'నేనున్నాను'.. మీకేం కాదు

4 Dec, 2022 05:51 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌కు తమ బిడ్డల అనారోగ్యం గురించి వివరిస్తున్న కుంచెపు శివకుమార్, వరలక్ష్మి

రెండు కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా

ఓ కుటుంబంలో ఇద్దరు చిన్నారులకు రక్త సంబంధిత వ్యాధి.. మరో కుటుంబ పెద్దకు బ్రెయిన్‌ ట్యూమర్‌ 

ఆరోగ్యశ్రీ పరిధిలో లేని, అత్యంత ఖర్చుతో కూడిన వ్యాధులివి..

తక్షణ సాయం.. చికిత్సకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం

సాక్షి ప్రతినిధి, కడప: ఆస్తులమ్ముకున్నా రోగం నయం కాక తల్లడిల్లిపోతున్న రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వమే వైద్యం చేయిస్తుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు శనివారం పులివెందులలో ఉన్న సీఎంను ఆ రెండు కుటుంబాలు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నాయి.

పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన కుంచెపు శివకుమార్, వరలక్ష్మి దంపతులు పదేళ్లుగా పులివెందులలో మిషన్‌ కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి హైందవ్‌ (8), కుశల్‌ (5)అనే కుమారులు ఉన్నారు. వీరిద్దరికీ పుట్టినప్పటి నుంచి బ్లడ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ లేదు. వైద్యం కోసం చెన్నై, బెంగళూరు, వేలూరు, హైదరాబాద్‌ తదితర నగరాల్లోని పలు ఆస్పత్రులకు తిరిగారు.

వైద్య ఖర్చుల కోసం ఉన్న ఇంటిని అమ్ముకున్నారు. బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తే ఫలితం ఉంటుందని వైద్యులు సూచించారు. ఇందుకు లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేని శివకుమార్‌ దంపతులు శనివారం పులివెందులకు వచ్చిన ముఖ్యమంత్రిని  కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సహాయంతో హెలిప్యాడ్‌లో కలిశారు.

వారి సమస్యను విన్న ముఖ్యమంత్రి తానున్నానంటూ ధైర్యం చెప్పారు. పిల్లల వైద్యం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ వి.విజయరామరాజులకు సూచించారు. వైద్యం కోసం వెళ్లేందుకు ఖర్చుల కింద తక్షణమే రూ.లక్ష మంజూరు చేయాలని ఆదేశించారు. వారికి ఇల్లు కూడా మంజూరు చేయాలని చెప్పారు.  
ముఖ్యమంత్రి జగన్‌కు తన భర్త అనారోగ్య సమస్యను వివరిస్తున్న శివజ్యోతి  

ప్రభుత్వమే వైద్యం చేయిస్తుంది..
అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన జగన్‌మోహన్‌రెడ్డి అనే పేద రైతు బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చూపించారు. చికిత్స కోసం రూ.20 లక్షలకు పైగానే ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఏం చేయాలో దిక్కుతోచని భార్య శివజ్యోతి.. కుమార్తెలు సౌమ్య, హరిప్రియ, యామినితో కలిసి శనివారం పులివెందులకు వచ్చి, సీఎంను కలిసింది.

తమ పరిస్థితి వివరించి.. మీరే ఆదుకోవాలని వేడుకుంది. ఆయన వైద్యానికి అయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. వారు వైద్యం కోసం వెళ్లేందుకు సత్వరమే రూ.2 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరు కుటుంబాల వారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.
వాస్తవానికి ఈ రెండు కుటుంబాల్లోని వారి వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించదు. ఈ ముగ్గురి చికిత్స కోసం రూ.50 లక్షలకు పైగానే ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా. సీఎం ఆదేశాలతో ఈ మొత్తం డబ్బును ప్రభుత్వమే వెచ్చించనుంది.  

>
మరిన్ని వార్తలు