తొలిసారి అన్నమయ్య జిల్లా పర్యటనకు సీఎం జగన్‌

20 Nov, 2022 14:22 IST|Sakshi

అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్‌ గిరీషా, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం 

పకడ్బందీ ప్రణాళికతో సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశాలు 

సభా ఏర్పాట్లు, చేయాల్సిన పనులపై బాధ్యతల కేటాయింపు 

సాక్షి, మదనపల్లె: అన్నమయ్య జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా విచ్చేస్తున్న సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను  సమన్వయంతో పనిచేసి విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్‌ గిరీషా.పీఎస్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పిలుపునిచ్చారు. జగనన్న విద్యాదీవెన నాలుగో విడత పంపిణీకి సంబంధించి ఈనెల 25న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మదనపల్లెకు రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ తలశిలరఘురాం, ఎస్పీ హర్షవర్దన్‌రాజు, జేసీ తమీమ్‌అన్సారియా, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలు సభాస్థలి, హెలిప్యాడ్, రోడ్‌షో ఏర్పాట్లపై పట్టణంలోని టిప్పుసుల్తాన్‌ కాంప్లెక్స్, బీటీ కళాశాల గ్రౌండ్స్, చిప్పిలి విజయాడెయిరీ వెనుకవైపు మైదానాలను పరిశీలించారు.

అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో సభా ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..అన్నమయ్య జిల్లాలో తొలిసారిగా చేస్తున్న ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు జరగకుండా, పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి అధికారి ఆయా శాఖల పరిధిలో వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం పంపిణీ సభకు టిప్పుసుల్తాన్‌ మైదానాన్ని ఎంపిక చేశామన్నారు.

చదవండి: (ఇతర పార్టీల పొత్తుకోసం పాకులాట.. మరి ఈ బిల్డప్‌ ఏంటి బాబు?)

హెలిప్యాడ్, సభావేదిక, బారికేడ్లు, పార్కింగ్‌ వసతి, ఫైర్‌సేఫ్టీ, భద్రతాసౌకర్యం, ప్రొటోకాల్, విద్యుత్‌సరఫరా, ఆహారం, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, వైద్యసదుపాయాలు సమకూర్చాలన్నారు. హెలిప్యాడ్‌ నుంచి సభాస్థలికి చేరుకునేంతవరకు సీఎం పర్యటించే రహదారి పొడవునా ప్రతి 100 మీటర్లకు ఒక అధికారిని నియమించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి, సభాస్థలంలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ వసతులను కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె.ప్రమీలను ఆదేశించారు. మదనపల్లె సీఎం పర్యటనకు సంబంధించి పూర్తిస్థాయి పర్యవేక్షణ జేసీ తమీమ్‌అన్సారియా, ఆర్డీఓ ఎం.ఎస్‌.మురళీకి కేటాయించారు.

రాజంపేట ఆర్డీఓ కోదండరెడ్డికి హెలిప్యాడ్, రాయచోటి ఆర్డీఓ రంగస్వామికి వేదిక ఏర్పాట్లపై బాధ్యతలు అప్పగించారు. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిలరఘురాం మాట్లాడుతూ... విద్యాదీవెన కార్యక్రమానికి తక్కువ వ్యవధి ఉన్న నేపథ్యంలో సరైన ప్రణాళికతో పూర్తిస్థాయిలో కార్యక్రమం విజయవంతానికి అధికారులు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జెడ్పీచైర్మన్‌ శ్రీనివాసులు,  ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌ షమీంఅస్లాం, జెడ్పీటీసీ ఉదయ్‌కుమార్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనూజారెడ్డి, వైస్‌చైర్మన్‌ జింకా చలపతి, వైఎస్సార్‌ సీపీ నాయకులు బాబ్‌జాన్, జబ్బలశ్రీనివాసులు, అడిషనల్‌ ఎస్పీ రాజ్‌కమల్, జిల్లా ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.     

మరిన్ని వార్తలు