14న సీఎం జగన్‌ తిరుపతి పర్యటన

8 Apr, 2021 03:01 IST|Sakshi

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం వైఎస్‌ జగన్‌  

రేణిగుంట వద్ద సభాస్థలిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు  

సాక్షి, అమరావతి / రేణిగుంట: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 14వ తేదీన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా రేణిగుంట సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే పూర్తి స్థాయిలో పర్యటన షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాలేదు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 17న జరుగనుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి విజయాన్ని కాంక్షిస్తూ ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం గత 21 నెలలుగా చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా పర్యటిస్తే రికార్డు స్థాయిలో మెజార్టీ వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తదితరులు బుధవారం రేణిగుంట మండలం ఎల్లమండ్యం వద్ద ఉన్న యోగానంద కళాశాల సమీపంలో బహిరంగ సభకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి తిరుపతి ప్రచారానికి రూట్‌ మ్యాప్‌పై కూడా చర్చించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ సమర శంఖారావం మొదటి సభ కూడా ఈ ప్రాంగణంలోనే చేపట్టడంతో పార్టీ నేతలు ఈ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు