అక్కా.. సాయం అందిందా?

28 Jul, 2022 03:28 IST|Sakshi

ప్రతి ఒక్కరితో మాట్లాడి కష్టాలు తెలుసుకున్న సీఎం

బాధితుల్లో భరోసా నింపిన ముఖ్యమంత్రి పర్యటన

కరచాలనం కోసం పోటీపడిన జనం.. సాయం బాగా అందిందని హర్షం 

వేలేరుపాడు, చింతూరు: ‘చరిత్రలో ఇప్పటి వరకు కన్నాయిగుట్ట గిరిజన గ్రామానికి ఏ ముఖ్యమంత్రీ రాలేదు. మొదటిసారిగా మా అభిమాన నేత కష్టాల్లో ఉన్న మమ్మల్ని పలకరించి మనోధైర్యాన్ని నింపేందుకు కొండలు, కోనలు దాటుకుని వచ్చారు. ఆయన రాకే మాకు కొండంత భరోసా ఇచ్చింది. ఆయన మాట్లాడాక మాలో భయం పోయింది’ అంటూ ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం హెలీప్యాడ్‌కు చేరుకున్నప్పటి నుంచి గ్రామంలో పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే వరకు కాన్వాయి వెంట బారులు తీరి సీఎంతో కరచాలనం చేయడానికి పెద్ద ఎత్తున జనం పోటీపడ్డారు.

పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలతో, గ్రామస్తులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. అక్కా.. అన్నా.. సాయం అందిందా.. అంటూ ఆరా తీశారు. ప్రభుత్వ సాయం బాగా అందిందని, అందరూ ముక్తకంఠంతో సమాధానం చెప్పారు. దాదాపు అర కిలోమీటరుకు పైగా సీఎం నడుచుకుంటూ వెళ్లి బాధితులతో మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపారు. నీట మునిగిన ఇళ్లకు రూ.4 వేలు ఉన్న పరిహారాన్ని రూ.10 వేలు చేస్తాం అని చెప్పారు. అనంతరం ఫొటో ఎగ్గిబిషన్‌ను పరిశీలించారు. 

అక్కడికక్కడే సమస్యల పరిష్కారం
చింతూరు మండలం కుయిగూరులో పడిపోయిన ఇంటిని సీఎం తొలుత పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. ముందు వరుసలో కూర్చొన్న ఓ బాలికను ఆప్యాయంగా పిలిచి దీవించడంతో పాటు ప్రసంగం ముగిసే వరకు తన వద్దే నిలబెట్టుకున్నారు. సూరన్నగొందికి చెందిన జానీ అనే యువకుడు తమ గ్రామంలో పాఠశాల నిర్మాణం అసంపూర్తిగా వుందని, దానిని పూర్తి చేయాలని కోరాడు. నాడు–నేడులో పాఠశాలను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అక్కడి నుంచి చట్టి గ్రామానికి బస్సులో బయలుదేరిన సీఎం.. మార్గంమధ్యలోని నిమ్మలగూడెం వద్ద బస్సు నుంచి దిగి వారితో మాట్లాడారు. సరోజిని అనే వృద్ధురాలు గత ఆరు నెలలుగా తనకు గొంతు సరిగా పనిచేయక మాట రావడంలేదని చెప్పారు. ఆమెకు వైద్యం చేయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎనిమిదేళ్ల దివ్యాంగ బాలిక మడకం దుర్గాభవానీకి పింఛను రావట్లేదని తెలపడంతో.. పింఛను వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు