కాలువలతో చెరువుల అనుసంధానం

10 Sep, 2022 02:31 IST|Sakshi

ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం

నియోజకవర్గం యూనిట్‌గా పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలి

కరువు ప్రాంతాల్లో చెరువులకు నీరు  చేరేలా దృష్టి సారించాలి.. అవసరమైన చోట కొత్తగా చెరువులు నిర్మించాలి

ఆ తర్వాత ఈ ప్రాజెక్టుల పనులు పరుగులు పెట్టించాలి.. ఇందుకు ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సాయం తీసుకోండి

10 ప్రాజెక్టుల కోసం రూ.25,497.28 కోట్లు

గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిన వంతెనల పనులు పూర్తి చేయాలి

పోర్టుల పరిధిలో ల్యాండ్‌ బ్యాంకు ఏర్పాటు  

సాక్షి, అమరావతి: రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరువు ప్రాంతాల్లో కాల్వల ద్వారా చెరువులను అనుసంధానం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఉండాల్సిన చోట చెరువులు ఉన్నాయా? లేవా? ఉన్న చెరువుల పరిస్థితి ఏంటి? వాటికి నీరు చేరడంలో ఉన్న ఇబ్బందులు, తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో ఈ ప్రాజెక్టు కింద పనులను పరుగులు పెట్టించాలని సూచించారు. విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో (ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్‌) రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరువు ప్రాంతాల్లో చెరువులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. అవసరమైన చోట చెరువులు లేకపోతే.. అక్కడ కొత్తగా చెరువులు నిర్మించాలని ఆదేశించారు. ఈ చెరువులన్నింటికీ గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. దీనివల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని, పర్యావరణ సమతుల్యత కూడా ఉంటుందన్నారు. చెరువు కింద చక్కగా భూముల సాగు జరుగుతుందని, వ్యవసాయం బాగుండడంతో ఉపాధి, ఆదాయాలు కూడా స్థిరంగా ఉంటాయని తెలిపారు.  

ఆ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెరగాలి
విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో వివిధ రంగాలలో చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్ధేశిత సమయంలోగా ఆయా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. న్యూ డెవలప్‌మెంట్‌ (ఎన్డీబీ)బ్యాంకు, ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ), జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ.. తదితర బ్యాంకుల రుణ సహాయంతో మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25,497.28 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా గత చంద్రబాబు ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన వంతెనల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లును వెంటనే పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.

పోర్టుల పరిధిలో సత్వర అభివృద్ధి
రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నామని, వీటి చుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు బాగా ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాటి పరిధిలో ల్యాండ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం అన్నది చాలా అవసరం అని స్పష్టం చేశారు. దీనివల్ల పోర్టు ఆధారితంగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జి సృజన, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ పి రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: చంద్రబాబు ఎయిర్‌పోర్ట్‌ నిర్మించడమేంటి.. వినేవాడుంటే బాబు ఏదైనా చెప్తారు: కొడాలి నాని ఫైర్‌

మరిన్ని వార్తలు