CM Jagan: సీఎం జగన్‌ నరసాపురం పర్యటన ఖరారు

18 Nov, 2022 16:29 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం): ఈ నెల 21న నరసాపురంలో జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలో జరుగుతున్న సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న బస్టాండ్, 100 పడకల ఆసుపత్రి పనులు పరిశీలించారు.

చిన్నచిన్న పెండింగ్‌ పనులు ఉంటే రెండురోజుల్లో పూర్తి చేసుకోవాలని చెప్పారు. చినమామాడిపల్లి వద్ద నిర్మించిన హెలీప్యాడ్‌ను, 25 వార్డు వీవర్స్‌కాలనీ వద్ద ముఖ్యమంత్రి బహిరంగ సభ వేదికను పరిశీలించారు. వేదిక పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. బహిరంగసభ వద్ద పార్కింగ్‌ విషయంలో ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ సీఎం పర్యటన 21న ఖరారు అయ్యిందని చెప్పారు. ఆ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం కావడంతో నరసాపురంలో జరిగే వేడుకల్లో సీఎం పాల్గొంటారని చెప్పారు. ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్, వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ప్రాజెక్ట్‌ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. బస్టాండ్, ఆసుపత్రి వంటి పూర్తయిన పనులను ప్రారంభిస్తారని వివరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నరసాపురం సబ్‌కలెక్టర్‌ ఎం.సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.    

చదవండి: (రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాను.. బట్టలిప్పించికొట్టిస్తా: చంద్రబాబు)

మరిన్ని వార్తలు