Integrated Renewable Energy Project: ప్రపంచంలోనే మొదటి ప్రాజెక్టు.. శంకుస్థాపనకు సీఎం జగన్‌

16 May, 2022 08:25 IST|Sakshi

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

రేపు  గుమ్మితం తండాకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

ప్రపంచంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన  

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ 

కర్నూలు(సెంట్రల్‌): ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గుమ్మితం తండాలో చేయాల్సిన ఏర్పాట్లపై ఆదివారం అధికారులు, గ్రీన్‌కో ప్రతినిధులతో  కలెక్టర్‌ కోటేశ్వరరావు సమావేశమయ్యారు. పోలీసు బందోబస్తు, కార్యక్రమ నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌ కుమార్‌రెడ్డి, ఇతర అధికారులను ఆదేశించారు. గ్రీన్‌కో ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రోటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు.

ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి 

5,410 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యంతో గ్రీన్‌ కోఎనర్జీస్‌ లిమిటెడ్‌ నిర్మించే పవర్‌ ప్రాజెక్టు నుంచి సోలార్, విండ్, హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తి  అవుతుందన్నారు. ఇలా ఒకే ప్లాంట్‌ నుంచి మూడు రకాల విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదట కర్నూలు జిల్లాలో నిర్మితం అవుతుండటం సంతోషకరమన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో  సీఎం పర్యటన ఏర్పాట్లపై డైరెక్టర్‌ విద్యాసాగర్‌తో చర్చించారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ హరిప్రసాదు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. 

చదవండి: (గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్‌.. షెడ్యూల్‌ ఇదే..)

800 మంది పోలీసులతో బందోబస్తు 
కర్నూలు (టౌన్‌): సీఎం పర్యటనకు 800 మంది  పోలీసులతో బందోబస్తు  ఏర్పాట్లు చేస్తున్నట్లు   ఎస్పీ  సుధీర్‌కుమార్‌ రెడ్డి ఆదివారం  ప్రకటనలో తెలిపారు. ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 43 మంది ఎస్‌ఐలు, 122 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 283 మంది కానిస్టేబుళ్లు, 28 మంది మహిళా పోలీసులు, 169 మంది హోంగార్డులు, 03 ప్లటూన్ల ఏఆర్‌ సిబ్బంది, 02 ప్లటూన్ల ఏపీఎస్‌పీ సిబ్బంది, 7 స్పెషల్‌ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు