సీఎం జగన్‌కు ‘విశాఖ వందనం’

24 Sep, 2023 04:31 IST|Sakshi

విజయదశమి నుంచి విశాఖ నుంచి సీఎం పాలన   

విశాఖకు తరలిరానున్న సీఎంకు ఘన స్వాగతం పలకాలని నాన్‌ పొలిటికల్‌ జేఏసీ నిర్ణయం  

న్యాయస్థానంలో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని కూడా తీర్మానం  

సాక్షి, విశాఖపట్నం: విజయదశమి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ నుంచి పరిపాలించాలని తీసుకున్న నిర్ణయాన్ని నాన్‌ పొలిటికల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ స్వాగతించింది. విశాఖకు తరలిరానున్న ముఖ్యమంత్రికి ‘విశాఖ వందనం’ పేరుతో భారీగా స్వాగతం పలకాలని జేఏసీ నిర్ణయించింది. మూడు రాజధానుల అంశంపై న్యాయస్థానంలో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని జేఏసీ తీర్మానం చేసింది.

సర్క్యూట్‌ హౌస్‌లో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ లజపతిరాయ్‌ నేతృత్వంలో శనివారం జరిగిన సమీక్షలో వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో సహా పలువురు జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లజపతిరాయ్‌ మాట్లాడుతూ విశాఖకు పరిపాలన రాజధాని వస్తే.. వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి సాధిస్తాయన్నారు.   తాను ఇటీవల కాలంలో  సర్వే చేస్తే.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి 98 శాతం వరకు మద్దతు పలికారని తెలిపారు.  

స్పష్టమైన నిర్ణయంతో సీఎం జగన్‌  
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ నాలుగున్నరేళ్ల నుంచి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతి పేరిట ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి వృథా ఖర్చులు చేసిందన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతిలో రాజధాని నిర్మించాలనుకున్నారని,  అదీ సాధ్యం కాకపోవడంతో ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని చెప్పారు. మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ విశాఖకు రాజధానిని తరలించే విషయంలో న్యాయపరమైన చిక్కులున్నా.. సీఎం రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి అయినా పాలన సాగించవచ్చన్న భావనతో విశాఖ వైపు అడుగులేస్తున్నారని చెప్పారు.  

కార్యక్రమంలో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ సభ్యులు.. ప్రొఫెసర్‌ బాలమోహన్‌దాస్, ఏయూ విశ్రాంతి ప్రొఫెసర్‌ విజయకుమార్, నన్నయ్య యూనివర్సిటీ మాజీ వీసీ జార్జ్‌ విక్టర్, వ్యాపారవేత్త ముస్తఫా, ప్రొఫెసర్‌ ఎన్‌ఏడీ పాల్, డాక్టర్‌ ఎస్‌.రామారావు, ఏపీ హోటల్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కార్తీక్, ఏపీ ఎన్జీవో ప్రతినిధి కె.ఈశ్వరరావు, ఏయూ ప్రిన్సిపాల్‌ శోభాశ్రీ, ఏపీ బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ప్రతినిధి కృష్ణమోహన్, ప్రొఫెసర్‌ షారోన్‌రాజ్, విశాఖ మత్స్యకార సంఘాల అధ్యక్షుడు జానకీరామ్, ఏయూ విశ్రాంతి ప్రొఫెసర్‌ సూర్యనారాయణ, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, వాసుపల్లి గణే‹Ùకుమార్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు, గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్,  కొయ్య ప్రసాద్‌రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు