ఫోన్‌ను అటూ ఇటూ గట్టిగా ఊపితే చాలు. నిమిషాల్లో పోలీసులు మీరున్న ప్రదేశానికి వచ్చి మీకు రక్షణ కల్పిస్తారు. అందుకోసం ఎన్నో ఫీచర్లు ఈ యాప్‌లో అందుబాటులోకి తెచ్చాం. 
– సీఎం వైఎస్‌ జగన్‌ 

ప్రతి ఇంటికీ వెళ్లి యాప్‌ డౌన్‌లోడ్‌ చేయిస్తున్నాం  
మా సచివాలయంలో 32 మంది వలంటీర్లకు గాను 26 మంది మహిళా వలంటీర్లు ఉన్నారు. వాళ్లందరికీ దిశ యాప్‌ గురించి వివరించి డౌన్‌లోడ్‌ చేయించాను. వీరందరూ ఇంటింటికీ వెళ్లి యాప్‌ ఉపయోగం గురించి వివరిస్తూ డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు. రెండు రోజుల్లో 1,515 మంది సెల్‌ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు.  
– కనకదుర్గ, మహిళా పోలీస్, గొల్లపూడి సచివాలయం   

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మహిళ దేశానికే ఆదర్శం కావాలన్నదే తమ లక్ష్యం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ దిశగా ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని, ప్రతి అడుగు కూడా అక్కచెల్లెమ్మలకు మేలు చేసేదిగానే ఉంటుందన్నారు. మహిళల భద్రత కోసం స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కనీసం ఒక్కో జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున.. మొత్తంగా 18 దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 900 మొబైల్‌ పెట్రోలింగ్‌ ద్విచక్ర వాహనాలను ప్రారంభించామని, ఒక వారంలో మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దిశ కేసులకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించామని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

దిశా చట్టాన్ని మెరుగు పరుస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. వీటన్నింటికీ తోడు ఆపద వేళల్లో అక్కచెల్లెమ్మలకు ఓ అన్నయ్యగా అండగా నిలిచేలా ‘దిశ’ యాప్‌ను రూపొందించామని, ఈ యాప్‌ను అందరూ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలన్నారు. విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలోని గ్రామ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ‘దిశ యాప్‌ అవగాహన సదస్సు’లో ఆయన పాల్గొన్నారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, ఆపద ఎదురైతే ఆ యాప్‌ను ఉపయోంచి తక్షణం పోలీసు రక్షణ పొందే విధానాన్ని ఆయన స్వయంగా మహిళలకు వివరించారు. మహిళలు, యువతులతో గూగుల్‌ ప్లే స్టోర్, యాపిల్‌ స్టోర్‌లో దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేయించారు. యాప్‌ పనితీరులో భాగంగా దిశ పోలీసులు నిర్వహించిన డెమోనూ మహిళలకు చూపించి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పైగా పోలీస్‌ స్టేషన్లలో అధికారులు, ఇతర సిబ్బంది వర్చువల్‌గా వీక్షించిన ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  
సదస్సులో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు వనిత, సుచరిత, పుష్పశ్రీవాణి, సదస్సులో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని..మొబైల్‌ను చూపుతున్న మహిళలు 
ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలి 
– అక్కచెల్లెమ్మల సెల్‌ఫోన్‌లో ఈ దిశ యాప్‌ ఉండాలి. అందుకోసం మహిళా పోలీసులు, వలంటీర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించాలి. ఈ యాప్‌ ఉంటే జరిగే మంచి గురించి తెలపాలి. దిశ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో స్వయంగా వివరించాలి. ఈ ప్రచారాన్ని ఒక ప్రత్యేక డ్రైవ్‌లా చేపట్టాలి.  
– దిశ యాప్‌కు ఎంతటి ప్రాముఖ్యత ఉందన్నది మహిళా పోలీసులు, వలంటీర్లకు బాగా తెలుసు.  
మొన్న ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన సంఘటన నా మనసును చాలా కలచివేసింది. ఓ అమ్మాయి ఏ  సమయంలోనైనా బయటకు వెళ్లినప్పుడు, జన సందోహం లేనప్పుడు అనుకోకుండా ఏమైనా జరిగితే వాళ్ల పరిస్థితి ఏమిటన్నదానికి ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన సంఘటనే నిదర్శనం. 
– ఏడాది క్రితం తెలంగాణలో దిశ అనే అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం తెలిసిందే. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం దాన్ని ఎలా ఆపగలం అనే ఆలోచన నుంచే ఈ దిశ యాప్‌ను అభివృద్ధి చేశాం. ఈ యాప్‌ను ఎంత ఎక్కువ మంది అక్కచెల్లెమ్మలతో డౌన్‌లోడ్‌ చేయించగలిగితే అంత ఎక్కువగా వారికి  సహాయం చేయగలుగుతాం.  
– ఆపదలో వారికి తోడుగా నిలబడే పరిస్థితి వస్తుంది. అందుకే మహిళా పోలీసులు, వలంటీర్లు, ఇతర సచివాలయ సిబ్బంది దిశ యాప్‌ రాయబారులుగా వ్యవహరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి ఈ యాప్‌ ఆవశ్యకతను వివరించి డౌన్‌లోడ్‌ చేయించాలి.  
 
బటన్‌ నొక్కితే చాలు వెంటనే పోలీసు రక్షణ  
– ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఓ అన్నయ్య మీకు తోడున్నట్టుగా భావించవచ్చు. అనుకోని విధంగా ఏదైనా ఆపద కలిగినప్పుడు ఈ యాప్‌లోని ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కిన వెంటనే పోలీసులు నిమిషాల్లో మీ దగ్గరకు వస్తారు. 
– ముందు మీకు ఫోన్‌ చేస్తారు. మీరు ఫోన్‌ ఎత్తి పొరపాటున బటన్‌ నొక్కుకుపోయింది అని అంటే సరే అని రారు. ఇబ్బందుల్లో ఉన్నాము అని మీరు చెబితే నిమిషాల్లోనే మీరున్న ప్రదేశానికి వచ్చి మీకు రక్షణ కల్పిస్తారు.  
– ఒకే వేళ మీరు ఫోన్‌ ఎత్తకపోయినా సరే.. మీరు ఆపదలో ఉన్నారని అర్థం చేసుకుని వెంటనే వచ్చి మీకు రక్షణగా నిలుస్తారు. ఈ యాప్‌ ద్వారా మీ లొకేషన్‌ అంటే మీరున్న ప్రదేశం ఎక్కడ ఉందన్న సమాచారం నేరుగా కంట్రోల్‌ రూమ్‌కు తెలుస్తుంది. తద్వారా పోలీసులు నేరుగా మీరున్న ప్రదేశానికి వచ్చి రక్షణ కల్పించేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశాం.  
 
ఆపదలో ఫోన్‌ ఊపితే చాలు..  
– అక్కచెల్లెమ్మలకు ఆపద కలిగినప్పుడు ఫోన్‌లో ఉన్న బటన్‌ నొక్కేంత సమయం లేనప్పుడు.. ఆ ఫోన్‌ను అటూ ఇటూ గట్టిగా ఊపితే చాలు మీరు ఆపదలో ఉన్నారని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం వెళ్తుంది. అక్కడ నుంచి మీకు ఫోన్‌ చేస్తారు. మీరు ఫోన్‌కు స్పందించలేదంటే మీరు ఆపదలో ఉన్నారని గుర్తించి వెంటనే మీ వద్దకు చేరుకుని రక్షణ కల్పిస్తారు.  
– ఈ విధంగా మనం ఎక్కడికి పోయినా, ఏ పరిస్ధితుల్లో ఉన్నా ఫోన్‌ మన దగ్గర ఉంటే చాలు మనకు ఎలాంటి ముప్పు కలగకుండా ఓ అన్నయ్యలా ఈ యాప్‌ అండగా నిలుస్తుంది. ఈ యాప్‌ను ఎంత ఎక్కువగా డౌన్‌ లోడ్‌ చేయిస్తే అంత మంచి జరుగుతుంది.  
– అది ఎలా వాడాలి, దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేర్పించాలి. ఇదొక పెద్ద కార్యక్రమం. దీన్ని వలంటీర్లు, మహిళా పోలీసులు, మహిళా మిత్రలు అందరూ బాధ్యతగా తీసుకుని ప్రతి ఇంటికి వెళ్లి డౌన్‌ లోడ్‌ చేయించాలి.  
– గొల్లపూడి గ్రామంలో దాదాపు 2,800 ఇళ్లకు గాను ఇప్పటికే 15 వందల ఇళ్లలో డౌన్‌ లోడ్‌ చేశారు. మిగిలిన 1,300 ఇళ్లలో త్వరలోనే డౌన్‌లోడ్‌ చేయిస్తారనే నమ్మకం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో అందరి ఇళ్లకు వెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించాలి.  
 
ట్రాక్‌ మై ట్రావెల్‌ ఫీచర్‌  
– ఈ యాప్‌లో ఉన్న మరో ముఖ్య అంశం కూడా ఉంది. మనం ఎక్కడకైనా ఆటోలోనో, ట్యాక్సీలోనో  తెలియని వాళ్ల వాహనంలో ప్రయాణం చేయాల్సి రావచ్చు. అప్పుడు వాళ్ల మీద మనకు ఏమైనా కొద్దిగా అనుమానం వచ్చినా ఈ యాప్‌ మనకు రక్షణగా నిలుస్తుంది.  
– ఈ యాప్‌లో మనం వెళ్లాల్సిన లొకేషన్‌ను ఈ యాప్‌లో టైప్‌ చేసి ట్రాక్‌ మై ట్రావెల్‌ అనే బటన్‌ నొక్కితే చాలు. మీరు వెళ్లాల్సిన రూట్‌ను చూపిస్తుంది. మీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీస్‌ కంట్రోల్‌ రూం ట్రాకింగ్‌లో పెడుతుంది. ఆ వాహనం సరైన మార్గంలో వెళ్లకపోతే పోలీసులు వెంటనే వస్తారు. మీకు రక్షణ కల్పిస్తారు.  
– మహిళలకు పోలీసులు ఏదైనా సందేశం ఇవ్వడానికి ‘పుష్‌’ బటన్‌ ఆప్షన్‌ ఈ యాప్‌లో ఉంది. త్వరలోనే మరిన్ని ఆప్షన్లను కూడా పొందుపరచనున్నాం. సున్నితమైన, ప్రమాదకర ప్రదేశాలు, చైన్‌ స్నాచింగ్‌ వంటి వాటికి ఆస్కారం ఉన్న ప్రాంతాల గురించి మహిళలను అప్రమత్తం చేసేలా అదనపు ఫీచర్లు ఏర్పాటు చేయబోతున్నాం. 
  
కోటి మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకునేలా చేయాలి 
– రాష్ట్రంలో స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్న ప్రతి అక్క, చెల్లెమ్మ ఫోన్లో ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ కావాలి. ఇప్పటికే 17 లక్షల మందికిపైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.  
– కనీసం కోటి మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకునేలా చేయాలి. మన ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇప్పటికే నాలుగు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. 
 
దిశ పోలీస్‌ స్టేషన్లు 
– మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాకు కనీసం ఒక పోలీస్‌ స్టేషన్‌ ఉండేలా చేయడంతో పాటు వాటిలో పూర్తిగా మహిళా అధికారులు, సిబ్బందినే నియమించాం.  
– మహిళలకు సైబర్‌ క్రైం, ఇతరత్రా సమస్యలు ఎదురైతే ఆ పోలీస్‌ స్టేషన్‌కు వెళితే చాలు. అక్కడ అంతా మహిళలే ఉంటారు కాబట్టి మనస్ఫూర్తిగా వారితో మాట్లాడొచ్చు. వారు మీ సమస్యలు పూర్తిగా వింటారు. ఫిర్యాదు తీసుకుంటారు. మీ సమస్యను సత్వరం పరిష్కరిస్తారు.  
– దాదాపు 900 మొబైల్‌ పెట్రోలింగ్‌ ద్విచక్ర వాహనాలను కూడా ఈ మధ్యే ప్రారంభించాం. పెట్రోలింగ్‌ను ఇంకా పెంచేందుకు ఈ వారంలోనే మరిన్ని వాహనాలు వాహనాలను తీసుకురానున్నాం.   
 
