వైఎస్‌ జగన్‌​ మాట ఇస్తే తప్పరు: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

8 Dec, 2020 12:33 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాట ఇస్తే తప్పరని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ఇప్పటికే పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించాం. నియోజక వర్గ పరిధిలో కొత్తగా నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ఆమోదం తెలిపార’ని అన్నారు. చదవండి: (ఎంపీ మాధవ్‌ చొరవ.. అనంత మీదుగా ప్రత్యేక రైలు)

ఈ నెల 9న ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ గ్రామాల్లో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్‌ పనులకు బుధవారం సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ‘గతంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారు. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యామ్‌కు నీటి తరలింపు కోసం 803 కోట్ల రూపాయలతో టీడీపీ సర్కారు అంచనాలు రూపొందించింది. అదే డబ్బుతో నాలుగు రిజర్వాయర్లు, ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యామ్‌కు నీరు తరలిస్తాం. తాజా ప్రతిప్రాదనల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 300 కోట్లు ఆదా కానుంద’ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి తెలిపారు.  చదవండి: (ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద మనసు)

కాగా, ‘బంగారం’లాంటి భూములు.. సిరులు పండే నేలలు.. అయితేనేం.. నీరులేక నోరెళ్లబెట్టాయి! పచ్చని పంటలు పండే పొలాలన్నీ బీళ్లుగా మారాయి. ఏడాదికి మూడు పంటలు పండించే సత్తా ఉన్న రైతులు ఉన్నా.. జల సిరి లేకపోవడంతో వ్యవసాయం నిర్వీర్యమవుతూ వచ్చింది. సీజన్‌ వస్తే ఆకాశం వైపు ఆశగా చూడడం తప్ప మరేమీ చేయలేని అసహాయ స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడారు. ఇదంతా గతం. ‘నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందిస్తా’ అనే నినాదంతో ప్రజాభిమానాన్ని చూరగొని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అహర్నిశం శ్రమించారు. ఇప్పటికే హంద్రీ–నీవా ద్వారా పేరూరు డ్యాంకు కృష్ణా జలాలు అందించారు. అంతటితో ఆగిపోకుండా మరో నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రభుత్వ ఆమోదం కూడా పొందారు. ఈ నెల 9న ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.   


రాప్తాడు నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న అప్పర్‌ పెన్నార్‌ డ్యాం (పేరూరు డ్యాం) దశాబ్దాలుగా నీటి చుక్క లేక బోసిపోయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నీటిని అందించేందుకు రూ.810 కోట్లు మంజూరయ్యాయి. అయితే పనులు ముందుకు సాగలేదు. కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయి. అదే సమయంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంను నీటితో నింపవచ్చునంటూ అప్పటి వైఎస్సార్‌ సీపీ రాప్తాడు సమన్వయకర్త హోదాలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పలు సూచనలు చేస్తూ వచ్చారు.

తన వాదనలోని వాస్తవాలేమిటో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆచరణలో నిజం చేసి చూపించారు. పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించి, తానిచ్చిన మాటను నిలుపుకున్నారు. అంతేకాక జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి నేరుగా పేరూరు డ్యాంకు నీరు మళ్లించేలా రూ.264.54 కోట్లతో 53.45 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేపట్టారు. దీని ద్వారా పేరూరు డ్యాం దిగువన ఉన్న 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. డ్యాంకు సమీపంలో ఉన్న రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో భూగర్భజలాలూ పెరిగి పరోక్షంగా మరో 25 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి.  

‘హంద్రీనీవా’ నుంచి ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యాంకు నీరు తరలించే మార్గంలోనే మరో నాలుగు సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం పేరూరు డ్యాంకు నీటిని తరలించేందుకు కేటాయించిన రూ.810 కోట్ల నిధుల కన్నా తక్కువతో వీటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలను ప్రకాష్‌రెడ్డి సిద్ధం చేశారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.244 కోట్లకుపైగా మిగులు చూపించారు.   

మరిన్ని వార్తలు