వ్యాక్సినే అస్త్రం.. ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి: సీఎం జగన్‌  

17 Apr, 2021 03:25 IST|Sakshi
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కోవిడ్‌ నియంత్రణకు ఇదే మార్గం.. దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి 

టెస్టులపైనా ఫోకస్‌ పెంచాలి 

అన్ని వసతులతో కోవిడ్‌ ఆస్పత్రులను సిద్ధం చేయాలి.. బెడ్ల సంఖ్యను పెంచాలి 

కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌  

కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచిత వైద్యసేవలందించాలి 

ఐసోలేషన్‌కు ప్రత్యేక గది లేకుంటే.. రోగిని కోవిడ్‌ కేర్‌కు పంపించాలి  

అక్కడ శానిటేషన్, మెడికేషన్, ఫుడ్‌ క్వాలిటీ ఉండాలి 

కోవిడ్‌ నియంత్రణకు ఇప్పుడు మనకున్న అస్త్రం వ్యాక్సిన్‌. అందువల్ల లాక్‌డౌన్‌ అన్నమాట రాకుండా కోవిడ్‌ నియంత్రణపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలి. ఫోకస్డ్‌ టెస్టింగ్‌.. అంటే కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారి ప్రైమరీ కాంటాక్ట్‌లను టెస్టు చేయడంపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికీ వెంటనే టెస్టు చేసేలా ఏర్పాట్లు ఉండాలి. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లలో టెస్టులు చేసేలా ఏర్పాట్లు చేయాలి. అక్కడ శాంపిల్స్‌ సేకరించాలి.

కోవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వాటిని వెంటనే నియంత్రించాల్సి ఉంది. గతేడాది నుంచి జిల్లా యంత్రాంగాలు చాలా బాగా పనిచేస్తున్నాయి. కోవిడ్‌ నియంత్రణలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మొదలు గ్రామ సచివాలయాల సిబ్బంది వరకు చాలా బాగా పనిచేస్తున్నారు. వారి సేవలు ప్రశంసనీయం. మళ్లీ అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం వచ్చింది.

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే అస్త్రమని, దీనిపై అధికార యంత్రాంగం అంతా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. లాక్‌డౌన్‌ లేకుండా కోవిడ్‌ను నియంత్రించాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవహారాలు దెబ్బతినకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ విధించడం లేదని తెలిపారు. గతేడాది లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతినగా, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారని, మళ్లీ ఆ పరిస్థితి రాకూడదని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం స్పష్టం చేశారు.

కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్‌తోపాటు వ్యాక్సినేషన్, ఆస్పత్రుల సన్నద్ధత, రోగులకు ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా ఉచితంగా చికిత్సలు అందించడంపై కలెక్టర్లకు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

వ్యాక్సినేషన్‌ శాశ్వత పరిష్కారం
వ్యాక్సినేషన్‌ అనేది శాశ్వత పరిష్కారం. అయితే అది మన చేతుల్లో లేదు. ఎందుకంటే ఆ డోసులను కేంద్రం సరఫరా చేయాల్సి ఉంది. నెలకు ఏడుకోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతుండగా, రోజుకు 23 లక్షల డోసులు తయారవుతున్నాయి. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాపై పూర్తి నియంత్రణ కేంద్రానిదే. దీంతో ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు వీలైనంత వరకు అందరికి వ్యాక్సిన్‌ ఇవ్వడంతోపాటు మరోవైపు కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టాల్సి ఉంది.

పరీక్షలు–పాజిటివిటీ
రాష్ట్రంలో గతేడాది నుంచి ఇప్పటివరకు 1.55 కోట్ల పరీక్షలు చేయగా 9.37 లక్షల కేసులు పాజిటివ్‌గా తేలాయి. మన రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 6.03 శాతం కాగా, రికవరీ రేటు 96.19 శాతంగా ఉంది. అదే సమయంలో దేశ సగటు చూస్తే రికవరీ రేటు 88.9 «శాతమే. రాష్ట్రంలో టయర్‌–1 వంటి నగరాలు లేకపోయినా మనకున్న వసతులతో బాగా పనిచేయగలిగాం. కోవిడ్‌ కేసులను గుర్తించి పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన చికిత్స చేశాం. ఈ ప్రక్రియలో డాక్టర్లు, వైద్యసిబ్బంది, గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్‌ఎంలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషించాయి. రాష్ట్రంలో మరణాల రేటు 0.78 శాతం ఉండగా, జాతీయ స్థాయిలో అది 1.24 శాతంగా ఉంది. ఇవన్నీ మనకున్న పాజిటివ్‌ అంశాలు.

► దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైంది. రాష్ట్రంలోనూ కేసులు పెరుగుతున్నాయి. గత డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ మధ్య వరకు పాజిటివిటీ రేటు 7.77 శాతంగా నమోదైంది. ఇన్ఫెక్షన్, పాజిటివిటీ రేటు చిత్తూరులో ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో పరిస్థితి తీవ్రంగా ఉంది.

► పాజిటివిటీ కేసుల కాంపోజిషన్‌ చూస్తే 62 శాతం పట్టణ ప్రాంతాల్లో, 38 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదయ్యాయి. అయితే మరణాల రేటు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. చాలా ఆలస్యంగా ఆస్పత్రులకు వెళ్లడమే అందుకు కారణం.

ప్రజల్లో అవగాహన కల్పించాలి
► కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి. అందుకోసం వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను ఉపయోగించాలి. అవసరం అనుకున్నవారికి ఫీవర్‌ టెస్టులు చేయాలి. ఇందుకోసం వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీల వైద్యులను వినియోగించండి. సర్వేలో కోవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తించిన వెంటనే పరీక్షలు చేయాలి. అలా చేస్తేనే కోవిడ్‌ ఉందా లేదా అని తెలుస్తుంది.

► కలెక్టర్లు దృష్టి పెట్టాల్సిన మరో అంశం.. జాయింట్‌ కలెక్టర్ల(డెవలప్‌మెంట్‌)తో ప్రతిరోజూ మానిటర్‌ చేయాలి. ఇక జేసీలు ప్రతి నిమిషం, ప్రతి గంటకు పరిస్థితిని, ఆస్పత్రుల ప్రిపేర్డ్‌నెస్‌ను సమీక్షించాలి. కలెక్టర్లు ప్రతిరోజూ సమీక్షించాలి.

బెడ్లను పెంచాల్సి ఉంది
► గతేడాది సెప్టెంబర్‌లో 261 ఆస్పత్రులను కోవిడ్‌ చికిత్సకోసం గుర్తించడం, తీసుకోవడం జరిగింది. అందులో సగం ప్రభుత్వ ఆస్పత్రులు కాగా, మిగిలినవి ప్రైవేటు ఆస్పత్రులు. వాటిలో 37,441 బెడ్లు అందుబాటులో ఉండగా, 17,921 నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌ బెడ్లు ఉండేవి. ఇప్పుడు 108 ఆస్పత్రులను కోవిడ్‌ చికిత్సకోసం ఎంప్యానెల్‌ చేయడం జరిగింది. అందులోనూ సగం ప్రభుత్వ ఆస్పత్రులు. వాటిలో 15,669 బెడ్లు ఉండగా, 4,889 ఆక్యుపైడ్‌ బెడ్లు. గతేడాది సెప్టెంబర్‌లో ఉన్నవిధంగా బెడ్లు మనకు ఇప్పుడు కావాల్సి ఉంది. ఆ మేరకు లక్ష్యం నిర్దేశించుకుని బెడ్లు పెంచాలి.

► ఇప్పటికిప్పుడు మనకు అవసరమైన ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని ఇంకా పెంచుకోవాల్సి ఉంది. అవన్నీ మన బాధ్యత. 

► మనం ఆస్పత్రులను తీసుకోవడం అంటే.. వాటిని ఓన్‌ చేసుకోవడం. ఆక్సిజన్‌ సదుపాయాలు.. అందుకు తగిన మౌలిక వసతులున్నాయా? అన్నది చూడాలి. ఆస్పత్రిలో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, మెడికేషన్, డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటు.. ఇవన్నీ మన బాధ్యత అన్న విషయం గుర్తుంచుకోవాలి.

కోవిడ్‌ కేర్‌ సెంటర్లు
► ఇంట్లో ఐసొలేషన్‌కోసం ప్రత్యేక గది లేకపోతే రోగిని కోవిడ్‌ కేర్‌సెంటర్‌కు పంపించాలి. అక్కడా శానిటేషన్, మెడికేషన్, ఫుడ్‌ క్వాలిటీ, మందులు అందుబాటులో ఉండేలా చూడడం, ఎప్పటికప్పుడు చెక్‌ చేయడమూ మన బాధ్యత. రాష్ట్రంలో ప్రస్తుతం 26 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 13,500 బెడ్లు ఉండగా, వాటి సంఖ్యను గత సెప్టెంబర్‌ నాటితో చూస్తే 50 వేల బెడ్లకు పెంచాల్సిన అవసరముంది.

హోం ఐసొలేషన్‌
► హోం ఐసొలేషన్‌లో ఉన్నవారిపైనా దృష్టి సారించాలి. కోవిడ్‌ కేసును గుర్తించగానే.. వెంటనే ఆ ఇంటిని మార్క్‌ చేసి రోగికి వెంటనే కోవిడ్‌ కిట్‌ ఇవ్వడంతోపాటు రెగ్యులర్‌గా మానిటర్‌ చేయాలి. మూడు రోజులకోసారి ఏఎన్‌ఎంలు ఆ ఇంటిని సందర్శించాలి. రోగి పరిస్థితిని గమనించి.. డాక్టర్‌ ఆ ఇంటికి వెళ్లేలా వారు రిక్వెస్టు చేయాలి. రోగి పరిస్థితి బాగా లేకపోతే, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించడం లేదా ఆస్పత్రిలో చేర్పించేలా చూడాలి.

కొరడా ఝళిపించండి
► ఆరోగ్యశ్రీ, కోవిడ్‌ ఆస్పత్రుల జాబితాలో లేని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టమొచ్చినట్లు ఫీజులు, రుసుములు వసూలు చేయకుండా చూడాలి. అందుకోసం జీవో నెం.77, 78 ప్రకారం పక్కాగా అమలు చేయాలి. ఎక్కడైనా రోగులనుంచి ఎక్కువ ఫీజు వసూలు చేస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉంది.

ప్రతిరోజూ రివ్యూ
► ఆక్సిజన్‌ అందుబాటు గురించి కలెక్టర్లు ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయాలి. ఎక్కడ ఆక్సిజన్‌ అవసరమున్నా వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రితోపాటు, ఆ శాఖ ఉన్నతాధికారులూ ప్రతిరోజూ రివ్యూ చేస్తారు. మీకు ఏ అవసరమున్నా వెంటనే వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌లను సంప్రదించండి. ప్రతి జిల్లా బాధ్యతను ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి అప్పగించాం. వారు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తారు. మరోవైపు సీఎంవో అధికారులూ మీకు అందుబాటులో ఉంటారు.

ఆస్పత్రులలో అవి తప్పనిసరి
► అన్ని ఆస్పత్రులలో సీసీటీవీలు తప్పనిసరి. అలాగే హెల్ప్‌ డెస్కులూ ఉండి తీరాలి. అవి రోజంతా పనిచేయాలి. ఆ రెండింటి ద్వారా ఆయా ఆస్పత్రుల్లో శానిటేషన్, ఫుడ్‌ క్వాలిటీ, వైద్యుల అందుబాటు, మందుల సరఫరా, ఆక్సిజన్‌ సరఫరాను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. గ్రామాల నుంచి ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు కోరితే.. వెంటనే 108 సర్వీసులు వెళ్లి రోగులను తీసుకురావాలి.

ఉచితంగా సేవలు
► కోవిడ్‌ రోగికి పూర్తిగా ఉచితంగా వైద్యసేవలందించాలి. ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రులలో రోగులకు మంచి వైద్య సేవలందించాలి. అవీ పూర్తిగా ఉచితంగా అందించేలా పక్కాగా అమలు చేయాలి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోనూ అవసరమైన కోవిడ్‌ చికిత్సలు చేయాలి. అవి కోవిడ్‌ ఎంప్యానెల్‌లో లేనప్పటికీ. రెమ్‌డెసివర్‌ వంటి ఇంజెక్షన్లు, నాణ్యతతో కూడిన డ్రగ్స్‌ అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండేలా కలెక్టర్లు చూడాలి.

104 కాల్‌ సెంటర్‌
► 104 కాల్‌ సెంటర్‌ను కలెక్టర్లు ఓన్‌ చేసుకోవాలి. లేకుంటే తగిన విధంగా పని చేయలేం. 104కు ఎవరు ఫోన్‌ చేసినా వెంటనే అటెండ్‌ చేయాలి. రియాక్ట్‌ కావాలి. అందుకోసం అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు రోజుకు రెండు, మూడు మాక్‌ కాల్స్‌ను కలెక్టర్లు చేయాలి. ఒకవేళ ఆ కాల్‌సెంటర్‌ సక్రమంగా పని చేయట్లేదని గుర్తిస్తే, వెంటనే సరిదిద్దాలి.

► 104 నంబర్‌కు ఫోన్‌ చేయగానే వైద్యులు అందుబాటులోకి వచ్చి రోగితో మాట్లాడి, అవసరమైన సూచనలు, సలహాలిచ్చే ప్రక్రియ సక్రమంగా జరగాలి. బెడ్‌ కావాలంటే, ఫోన్‌ చేసిన 3 గంటల్లో కేటాయించాలి. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికీ వెంటనే కోవిడ్‌ కిట్‌ ఇవ్వాలి. అది కూడా 3 గంటల్లో పూర్తవ్వాలి. అదేవిధంగా 108 సర్వీసులో రోగిని అంతే సమయంలో తరలించాలి.

► 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ రాగానే సిబ్బంది వెళ్లాలి. పీహెచ్‌సీ నుంచి సిబ్బంది కదలాలి. 3 గంటల్లో అవసరమైన పరీక్షలు పూర్తి చేయాలి. కోవిడ్‌ కేర్‌కు సంబంధించి 104 నంబర్‌ మస్ట్‌ బి సింగిల్‌ డెస్టినేషన్‌. దాన్ని ప్రతిఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.

సమస్యకు అదే పరిష్కారం
► కోవిడ్‌ సమస్యకు వ్యాక్సినేషన్‌ తుది పరిష్కారం. మనం ప్రతిరోజు 6 లక్షల వ్యాక్సిన్లు వేసే స్థాయికి చేరుకున్నాం. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు, ప్రతి గ్రామ సచివాలయంలో ఆశా వర్కర్, స్థానిక ఏఎన్‌ఎం, వలంటీర్లు ఉన్నారు. వారు ఇల్లిల్లూ సందర్శించి, వాక్సిన్‌ అవసరమైన వారిని గుర్తించి, ఏ రోజు వారికి వ్యాక్సిన్‌ వేస్తారన్నది తెలియజేస్తారు. ఆ మేరకు నిర్దేశించిన రోజున స్థానిక పీహెచ్‌సీ వైద్యులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు వచ్చి వారందరికీ వ్యాక్సిన్‌ వేస్తారు. ఇదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగాలి. గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఆ విధంగా రోజుకు 6 లక్షల వ్యాక్సిన్లు. ఆ మేరకు వ్యాక్సిన్‌ డోసుల కోసం కేంద్రానికి లేఖ రాస్తున్నాం. 

► ఇదే సమయంలో ప్రతి హెల్త్‌ వర్కర్, ప్రతి ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌కు తప్పనిసరిగా వాక్సిన్‌ ఇవ్వాలి. అది చాలా సురక్షితమని, సీఎం కూడా తీసుకున్నారన్న విషయం చెప్పాలి. హెల్త్‌కేర్‌ వర్కర్లలో ఇంకా లక్ష మందికి, ‘ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలోనూ 1.8 లక్షలమందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంది.

► వ్యాక్సిన్‌ వేస్టేజ్‌ లేకుండా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాక్సిన్‌ వాయిల్స్‌ తెరవకముందే తగిన సంఖ్యలో అవసరమైన వారున్నారా? లేదా? అన్నది చూడాలి. ఆ తర్వాతే వ్యాక్సిన్‌ వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాక్సిన్లు వృథా చేయొద్దు.

► గ్రీవెన్స్‌ కోసం కేటాయించిన నంబర్‌ 1902. సమస్యలు చెప్పుకోవడం కోసం ఆ నంబర్‌. కాబట్టి ఫోన్‌ వస్తే అటెండ్‌ చేయాలి. సమస్యలు పరిష్కరించాలి. ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పాలి.

► ఈ కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంకా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు