CM YS Jagan: నేడు విశాఖకు సీఎం జగన్‌

11 May, 2023 04:54 IST|Sakshi
వైజాగ్‌ స్టాండ్స్‌ విత్‌యూ: విశాఖలో సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. ప్రారంభోత్సవాలు చేస్తారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్‌ స్టేడియానికి చేరుకుని.. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవకు చేరుకుని అపోలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించి ప్రసంగిస్తారు. అనంతరం 5.50 గంటలకు బీచ్‌ రోడ్డుకు చేరుకుంటారు.

అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియర్‌ యుద్ధ విమాన మ్యూజియాన్ని సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాలను కూడా ప్రారంభిస్తారు.  అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. 6.15 గంటలకు బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకుని ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.   

వెజాగ్‌ స్టాండ్స్‌ విత్‌యూ..! 
దశాబ్దాలుగా నిరాదరణకు గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊపిరి పోసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జనం జేజేలు పలుకుతున్నారు. వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ‘వైజాగ్‌ స్టాండ్స్‌ విత్‌యూ’.. ‘థాంక్యూ సీఎం సార్‌..’ అని నినదిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కోసం గురువారం విశాఖ వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు భారీ హోర్డింగ్‌లతో స్వాగతం పలుకుతున్నారు.

ముఖ్యమంత్రి పర్యటించనున్న పలు ప్రాంతాల్లో, ముఖ్య కూడళ్ల వద్ద థాంక్యూ సీఎం సార్‌.. మన విశాఖ.. మన రాజధాని.. మీవెంటే మేముంటాం.. అనే నినాదాలతో స్వచ్ఛందంగా హోర్డింగులు ఏర్పా­టు చేశారు. పీఎం పాలెంలోని ఏసీ­ఏ–వీడీసీఏ స్టేడియం వద్ద సీఎం కార్యక్రమం ప్రాంతంలో దాదాపు 50 అడుగుల భారీ హోర్డింగ్‌ని కొందరు ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా ఏర్పాటైన హోర్డింగ్‌లు ప్రజల మనోగతంతోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేసిన సీఎం జగన్‌ పాలన పట్ల ఆదరణను చాటుతున్నాయని పేర్కొంటున్నారు.  

వలస ముద్ర స్థానంలో రాజముద్ర! 
వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ చేపట్టిన పలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. దేశ విదేశీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న విశాఖ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు రూపకల్పన చేసి భూమి పూజ చేయడంతోపాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇన్నాళ్లూ వలస జిల్లాలుగా ముద్రపడిపోయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ రూపు రేఖలు రాజధాని ఏర్పాటుతో సమూలంగా మారిపోతాయని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. సెప్టెంబర్‌ నుంచి విశాఖ వేదికగా పాలన సాగిస్తానని సీఎం జగన్‌ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు