మరపురాని జ్ఞాపకం డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి

4 Oct, 2021 03:36 IST|Sakshi

కుటుంబ సభ్యులతో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

వైఎస్సార్‌ ఆడిటోరియంలో ప్రత్యేక ప్రార్థనలు

ఆయన స్మృతులతో రూపొందించిన పుస్తకం ఆవిష్కరణ

సాక్షి, పులివెందుల: దివంగత డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి ఆదివారం పులివెందులలో నిర్వహించారు. డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్‌ సమాధుల తోటలో ఉన్న డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ఘాట్‌ వద్ద ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, దివంగత వైఎస్‌ జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, ఇతర వైఎస్‌ కుటుంబీకులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భాకరాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. సంస్మరణ సభ అనంతరం మరపురాని జ్ఞాపకం డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభకు వైఎస్‌ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. 

సంస్మరణ సభలో వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ.. డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి క్రెడిబులిటీ ఉన్న వ్యక్తి అని అన్నారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. పేదల మనసు గెలుచుకున్న వ్యక్తి' అంటూ కొనియాడారు.  

పేదల డాక్టర్‌గా గుర్తింపు
దివంగత డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి పేదల డాక్టర్‌గా పులివెందుల ప్రాంతంలో గుర్తింపు పొందారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా ఇట్టే నయమవుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ఈయన చిన్నపిల్లల డాక్టర్‌గా ప్రాచుర్యం పొందారు. 1949 ఏప్రిల్‌ 20వ తేదీన ఇసీ సిద్ధారెడ్డి, తులశమ్మ దంపతులకు రెండో సంతానంగా వేముల మండలం గొల్లలగూడూరులో ఇ.సి. గంగిరెడ్డి జన్మించారు. 1 నుంచి 5వ తరగతి వరకు గొల్లలగూడూరు ఆర్‌సీఎం స్కూలు, 6 నుంచి 8వ తరగతి వరకు పులివెందులలోని జెడ్పీ హైస్కూలులో, 9 నుంచి 11వ తరగతి వరకు వేముల జెడ్పీ హైస్కూలులో, ఎంబీబీఎస్‌ వారణాసిలోని బెనారస్‌ యూనివర్శిటీలో విద్యనభ్యసించారు. బెనారస్‌ యూనివర్శిటీలో ఆయన పీడీ కూడా పూర్తి చేశారు. అనంతరం పులివెందులలోని వైఎస్‌ రాజారెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. తర్వాత పులివెందులలోని శ్రీనివాసహాలు వీధిలో గంగిరెడ్డి ఆసుపత్రి స్థాపించి వైద్య సేవలు అందించేవారు.

పులివెందులలోని గంగిరెడ్డి ఆసుపత్రి అంటే ఎంతో ప్రాచుర్యం పొందింది. పులివెందుల ప్రాంతంలో పేదల వైద్యునిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. వైద్యం చేయడమే ప్రధాన ఆశయంగా ప్రతిఫలం ఆశించని డాక్టర్‌గా ఇక్కడ గు ర్తింపు పొందారు. ఎలాంటి రోగమైనా ఆయ న దగ్గరకు వెళ్లి ఆయన చేయి పడితే నయమవుతుందని పులివెందుల ప్రాంత ప్రజల నమ్మకం. పులివెందుల ప్రాంత ప్రజలేకాకుండా జిల్లాలో నలుమూలల నుంచే కాకుండా అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా ఆయన వద్దకు రోగులు వచ్చి వైద్య సేవలు పొందేవారు. వైద్య సేవలలో మారుతున్న కాలాన్ని బట్టి ఆయన భాకరాపురంలో అత్యాధునిక వైద్య పరికరాలతో దినేష్‌ నర్సింగ్‌ హోం(గంగిరెడ్డి ఆసుపత్రి)ను స్థాపించి వైద్య సేవలు అందించేవారు. తన వద్దకు వచ్చే రోగులపట్ల ఆయన ఎంతో ప్రేమ, ఆప్యాయతలను కనబరిచేవారు. అలాంటి వ్యక్తి తమ మధ్య లేరన్న విషయాన్ని పులివెందుల ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.  

రాజకీయ ప్రస్థానం : డాక్టర్‌  ఇ.సి. గంగిరెడ్డి 2001 నుంచి 2005 వ రకు పులివెందుల మండల ప్రెసిడెంట్‌గా ప్ర జలకు సేవలు అందించారు. వైఎస్‌ కుటుంబం పోటీ చేసే ప్రతి ఎన్నికలోనూ ఆయన తనవంతు పాత్ర పోషించేవారు. ఎన్నికల సమయంలో వైఎస్‌ కుటుంబానికి మద్దతుగా నియోజకవర్గంలోని ఆయన ప్రచారం నిర్వహించేవారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు