పసి ప్రాణానికి అండగా ‘సీఎం సహాయనిధి’.. రూ.10 లక్షలు మంజూరు

24 Feb, 2022 05:41 IST|Sakshi
చిన్నారితో తల్లిదండ్రులు

లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలన్న వైద్యులు  

నిరాశతో హైదరాబాద్‌ నుంచి వెనుదిరిగిన తల్లిదండ్రులు  

విషయం గన్నవరం ఎమ్మెల్యే వంశీ దృష్టికి..  

ఆ వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరు 

గన్నవరం రూరల్‌: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ అండగా నిలిచింది. గంటల వ్యవధిలోనే ఆపరేషన్‌కు అవసరమైన రూ.10 లక్షలు మంజూరు కావడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడేనికి చెందిన మెట్లపల్లి రాఘవరావు వ్యవసాయ కూలీ.

అతని భార్య నాగలక్ష్మి గృహిణి. వీరికి గతేడాది నవంబర్‌ 6న మగబిడ్డ జన్మించాడు. అయితే బిడ్డ అనారోగ్యంతో ఉండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించి చివరికి హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారికి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని, రూ.10 లక్షలకు పైగానే ఖర్చవుతుందని, వెంటనే చేయకపోతే ప్రమాదమని చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబం ఇక చేసేది లేక చంటి బిడ్డతో ఇంటికి తిరిగొచ్చేశారు. సోమవారం గ్రామానికి చేరుకున్న తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రామ వైఎస్సార్‌సీపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు.
  
వెంటనే రూ.10 లక్షలు మంజూరు 
వైఎస్సార్‌సీపీ నేతలు బాలుడి విషయాన్ని ఫోన్‌ ద్వారా ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి రెయిన్‌బో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి చిన్నారి చికిత్సకు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధికి వివరాలు పంపి రూ.10 లక్షలు మంజూరు చేయించారు. కేవలం గంటల వ్యవధిలో చిన్నారి చికిత్సకు రూ.10 లక్షలు మంజూరు కావడంతో తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు మంజూరైన రూ.10 లక్షల చెక్కును బుధవారం వీరపనేనిగూడెం గ్రామ సచివాలయంలో వైఎస్సార్‌సీపీ నేతలు మేచినేని బాబు, పడమట సురేష్, కైలే శివకుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు ఎలిజబెత్‌రాణి, సర్పంచ్‌  జేజమ్మ, ఎంపీటీసీ పద్మావతి, ఉప సర్పంచ్‌ నాగసాంబిరెడ్డి, సహకార బ్యాంకు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు బాధిత కుటుంబానికి అందించారు.    

మరిన్ని వార్తలు