విజయవాడ ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురుపూజోత్సవం

5 Sep, 2022 03:47 IST|Sakshi

సాక్షి , అమరావతి: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొని రాష్ట్రంలోని 176 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేసి సన్మానించారు.

పాఠశాల విద్యాశాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్‌ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురు ఈ పురస్కారాలను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ విద్యాలయ అవార్డులు సాధించిన 26 పాఠశాలలను కూడా ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.

గవర్నర్‌ టీచర్స్‌ డే శుభాకాంక్షలు 
సమసమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు మూలస్తంభాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఆయన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడైన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉన్నత విలువల కోసం అహరహం కృషి చేశారని కొనియాడారు.

పాశ్చాత్య దేశాలకు భారతీయ తత్వ శాస్త్రాన్ని, విజ్ఞానాన్ని పరిచయం చేశారని పేర్కొన్నారు. అటువంటి మహనీయుని జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఉపాధ్యాయులకు గర్వకారణమన్నారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.   

మంత్రి బొత్స గురుపూజోత్సవ శుభాకాంక్షలు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషిస్తారని, అటువంటి వారిని గురుపూజోత్సవం రోజు సన్మానించుకోవడం ముదావహమని మంత్రి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యారంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు.    

మరిన్ని వార్తలు