అంతర్‌ రాష్ట్ర ఒప్పందంపై టీఎస్‌ఆర్టీసీ దోబూచులాట

23 Oct, 2020 07:56 IST|Sakshi

వీలైనంత త్వరగా ఆర్టీసీ బస్సుల రాకపోకలపై కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవాలి:మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి: దసరా సీజన్‌ ప్రారంభమైనా.. హైదరాబాద్‌ నుంచి ఏపీకి, ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. గత రెండ్రోజుల్నుంచీ టీఎస్‌ఆర్టీసీ అంతర్రాష్ట్ర ఒప్పందంపై ముందుకొస్తున్నట్లు ప్రకటిస్తూనే ఉంది తప్ప ఏమీ తేల్చడం లేదు. ఈ నెల 21న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సమాన కిలోమీటర్ల ప్రాతిపదికన అంగీకారం తెలుపుతూ అధికారికంగా లేఖ ఇచ్చినా టీఎస్‌ఆర్టీసీ కాలయాపన చేస్తోంది. 1.61 లక్షల కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు తిప్పుదామని ప్రతిపాదించింది. దీని మేరకే ఏపీఎస్‌ఆర్టీసీ అంగీకారం తెలుపుతూ లేఖ పంపింది.  (జనం సొమ్ముతో హైదరాబాద్‌లో ఇల్లా?)

అయితే లేఖ అందలేదంటూ టీఎస్‌ఆర్టీసీ పేర్కొనడం గమనార్హం. కాగా తెలంగాణ ఆర్టీసీ అధికారుల తీరును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమర్థించరని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని గురువారం మచిలీపట్నంలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కిలోమీటర్లు తిప్పాలి? ఏయే రూట్లలో తిప్పాలనే అంశంపై దాదాపు మూడు నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య చర్చలుజరుగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణతో ఒప్పందం కుదరకపోవడంతో రాష్ట్రం నుంచి బస్సులు నడపలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని చెప్పారు.

మరిన్ని వార్తలు