వడ్డెర కుటుంబానికి సీఎం అండ

15 Sep, 2023 04:28 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో కుమారుడిని పోగొట్టుకున్న తల్లిదండ్రులకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం 

పెద్ద కొడుకులా జగన్‌ అండగా నిలిచారంటూ బాలుడి తల్లిదండ్రుల కృతజ్ఞతలు

ధవళేశ్వరం: రోడ్డు ప్రమాదంలో కుమారుడిని పొగొ­ట్టుకుని పుట్టెడు దు:ఖంలో ఉన్న ఓ కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. వారి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన గుంజే బోయేసు..పెద్దింటు దంపతులు మట్టి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

ఈ దంపతుల ఏకైక కుమారుడు గుంజే ఈశ్వర దుర్గ (7) ఇటీవల బస్సు ఢీకొనడంతో చనిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు దూరం కావడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ విషయం తెలిసి ఎంపీ ఎం.భరత్‌రామ్‌ బాలుడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు. వారి విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సీఎం.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారు.

ఇందుకు సంబంధించిన చెక్కును ఎంపీ భరత్‌రామ్‌ బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో కుమారుడిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో తమకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద కొడుకులా అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. సీఎం చేసిన సాయాన్ని జీవితంలో మర్చిపోలేమంటూ కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు