CM Jagan: సీఎం జగన్‌ మేలును మరువలేం.. కన్నబిడ్డలా ఆదుకున్నాడు..

4 Dec, 2021 07:57 IST|Sakshi
ముంపు వాసులకు భరోసా ఇస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్‌)

వరద బాధితుల్లో భరోసా నింపిన సీఎం పర్యటన

సీఎం హామీల అమలుకు సిద్ధమైన అధికారులు 

ఉద్యోగాలు ఇచ్చేవారి జాబితా పరిశీలన 

ఇంటి నిర్మాణాల కోసం అయిదు సెంట్ల  లే అవుట్లు సిద్ధం 

చింతలకోన బాధితులకు పరిహారం 

ఇన్సూ్యరెన్స్‌ క్లెయిమ్స్‌ కోసం సోమవారం నుంచి ముంపు 

గ్రామాల్లోనే బ్యాంకు సిబ్బంది

సాక్షి ప్రతినిధి, కడప: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలకు దిగింది. జిల్లాకలెక్టర్‌ విజయరామరాజు నేతృత్వంలో బాధితులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతోంది.  
►వరద బాధితులకు ఐదు సెంట్లస్థలంలో ఇల్లు కట్టించేందుకు అధికార యంత్రాంగం రాత్రికి రాత్రే లే అవుట్లు సిద్ధం చేసింది. ఒక్క పులపత్తూరు గ్రామంలోనే 310 ఇళ్లను నిర్మించేందుకు ఇప్పటికే లే అవుట్‌ సిద్ధం చేశారు. లే అవుట్‌ కోసం పులపత్తూరు సర్పంచ్‌ మూడున్నర  ఎకరాల స్థలాన్ని ఇవ్వగా, మిగిలిన స్థలాన్ని అధికారులు ఇప్పటికే సేకరించారు.   ( చదవండి: మహిళ ఆవేదన..చలించిపోయిన సీఎం జగన్‌ )

►ముఖ్యమంత్రి ఆదేశించిన మేరకు గ్రామాల్లో ఇల్లే కాకుండా కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న కుటుంబాల్లోని చదువుకున్న వారికి ఉద్యోగం కల్పించేందుకు అధికారులు జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఉద్యోగం ఇవ్వాల్సిన వారికి సంబంధించిన సర్టిఫికెట్లు, ఇతరత్రా వాటిని సేకరించే పనిలో పడ్డారు. శుక్రవారం పులపత్తూరు గ్రామానికి చెందిన పలువురు చదువుకున్న వారి సర్టిఫికెట్లను అధికారులు సేకరించారు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఉద్యోగాల కేటాయింపునకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోనున్నారు.  
►చింతలకోన గ్రామంలో కొందరు బాధితులకు పరిహారం అందలేదని ఆ గ్రామస్తులు గురువారం ముఖ్యమంత్రి వద్ద ఫిర్యాదు చేశారు. ఏ ఒక్క బాధితుడికి అన్యాయం జరగకుండా చూడాలని సీఎం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశించిన రెండు, మూడు గంటల్లోనే గురువారం రాత్రి జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల బృందం చింతలకోన గ్రామాన్ని సందర్శించింది. చెయ్యేరు ముంపులో ఇల్లు కోల్పోయిన వారి ఇళ్లను అధికారులు పరిశీలించారు. వారి పేర్లను నమోదు చేసుకుని పరిహారం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతోపాటుగా చంద్రబాబు హయాంలో చింతలకోనలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని తొలగించారని గ్రామస్తులు సీఎంకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఎం వెంటనే అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆ ఆదేశాలతో వారం రోజుల్లోపే చింతలకోనలో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు ప్రకటించారు.  

►ముంపు గ్రామాలలోని పొలాలు కొన్ని కోతకు గురికావడం, మరికొన్ని ఇసుక మేటలతో పనికి రాకుండా పోయాయి. హెక్టారుకు రూ. 12,500 చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఇసుక మేటలను ప్రభుత్వమే తొలగించేందుకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఈ పనులు మొదలు కానున్నాయి.  
► వరద ప్రవాహంలో వాహనాలు, ఇతరత్రా సామాగ్రి పోగొట్టుకున్న వారితోపాటు పలువురు మృతి చెందడం, గల్లంతు అయిన నేపధ్యంలో వారికి అందాల్సిన ఇన్సూ్యరెన్స్‌ క్లెయిమ్‌ల విషయంలోనూ అధికారులు చర్యలు చేపట్టారు.  సోమవారం నుంచి శుక్రవారం వరకు బ్యాంకు అధికారులు, సిబ్బంది ముంపు గ్రామాల్లోనే ఉండి ఇన్సూ్యరె6న్స్క్లెయిమ్‌లు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.   ( చదవండి: ‘అన్నా.. అమ్మ నిన్ను చూడాలంటోంది’.. ఉదారత చాటుకున్న సీఎం జగన్‌ )

యుద్ధ ప్రాతిపదికన చర్యలు
ముంపు గ్రామాల ప్రజలను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. గ్రామాలను పరిశీలించిన ముఖ్యమంత్రి బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. బా«ధితుల ఇళ్ల నిర్మాణం కోసం లే అవుట్లు సిద్ధం చేస్తున్నామన్నారు.  బాధితుల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. 

సీఎం మేలును మరువలేం.. 
వరద  ప్రభావిత ప్రాంత ప్రజలకు సీఎం పర్యటన కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.  బాధితుల కష్టాలు విన్న ఆయన.. సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో  సీఎం వైఎస్‌ జగన్‌ దేవుడిలా వచ్చి ఆదుకున్నారని.. ఆయనకు రుణపడి ఉంటామని బాధితులు అంటున్నారు. కొందరి మనోగతం..    
 – రాజంపేట టౌన్‌/ రాజంపేట 

కన్నబిడ్డలా ఆదుకున్నాడు.. 
వరదల్లో నా ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. పేదరికంలో ఉన్న మమ్మల్ని సీఎం జగన్‌ దేవుడిలా వచ్చి ఆదుకున్నారు. సురక్షితమైన ప్రాంతంలో ఐదు సెంట్ల స్థలం ఇచ్చారు. అంతేకాక ఇల్లు కూడా కట్టిస్తా అన్నారు. సీఎం మమ్మల్ని కన్నబిడ్డలా ఆదుకున్నారు.   
– నరసమ్మ, వరద బాధితురాలు, పులపుత్తూరు, రాజంపేట మండలం 

భవిష్యత్‌పై ఆశలు రేకెత్తాయి.. 
నేను పదిహేను ఎకరాల్లో అరటి పంట వేశా. వరదల్లో పంట కొట్టుకుపోవడమే కాదు భూమి అంతా ఇసుకమేట అయింది. ఇసుక మేటలు ఎత్తించుకోవడం నా శక్తికి మించిన పని. సీఎం ఇసుకమేటలను ఎత్తివేయిస్తామని హామీ ఇవ్వడంతో భవిష్యత్‌పై ఆశలు రేకెత్తాయి.     
–బాలకృష్ణారెడ్డి, రైతు, పులపుత్తూరు, రాజంపేట మండలం 

జీవితంలో మరచిపోలేం.. 
వరదల్లో మా కుటుంబంలో తొమ్మిది మంది మృతి చెందారు. రెండు వారాల నుంచి మేము పడుతున్న బాధ పగవాడికి కూడా వద్దు అనిపిస్తోంది. ఇంతటి బాధలో ఉన్న మమ్ములను సీఎం పరామర్శించడమే కాక ఎంబీఏ చదివిన నాకు ఉద్యోగ అవకాశం కల్పించాల్సిందిగా కలెక్టర్‌కు సూచించారు. బాధల్లో ఉన్న మాకు ఏదో ఒక గొప్ప మేలు చేయాలని సీఎం సంకల్పించడం మేం జీవితంలో మరచిపోలేం.
–వినయ్‌కుమార్, మందపల్లె, రాజంపేట మండలం  

ఐదు సెంట్ల స్థలం ఇవ్వడం సంతోషం
ఐదుసెంట్ల ఇంటి స్థలం ఇవ్వడం సంతోషదాయకం. వరదపోటుతో సర్వం కోల్పోయిన మాకు ప్రభుత్వం మేలు చేసే విధంగా చూస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మా గ్రామానికి వచ్చి మా జీవనస్థితిని స్వయంగా చూశారు. మాకు భరోసా ఇచ్చారు. 
–వెంకటమ్మ, పులపుత్తూరు, రాజంపేట మండలం 

సీఎంకు రుణపడి ఉంటాం.. 
వరద బీభత్సంలో సర్వం కోల్పోయిన మాకు గూడు కల్పించే బాధ్యత తమదే అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడంతో మాలో ధైర్యం కలిగింది. ఇళ్లు కట్టుకోలేని దీనస్థితిలో ఉన్న తమ పట్ల ప్రభుత్వం చూపిన కరుణ మళ్లీ జీవితంపై ఆశలు పుట్టించింది.    
–గుండ్ర చంద్రమ్మ, పులపుత్తూరు, రాజంపేట 

కొండంత సాయం 
వరదల్లో మేము తీవ్రంగా నష్టపోయాం. మా బాధలను జగనన్నకు విన్నవించుకున్నాం. మా బాధలను ఆలకించిన జగనన్న ఏడాది పాటు వరదల్లో నష్టపోయిన డ్వాక్రా మహిళల రుణాలకు  మారిటోరియం విధిస్తామని హామీ ఇచ్చారు. ఈ కష్టకాలంలో సీఎం అండగా నిలిచి సహాయం చేస్తుండటంతో జగన్‌కు డ్వాక్రా మహిళలందరం ఎంతో రుణపడి ఉంటాం.    – పెంచలమ్మ,డ్వాక్రా లీడర్, పులపుత్తూరు, రాజంపేట మండలం  

( చదవండి: సమస్యలు వింటూ.. అక్కడే పరిష్కరిస్తూ.. వరద బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా )  

>
మరిన్ని వార్తలు