ఆందోళన వద్దు.. అత్యున్నత వైద్యం అందిస్తున్నాం

8 Dec, 2020 03:25 IST|Sakshi
ఏలూరు ఆస్పత్రిలో చిన్నారిని పరామర్శిస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రులు, వైద్యులు

నిపుణులు, పరిశోధక బృందాలను నగరానికి రప్పిస్తున్నాం

ఏలూరు ఆస్పత్రిలో బాధితులకు ముఖ్యమంత్రి జగన్‌ పరామర్శ

సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు టౌన్‌: అంతుచిక్కని వ్యాధితో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సోమవారం ఉదయం 10.20 గంటలకు ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌ బాధితులతో దాదాపు గంటసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. వారి వద్దకు వెళ్లి వారి మంచంపైనే కూర్చొని అందర్నీ పలకరించారు. బాధితులు ఎలా అస్వస్థతకు గురయ్యారు? ఎలాంటి లక్షణాలు కనిపించాయి? ప్రస్తుతం ఎలా ఉంది? వైద్యం ఎలా అందుతోంది? ఆస్పత్రిలో సదుపాయాలు ఎలా ఉన్నాయి? అని వాకబు చేశారు. బాధితులు ఒక్కొక్కరి వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించి ఆందోళన చెందవద్దని, పూర్తి స్థాయిలో వైద్య చికిత్స అందచేస్తామని ధైర్యాన్ని కల్పించారు. అత్యున్నత వైద్య నిపుణులు, పరిశోధక బృందాలను రప్పించామని ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని స్వయంగా సీఎం భరోసానివ్వడం బాధితులకు కొండంత ఊరటనిచ్చింది.

బాధితులకు ఇబ్బంది లేకుండా... 
బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వస్తున్నప్పటికీ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒకవైపు ఎమర్జెన్సీ విభాగంలో వైద్య సేవలు కొనసాగిస్తూనే మరోవైపు ఎంసీహెచ్‌ బ్లాక్‌లో బాధితులను సీఎం పరామర్శించేలా ఏర్పాట్లు చేశారు. అనారోగ్యానికి గురవుతున్న బాధితులకు సత్వరమే వైద్య సేవలు అందించేలా 20 మందికి పైగా వైద్యుల బృందాన్ని నియమించారు. ఎమర్జెన్సీ విభాగం వద్ద హెల్ప్‌ డెస్కును ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు వివరాలు అందించటంతోపాటు 108 అంబులెన్సు వాహనాలను సిద్ధంగా ఉంచారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ వెంట ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, ఎస్పీ కె.నారాయణ నాయక్‌ తదితరులున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు