కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సీఎం జగన్‌ లేఖ

3 Jul, 2021 02:59 IST|Sakshi

దిశకు మద్దతు ఇవ్వండి  

ఈ బిల్లుపై హోం శాఖ మహిళా, శిశు సంక్షేమ శాఖ అభిప్రాయం కోరింది..

మహిళలు, చిన్నపిల్లల భద్రత దృష్ట్యా సానుకూల అభిప్రాయం తెలపండి 

ఈ బిల్లు ప్రాధాన్యత వివరించడం కోసం అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమిస్తాం 

బిల్లు ఆమోదానికి సహకరించండి  

సాక్షి, అమరావతి: మహిళలు, చిన్న పిల్లల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టం త్వరగా ఆమోదం పొందడానికి మద్దతు తెలపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని కోరారు. రాష్ట్ర చట్ట సభలు చేసిన ఈ బిల్లు ఆమోదం కోసం కేంద్రానికి పంపామని తెలిపారు. అయితే ఈ బిల్లుపై కేంద్ర హోం శాఖ.. మహిళా, శిశు సంక్షేమ శాఖ అభిప్రాయాలు, సూచనలు కోరిందన్నారు. మహిళల భద్రతలో కీలకమైన ఈ బిల్లుపై వేగంగా స్పందించి దిశ చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం ఆయన లేఖ రాశారు. ఆ లేఖ వివరాలు ఇలా ఉన్నాయి. 

శ్రీమతి స్మృతి ఇరానీజీ.. 
రెండేళ్లుగా చిన్న పిల్లల కోసం, లింగ వివక్ష రూపుమాపే విధంగా మీరు సమర్థవంతంగా అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయి. మహిళల పోషణ, సంక్షేమంపై పథకాలను బలోపేతం చేయడమే కాకుండా, మహిళలు, పిల్లల రక్షణ కోసం బలమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీరు నాతో అంగీకరిస్తారనుకుంటున్నా. మహిళలు, పిల్లల భద్రతకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. మహిళలు, పిల్లలపై జరుగుతున్న దారుణ ఘటనల్లో త్వరితగతిన దోషులను గుర్తించి కఠిన చర్యలను తీసుకునే విధంగా గత రెండేళ్లుగా అన్ని వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాము. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ శాసనవ్యవస్థ 2020 డిసెంబర్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌ దిశ (మహిళలు, పిల్లలపై నిర్దేశిత నేరాలకు ప్రత్యేక కోర్టులు) బిల్లు 2020’, ‘ఆంధ్రప్రదేశ్‌ దిశ – క్రిమినల్‌ లా (ఆంధ్రప్రదేశ్‌ సవరణ) బిల్లులను ఆమోదించింది.

అటువంటి కేసులలో త్వరగా న్యాయం జరిపించి, దోషులకు కఠిన శిక్ష వేయడం కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి కూడా బిల్లులు అనుమతిస్తాయి. మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన కేసుల్లో తగిన సాక్ష్యాలు ఉంటే ఏడు రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి చేసేలా చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ కేసుల్లో దోషులకు త్వరితగతిన శిక్ష విధించడానికి ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. దిశ బిల్లుకు అంగీకారం లభిస్తుందన్న ఆశాభావంతో మహిళలు, చిన్న పిల్లలపై నమోదవుతున్న లైంగిక నేరాల కేసులలో దర్యాప్తు, విచారణను సకాలంలో పూర్తి చేసే విధంగా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.  

ప్రత్యేకంగా దృష్టి ఇలా.. 
ప్రత్యేకంగా ఒక మహిళా ఐఏఎస్, ఒక మహిళా ఐపీఎస్‌ అధికారుల నియామకం. 
డీఎస్పీల నేతృత్వంలో 18 దిశ మహిళా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు. ఇవి స్నేహ పూర్వకంగా ఉన్నాయని ఐఎస్‌ఓ ధృవీకరణ. 
ఆపద వేళ ఆదుకునేలా దిశ యాప్‌ రూపకల్పన. ఈ యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే తక్షణం స్పందించి సాయం.  
ఈ యాప్‌ను ఇప్పటికే 19.83 లక్షల మంది డౌన్‌లోడ్‌. ఏడాదిన్నరగా 3,03,752 ఎస్‌వోఎస్‌ రిక్వెస్టులు. వీటిలో 1,823 చర్యలు తీసుకోవాల్సిన కాల్స్‌. 221 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు.  
మంగళగిరి, తిరుపతి, విశాఖపట్నంలో కొత్తగా దిశ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటు పనులు ప్రారంభం. 
రాష్ట్ర వ్యాప్తంగా 700 పోలీస్‌ స్టేషన్లలో మహిళా హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు. 
ఇంటిగ్రేటెడ్‌ క్రైమ్‌ సీన్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 18 మినీ బస్సులు ఏర్పాటు. 900 ద్విచక్ర వాహనలతో దిశ పెట్రోలింగ్‌. 
కేసుల విచారణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం.
లైంగిక దాడికి గురై ప్రాణాలతో బయట పడిన వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత. బాధితులు ధైర్యంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకునేలా 13 జిల్లాల కేంద్రాల్లో వన్‌స్టాప్‌ సెంటర్‌ ఏర్పాటు. బాధితుల ఆత్మస్థైర్యం పెంచేలా సైకలాజికల్, సామాజిక కౌన్సెలింగ్, మెడికో లీగల్‌ అసిస్టెన్స్, తాత్కాలిక ఆశ్రయం.   

త్వరితగతిన సమాచారం పంపండి 
క్రిమినల్‌ లా, క్రిమినల్‌ ప్రొసీజర్స్, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ జస్టిస్‌.. ఉమ్మడి జాబితాలో ఉన్నందున, ఈ రెండు బిల్లులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 254 (2) ప్రకారం రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం పంపించాము. ఈ బిల్లు ఆమోదం కోసం హోం మంత్రిత్వ శాఖ 2021 జనవరి 11న ఓఎం నంబర్‌ 17/6/2021, 15.06.2021 తేదీన ఓఎం నంబర్‌ 17/01/2020తో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్యాఖ్యలు, పరిశీలన కోరింది. అందువల్ల త్వరితగతిన మీరు ఈ బిల్లులపై మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యలను హోం శాఖకు పంపాల్సిందిగా కోరుతున్నా. ఈ బిల్లు గురించి వివరించడానికి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారిని ఒకరిని 
నియమిస్తాను.  

ఏడాదిన్నరగా ఇదీ ఫలితం..
డిసెంబర్‌ 2019 నుండి ఇప్పటి వరకు 162 రేప్, 1,353 లైంగిక నేరాల్లో ఏడు రోజుల్లోనే కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 498 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 
మహిళలపై నేరాల కేసులపై దర్యాప్తు పూర్తి చేయడానికి 2017లో 117 రోజులగా ఉన్న సగటు సమయం 2021 నాటికి 
41 రోజులకు తగ్గింది. 
లైంగిక వేధింపుల కేసుల్లో ఈ సంవత్సరం దర్యాప్తు సగటు రేటు రాష్ట్రంలో 90.17 శాతంగా ఉంటే దేశ సగటు రేటు 35 శాతంగా ఉంది. 
143 మందిపై నేరారోపణలు రుజువు కాగా, ఇందులో ముగ్గురికి ఉరిశిక్ష, 14 మందికి జీవిత ఖైదు విధించారు.  

మరిన్ని వార్తలు