పులివెందులలో అపాచీ లెదర్‌ కంపెనీ

8 Dec, 2020 13:41 IST|Sakshi

24న శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కలెక్టర్‌ హరి కిరణ్‌ వెల్లడి

సాక్షి, కడప: పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రఖ్యాత లెదర్‌ కంపెనీ అపాచీ ‘ఇంటిలిజెంట్‌ ఎస్‌ఈజెడ్‌’ ఏర్పాటుకు ఆతిథ్యం ఇస్తున్నట్లు కలెక్టర్‌ హరి కిరణ్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అపాచీ ఫుట్‌వేర్‌ గ్రూప్‌ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సంకల్పించారన్నారు. జిల్లాలోని యువతకు విస్తృతంగా ఉద్యోగం, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ (పాడా) పరిధిలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పార్కు (ఐడీపీ)లో 27 ఎకరాల స్థలాన్ని సుప్రసిద్ధ అపాచీ ఫుట్‌వేర్‌ కంపెనీకి కేటాయించారన్నారు.

ఇంటిలిజెంట్‌ ఎస్‌ఈజెడ్‌ పేరుతో ప్రారంభిస్తున్న ఈ లెదర్‌ పరిశ్రమ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఇనగళూరు వద్దనున్న ప్రధాన శాఖకు అనుబంధంగా నడుస్తుందన్నారు. ఈనెల 24వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా ఈ లెదర్‌ పరిశ్రమకు శంకుస్థాపన జరుగుతుందని కలెక్టర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీలు గౌతమి, సాయికాంత్‌వర్మ, అపాచీ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సిమోగ్‌ చెంగ్, అపాచీ ఫుట్‌వేర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ వైస్‌ జనరల్‌ మేనేజర్‌ (బిజినెస్‌) గోవిందస్వామిముత్తు, పాడా ఓఎస్‌డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ జయలక్ష్మి, జిల్లా పరిశ్రమలశాఖ జీఎం చాంద్‌బాషా పాల్గొన్నారు.  చదవండి: (వైఎస్‌ జగన్‌​ మాట ఇస్తే తప్పరు: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి)

స్థలాన్ని పరిశీలించిన కంపెనీ ప్రతినిధులు
పులివెందుల: పులివెందులలోని జేఎన్‌టీయూ వెనుక వైపున నిర్మించనున్న అపాచి లెదర్‌ కంపెనీ ఏర్పాటు స్థలాన్ని సోమవారం ఆ కంపెనీ ప్రతినిధులు పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఏపీఐఐసీ భూములలో 27.94 ఎకరాల విస్తీర్ణాన్ని ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి కంపెనీ ప్రతినిధులకు చూపించారు. స్థలాన్ని పరిశీలించిన వారిలో అపాచి కంపెనీ ప్రతినిధులు స్పెషల్‌ అసిస్టెంట్లు సైమన్, హరియన్, వైస్‌ జీఎం ముత్తు గోవిందుస్వామి, సివిల్‌ ఇంజినీర్‌ గుణ, పీఆర్‌ఓ రాజారెడ్డిలు ఉన్నారు.  చదవండి: (మనం కట్టేవి 'ఊళ్లు')

>
మరిన్ని వార్తలు