వెయ్యేళ్ల చరిత్రకు పూర్వ వైభవం.. నాడు రాజుల నేతృత్వంలో.. నేడు ముఖ్యమంత్రి హోదాలో! 

26 Sep, 2022 11:13 IST|Sakshi

ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఆధ్యాత్మిక విషయాల్లో భక్తుల మనోభావాలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ఆలయాలు కూల్చి, పుష్కరాలపేరుతో భక్తులను పొట్టనబెట్టుకున్న చరిత్ర టీడీపీది అయితే.. పురాతన గుళ్లనూ పునరుద్ధరిస్తూ రాయలనాటి వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీది. ఈనేపథ్యంలోనే తిరుమల శ్రీవారి చెల్లెలు అయిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి పూర్వవైభవం తెచ్చేందుకు సంకల్పించింది. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సూచనలతో ప్రథమ పూజ గంగమ్మకు నిర్వహించి, తర్వాత భక్తులు తిరుమల కొండకు వెళ్లడం ఆచారమని, పురాతన కాలంలోనూ ఈ విధానం కొనసాగిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించిన నేపథ్యంలో ఆయన మంగళవారం ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆపై గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రీకృష్ణదేవరాయలు, తదనంతరం అచ్యుతరాయులు, తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గంగమ్మ ఆలయాన్ని సందర్శించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గంగమ్మ ఆలయ విశిష్టత, ఆలయ చరిత్ర, సంప్రదాయం తదితర అంశాలపై ‘సాక్షి’ స్పెషల్‌ ఫోకస్‌..  

సాక్షి, తిరుపతి: తిరుపతి పుట్టినప్పటి నుంచీ అంటే దాదాపు 900 ఏళ్ల నుంచే గంగజాతర జరిగేదని కొందరు చెబుతారు. శ్రీవారి ప్రియ భక్తుడు అనంతాచార్యులు ఈ ఆలయాలన్ని ప్రతిష్టించారు. 1843లో బిట్రీష్‌ ప్రభుత్వం హథీరాంజీ మఠానికి తిరుమల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన సమయంలో తిరుమల ఆలయంతో పాటు దాదాపు 26 స్థానిక ఆలయాలను అనుబంధంగా అప్పగించారు. అందులో గంగమ్మ ఆలయం కూడా ఉంది. అయితే టీటీడీ ఏర్పడిన తర్వాత జంతుబలులు జరిగే ఆలయం టీటీడీ ఆధీనంలో ఉండడం సరికాదనే ఉద్దేశంతో జాబితా నుంచి ఈ ఆలయాన్ని తొలగించారని చెబుతారు. అయినా శ్రీవారికి చెల్లెలుగా గంగమ్మని భావిస్తారు. అందుకే ఏటా తిరుమల ఆలయం నుంచి సారె సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది.  

అప్పటి వరకు టీటీడీ పర్యవేక్షణలోనే..
1843లో బ్రిటీష్‌ వారు టీటీడీ ఆలయ పర్యవేక్షణను హథీరాంజీ బావాకు అప్పగించారు.అప్పటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు శ్రీగోవిందరాజస్వామి ఆలయం, శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, కపిలతీర్థం ఆలయం ఇలా 26 ఆలయాల పర్యవేక్షణను హథీరాంజీ బావా చూసేవారు. ఇందులో శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయం కూడా ఉండేదని రికార్డులు ఉన్నాయి. అయితే బ్రిటీష్‌ వారు 1933లో టీటీడీ పాలక మండలి ఏర్పాటుతో తిరుమల శ్రీవారి ఆలయ పర్యవేక్షణ ఇచ్చారు. పాలక మండలి చేతికి పర్యవేక్షణాధికారం వచ్చాక టీటీడీ ఉప ఆలయాలలోనున్న శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఉన్న రికార్డులు మాయమయ్యాయి.అంటే తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయం టీటీడీ ఉప ఆలయమే అని గత చరిత్ర ఆధారం.  

గంగమ్మ దర్శనం తర్వాతే స్వామివారి దర్శనం
కలియుగ వేంకటేశ్వరస్వామి చెల్లెలుగా పూజలందుకుంటున్న గంగమ్మను తొలుత దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకునేవారు. సుమారు 400 ఏళ్ల పూర్వం నుంచే ఈ సంప్రదాయం ఉండేది. అయిలే కాలక్రమేణా తిరుమలకు వెళ్లే దారులు మరలి ఈ సంప్రదాయం కనుమరుగైంది. గంగమ్మకు ఏటా జాతర సమయంలో టీటీడీ నుంచి సారె సమర్పిస్తారు.  తిరుచానూరులో చక్రతీర్థం రోజున తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఏటా శ్ర్రీపద్మావతి అమ్మవారికి ఏనుగుపై పసుపు ముద్దను పంపేవారు. పసుపు ముద్ద తిరుమల నుంచి తిరుచానూరు చేరుకున్నాకే అమ్మవారి చక్రస్నానం జరిగే ఆచారం ఉంది. ఈ నేపథ్యంలో పసుపు ముద్ద తిరుచానూరుకు తీసుకెళ్లే మార్గమధ్యలో గంగమ్మ గుడి ముందు ఆపి గంగమ్మకు పూజలు చేసేవారు.  

గంగమ్మను దర్శించనున్న తొలి సీఎం జగన్‌
ప్రాచీన సంప్రదాయం కొనసాగింపునకు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకోనున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తొలిసారి గంగమ్మ ఆలయానికి రానుండడం ఇదే ప్రథమం. 

ప్రాచీన వైభవ వ్యాప్తికి ఎమ్మెల్యే భూమన కృషి 
ప్రాచీన చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ ఆలయ విశిష్టతను విశ్వవ్యాప్తి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విశేష కృషి చేస్తున్నారు. ఈ ఏడాది జానపద కళా ప్రదర్శనలతో గంగజాతర విశిష్టతను చాటారు. అలాగే తిరుపతి గంగమ్మకు సారె సంప్రదాయంలో స్థానిక సంస్థలు, అధికారులను సైతం భాగస్వాములను చేశారు. 400 ఏళ్ల క్రితం ఉన్న విధంగా గంగమ్మ దర్శనం తర్వాత శ్రీవారి దర్శనం ఆచారాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 27వ తేదీ తిరుపతి గంగమ్మ ఆలయ దర్శనానికి ఆహ్వానించారు.   

ప్రాచీన ఆలయం 
తిరుపతి గ్రామదేవతగా అమ్మవారు పూజలందుకుంటున్నారు. ఏటా ఏడు రోజుల పాటు అమ్మవారి జాతరను వేడుగా నిర్వహిస్తారు. తెలంగాణలో సమ్మక్క–సారక్క జారతకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. పైడితల్లి అమ్మవారి జాతర 300 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. అయితే తిరుపతి తాతయ్యగుంట ఆలయానికి 900 ఏళ్ల చరిత్ర ఉందని ఆధారాలు చెబుతున్నాయి. వైష్ణవ భక్తుడైన తాతాచార్యులకు  కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్యగుంట అని పేరు ఉందని, ఇదే చెరువు గట్టుపై వెలియడంతో తిరుపతి గంగమ్మ కాలక్రమేణ శ్రీతాతయ్యగుంట గంగమ్మ అని ప్రాశస్తి చెందింది.

నాటి నుంచే అశేష భక్తకోటి పూజలందుకుంటూ గంగమ్మ భక్తుల కొంగుబంగారంగా ఆలరారింది. తర్వాతనే దేశంలోని పలు గ్రామాల్లో గంగమ్మ ఆలయాలు వెలసి భక్తజనుల పూజలు అందుకోవడం ఆరంభమైంది. తాళ్లపాక అన్నమయ్య తిరుపతి గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించడంతో తాళ్లపాక గంగమ్మ అని పేరు కూడా వచ్చిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 18వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి తరిగొండ వెంగమాంబ ‘జలక్రీడావిలాసం’ యక్షగానంలో తాతయ్యగుంట గంగమ్మను ప్రస్తావించిందని చెబుతారు. 

మరిన్ని వార్తలు