Andhra Pradesh: పేదరికమే కొలమానం

3 Jun, 2021 03:29 IST|Sakshi

అగ్రవర్ణ పేదలకు రెండేళ్లలో రూ.21,272.36 కోట్ల మేర లబ్ధి

1.88 కోట్ల మందికి నవరత్నాలతో పెద్ద ఎత్తున ప్రయోజనం

కులమతాలు, ప్రాంతాలు, పార్టీలనే వ్యత్యాసం లేదు

వైఎస్సార్‌ రైతు భరోసాతో రూ.3,590.48 కోట్లు సాయం

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద రూ.5,947.77  కోట్లు

జగనన్న అమ్మ ఒడి ద్వారా రూ.2,047.91 కోట్లు

సాక్షి, అమరావతి: పేదరికమే ప్రాతిపదికగా అగ్రవర్ణ పేదలకూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ల పాలనలో భారీగా ప్రయోజనం కల్పించారు. ఎక్కడా కులమతాలు, ప్రాంతాలు, ఏ పార్టీ అనే అంశాలకు తావివ్వలేదు. సిఫారసులు, లంచాల ప్రసక్తే లేదు. కేవలం పేదలైతే చాలు. పేదరికమే ప్రామాణికంగా ఆఖరికి తనకు ఓటు వేయని వారికి సైతం అర్హులందరికీ మేలు చేకూర్చారు. నవరత్నాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులే ఇందుకు నిదర్శనం. అగ్రవర్ణ పేదలంతా నవరత్నాల ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనం పొందారు. గతంలో ఏ ప్రభుత్వమూ అగ్రవర్ణ పేదలకు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. 2019 జూన్‌ నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకు రాష్ట్రంలో 1,88,91,438 మంది అగ్రవర్ణ పేదలకు (కాపులను మినహాయించి) నేరుగా నగదు బదిలీతో పాటు నగదేతర బదిలీ పథకాల ద్వారా ఏకంగా రూ.21,272.36 కోట్ల మేర ఆర్థిక సాయం అందింది.

నేరుగా నగదు బదిలీ పథకాల ద్వారా 1.49 కోట్ల  మందికిపైగా అగ్రవర్ణ పేదలకు రూ.18,246.83 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఆరోగ్యశ్రీ, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, ఇళ్ల స్థలాల భూ సేకరణ లాంటి నగదు బదిలీయేతర పథకాల ద్వారా 39.70 లక్షల మంది అగ్రవర్ణ పేదలకు రూ.3,025.53 కోట్లను అందించారు. ఏ ప్రభుత్వానికికైనా ప్రాథమిక సూత్రం పేదరికం నిర్మూలనే అవుతుంది. అదే కోవలో నవరత్నాల లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానం తప్ప కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు కాదని ఆచరణలో అమలు చేసి చూపించిన తొలి సీఎంగా ముఖ్యమంత్రి జగన్‌ ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఏడాదే ‘ఈబీసీ నేస్తం’ పథకం ద్వారా అగ్రవర్ణ పేద మహిళలకూ మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

మరిన్ని వార్తలు