ప్రత్యేక కోర్టులు 
– దిశా చట్టాన్ని కూడా మెరుగ్గా చేసేందుకు, మరింత ఉపయోగకరంగా ఉండేటట్టు చేసి బిల్లును  
కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అనుమతులు మంజూరు కేంద్రం చేతిలో ఉంది కాబట్టి ఇంకా పూర్తి చట్టం తీసుకురాలేకపోయాం. ఈలోగా మనం చేయాల్సిన వాటికి సంబంధించి ప్రతి అడుగు ముందుకు వేస్తున్నాం. 
– దిశ కోసం ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడుతున్నాం. ప్రత్యేకంగా దిశ కేసులనే చూడటానికి ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. 
 
అట్టడుగు వర్గాల్లో విశ్వాసం 
– ఈ రాష్ట్ర హోం మంత్రి ఓ మహిళ. నా చెల్లి, దళితురాలు. అట్టడుగు వర్గాల్లో విశ్వాసం నింపేందుకు ఈ విషయం చెబుతున్నాం. అట్టడుగు వర్గాలకు కూడా పూర్తి న్యాయం జరుగుతుంది. పోలీసుల దగ్గరికి వెళ్లడానికి భయపడాల్సిన పని లేదు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు అనే మెసేజ్‌ పోవడానికి ఉపయోగపడుతుంది.  
– ఈ యాప్‌ అభివృద్ధి చేసే విషయంలో సుచరితమ్మ కూడా కీలక పాత్ర పోషించారు. ‘దిశ’కు సంబందించిన ఇద్దరు మహిళా అధికారులను నియమించాం. ఐపీఎస్‌ అధికారి దీపికా పాటిల్, ఐఏఎస్‌ అధికారి కృతికా శుక్లా ప్రత్యేకంగా దిశ కార్యక్రమాల మీదే పని చేస్తున్నారు.  
– ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య(నాని), ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, డీజీపీ గౌతం సవాంగ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.  
 
మూడు నిమిషాల్లోనే పోలీసు రక్షణ  
సదస్సుకు హాజరైన ఓ వలంటీర్‌ తన సెల్‌ఫోన్‌ నుంచి దిశ యాప్‌లోని ఎస్‌ఓస్‌ బటన్‌ను నొక్కింది. వెంటనే పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి ఆమెకు ఫోన్‌ వచ్చింది. మీ రక్షణకు వస్తున్నాం.. ఏమీ కంగారు పడొద్దు.. అని వారు ధైర్యం చెప్పారు. అనంతరం కంట్రోల్‌ రూం సిబ్బంది ఆమె ఉన్న ప్రదేశానికి సమీపంలోని భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. వెంటనే ఆ యువతి రక్షణకు వెళ్లాలని చెప్పారు. ఆ వెంటనే భవానీపురం పోలీసులు ఆ వలంటీర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. కాసేపటికే తమ వాహనంలో ఆమె వద్దకు వచ్చారు. వలంటీర్‌ దిశ యాప్‌ను ఉపయోగించినప్పటి నుంచి కేవలం మూడు నిముషాల్లోనే ఆమె వద్దకు పోలీసులు రావడం విశేషం. ఆమె ఉన్న ప్రదేశం గురించి నావిగేషన్‌ ద్వారా తెలుసుకోవడం, తక్షణ ఆధారాల సేకరణ కోసం పోలీసుల యూనిఫాంకు కెమెరాలు అమర్చిన విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అందరికీ వివరించారు. ఈ మొత్తం డెమోను డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరిస్తూ స్రీన్లపై చూపించడంతో యాప్‌ ఎంత సమర్థంగా పని చేస్తుందన్నది అందరికీ స్పష్టంగా తెలిసింది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు