ఆపద్బంధు.. సీఎం సహాయ నిధి 

29 Oct, 2022 17:42 IST|Sakshi

ఆరోగ్యశ్రీ వర్తించని బాధితులకు వరం

జిల్లాలో సుమారు రూ.10 కోట్ల మేర సాయం

రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు..  

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

భీమవరం(ప్రకాశం చౌక్‌): పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు నాడు–నేడులో భాగంగా ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేస్తోంది. అలాగే ఆరోగ్యశ్రీ పథకం వర్తించని కేసులకు సంబంధించి రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది.

వారి పాలిట ఆపన్నహస్తంలా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీలో వైద్యం లేని వ్యాధులకు సంబంధించి ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం పొందిన పేద, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యానికి లక్షలు ఖర్చు చేసిన వారు ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా ఆర్థిక భరోసా అందిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధుల చేతులమీదుగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందిస్తున్నారు.  

రూ.10 కోట్లకు పైగా..  
రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడిన 2019 నుంచి ఇప్పటివరకు పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో బాధితులకు సుమారు రూ.10 కోట్లకు పైగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ సాయం అందించారు. సుమారు 2 వేల మంది వరకు ఈ సాయం అందినట్టు అంచనా. సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న రోగులకు ఆస్పత్రిలో అయిన ఖర్చును బట్టి రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు సాయం అందిస్తున్నారు.  

బాసటగా నిలుస్తున్న ఎమ్మెల్యేలు 
ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్న బాధితులకు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బాసటగా నిలుస్తున్నారు. నేరుగా వారి వద్దకు వచ్చినా లేదా గ్రామాల పర్యటన సందర్భంగా గుర్తించిన కేసులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వచ్చేలా కృషిచేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను వారి కార్యాలయాల నుంచి పంపించి బాధితులకు అండగా నిలుస్తున్నారు.  

సర్వత్రా హర్షం 
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ సాయంపై లబ్ధిదారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌ పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు సంబంధించి సాయం అందించడం అభినందనీయమని అంటున్నారు.   

రూ.10 లక్షలు ఇచ్చారు 
మా అబ్బాయికి కాలేయ సమస్య రావడంతో హైదరాబాద్‌లో వైద్యం చేయించాం. విషయాన్ని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ దృష్టికి తీసుకురాగా ఆయన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా రూ.10 లక్షలు వచ్చేలా సాయపడ్డారు. నేను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా మా అబ్బాయికి పెద్ద కష్టం వచ్చిపడింది. ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంది. సీఎం జగన్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు.
– పచ్చిపాల మూర్జా, గూట్లపాడు 

పేదలకు వరంలా.. 
మా మనవడు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆపరేషన్‌ చేయించాల్సి వచ్చింది. హైదరాబాద్‌ రెయిన్‌బో ఆస్పత్రిలో సొంత ఖర్చులతో ఆపరేషన్‌ చేయించాం. తర్వాత శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ద్వారా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా ఇటీవల రూ.5.20 లక్షల సాయం అందించారు. ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి వరంలా మారింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. 
– ఎం.రామకృష్ణ, విస్సాకోడేరు

మరిన్ని వార్తలు