చంద్రబాబు కుప్పం నుంచి కావాల్సింది తీసుకున్నాడు.. చేసిందేం లేదు: సీఎం జగన్‌

23 Sep, 2022 14:11 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నాడని, అలాంటి వ్యక్తి కుప్పం నుంచి తనకు కావాల్సింది తీసుకున్నాడే తప్ప.. చేసిందేమీ లేదని సీఎం జగన్‌ చాటిచెప్పారు. కుప్పం అనిమిగానిపల్లి బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. 

కుప్పంను చంద్రబాబు ఏనాడూ సొంత గడ్డగా భావించలేదని, హైదరాబాదే ముద్దు అని భావించాడు. అందుకే సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టుకున్నాడు. కుప్పంలో సొంత ఇల్లు కాదు కదా.. ఓటు కూడా లేదు. చంద్రబాబు హైదరాబాద్‌కి లోకల్‌.. కుప్పానికి నాన్‌లోకల్‌ అని ఎద్దేవా చేశారు. కనీసం ప్రజలకు ఏం కావాలో కూడా ఆయన ఆలోచించలేదని సీఎం జగన్‌ అన్నారు. 

గత పరిపాలనలో కంటే అప్పులు ఈ ప్రభుత్వం తక్కువగా చేస్తోందని, అదే సమయంలో అభివృద్ధి ఎక్కువగా చేస్తున్నామని సీఎం జగన్‌ తెలియజేశారు. అప్పుడు.. దోచుకో పంచుకో తినుకో ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు.. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు బాగుపడ్డారని అన్నారాయన. కానీ, ఇప్పుడు తమ ప్రభుత్వంలో సంక్షేమం సాధ్యమైందని, ప్రజలు అది గుర్తించాలని సీఎం జగన్‌ మనవి చేసుకున్నారు.  చంద్రబాబుది చేతగాని తనం అనాలా? చేయకూడదనే దుర్భుద్ది అనాలా? అర్థం కావట్లేదన్నారు ఆయన. 

ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు..  14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గంలో కరువు సమస్యకు పరిష్కారం చూపించలేకపోయాడని అన్నారు. పైగా హంద్రీనీవాకు ఆటంకంగా కూడా మారారన్నారు. తనకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చాడని, కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డాడని, కుప్పంకు మంచి నీళ్లు మాత్రం తెప్పించలేకపోయాడన్నారు. కుప్పంలో సరైన రోడ్లు కూడా వేయించలేకపోయారని విమర్శించారు. ఉపాధి కల్పించాలనే ఆలోచన కూడా చేయలేదని.. కుప్పం నుంచి నిరుద్యోగులు కూడా తరలిపోయారన్నారు. కుప్పానికి చేం చేయలేని చేతగాని నాయకుడు ఈ చంద్రబాబు అని సీఎం జగన్‌ మండిపడ్డారు.

చివరకు.. సీఎంగా ఉన్న టైంలో ఏనాడూ రెవెన్యూ డివిజన్‌ గురించి ఆలోచించలేదని, కానీ, ప్రజా ఒత్తిడితో రెవెన్యూ డివిజన్‌ కావాలని లేఖ రాశాడని సీఎం జగన్‌ తెలిపారు. ‘‘కానీ, జగన్‌ మీవాడు.. మంచోడు.. మీ బిడ్డ.. మీరు అడిగారు.. జగన్‌ ఇచ్చాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వెన్నుపోటుకు, దొంగ ఓటుకు కేరాఫ్‌ ఎవరంటే అది చంద్రబాబేనని అని అన్నారు.  బీసీల సీటు అయిన కుప్పంను సైతం లాక్కుని తన మార్క్‌ సామాజిక న్యాయం ప్రదర్శించాడని ఎద్దేవా చేశారు సీఎం జగన్‌.

‘‘చంద్రబాబుకు తలవంచేది లేదని కుప్పం ప్రజలు తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత అన్ని ఎన్నికల్లోనూ క్లీన్‌ స్వీప్‌ చేశాం. కుప్పం ప్రజలు బాబు అవినీతికి వ్యతిరేకంగా ఓటేశారు. కుప్పం ప్రజలకు మూడేళ్లలో పథకాలతో రూ.1,149 కోట్లు ఇచ్చాం. కుప్పం నియోజక వర్గంలో డీబీటీ ద్వారా రూ.866 కోట్లు ఇచ్చాం. నాన్‌ డీబీటీ ద్వారా రూ.283కోట్లు ఇచ్చాం. చంద్రబాబుకు తనకు పిల్లనిచ్చిన మామపై ఎలాంటి ప్రేమ ఉందో.. కుప్పంపై కూడా అలాంటి వెన్నుపోటు ప్రేమే ఉందన్నారు.

కుప్పాన్ని మున్సిపాలిటీ చేశాం. ఆరు నెలల్లో హాంద్రీనీవా పనులు పూర్తి చేస్తాం. కలగా మిగిలిన ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. రామకుప్పంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశాం. ఇంటిగ్రేగెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ను కూడా పూర్తి చేశాం. ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజీ పూర్తి చేశాం. ఇంకా చాలా చేశాం. ఇవన్నీ పూర్తి చేసింది మీ బిడ్డే అని సీఎం జగన్‌ కుప్పం ప్రజలకు గుర్తు చేశారు. 

ఈ మూడేళ్లలోనే కుప్పం సిసలైన అభివృద్ధిని చూసింది. ఎమ్మెల్సీగా ఉంటూనే భరత్‌ నాతో ఇన్ని మంచి పనులు చేయించాడు. భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తా. ఈ ప్రభుత్వం.. మీ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకోండి అని సీఎం జగన్‌ కుప్పం ప్రజలకు చివరగా విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు