పారిశ్రామిక హబ్‌గా ఏపీ

5 Mar, 2023 02:46 IST|Sakshi

పెట్టుబడులకు రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానం

జీఐఎస్‌ ముగింపు సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌

మూడున్నరేళ్లలో ఆర్థికాభివృద్ధి సాధించాం.. కీలక సమయంలో సమ్మిట్‌ నిర్వహణ

378 ఎంవోయూల ద్వారా రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు

తద్వారా 6.09 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు.. ఈ పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలా సహకారం

అందుకోసం సీఎస్‌ నేతృత్వంలో కమిటీ

రాష్ట్రంలో పెట్టుబడులను మరింతగా పెంచేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. పారిశ్రామిక, వ్యాపారవేత్తలు నిర్వహించే కార్యకలాపాలకు మా ప్రభుత్వ మద్దతు, సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది. మీతో బంధం మాకు చాలా విలు­వైనది. రెండు రోజుల ఈ సదస్సు రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మరింత సానుకూల వాతావరణం కల్పించడానికి అద్భు­తంగా దోహదపడుతుంది. పారిశ్రామికీ­కరణ దిశగా ప్రయత్నాలకు రెట్టింపు ప్రోత్సాహాన్నిస్తుంది.  – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌


విశాఖ జీఐఎస్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల హబ్‌గా తీర్చిదిద్దుతున్నా­మని, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు రాష్ట్రాన్ని ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలుపుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టు­బడుల వృద్ధికి కృతనిశ్చయంతో ఉన్న తమ ప్రభుత్వం.. అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సదు­పాయాలు కల్పిస్తుందని పారిశ్రామికవేత్తలకు భరోసాని­చ్చారు. కరోనా ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి మూడున్నరేళ్లలో ఆర్థికాభివృద్ధి సాధించడం తమ ప్రభుత్వ ఘనత అని చెప్పారు.

కీలక సమయంలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో కుదిరిన 378 ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో 6.09 లక్షల మందికి ఉద్యోగాలు లభించనుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాల మేరకు పరిశ్రమలను స్థాపించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023’ రెండో రోజు శనివారం ముగింపు సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తద్వారా తన ఆత్మవిశ్వాసం, ఉత్సాహం రెట్టింపు అయిందని చెప్పారు. ఈ సమ్మిట్‌లో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

మూడున్నరేళ్లలో పుంజుకున్న ఆర్థిక వ్యవస్థ
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడున్న­రేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ శరవేగంతో పుంజుకుంది. కోవిడ్‌ మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం సానుకూ­లంగా స్పందించి అనేక రంగాలకు ప్రోత్సాహాన్నిచ్చింది. 

 మా సుపరిపాలన విధానాలు ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలిచాయి. ద్రవ్యలోటు నియంత్రణలో ఉండేలా చేశాయి. తద్వారా వ్యాపారాలు ప్రమాదంలో పడకుండా మా ప్రభుత్వం చూసింది. కోవిడ్‌ సమయంలో అత్యంత జాగురూకతతో వ్యవహరించి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు మరింత సానుకూల వాతావరణం కల్పించేందుకు ఒక నిర్దిష్ట మార్గాన్ని ఏర్పాటు చేశాం. మౌలిక సదుపాయాల వ్యవస్థను బలోపేతం చేశాం. ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను విస్తరించి యువతలో నైపుణ్యాలను మరింతగా పెంపొందించాం. పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా ఏపీ

♦ అత్యంత కీలక సమయంలో ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను నిర్వహించాం. దేశ, విదేశీ పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను అనుకూల గమ్యస్థానంగా నిలపడంలో ఈ సమ్మిట్‌ విజయం సాధించింది. వివిధ రంగాలపై 15 సెషన్లుగా నిర్వహించిన చర్చాగోష్టుల్లో 100 మందికి పైగా ప్రముఖులు, నిపుణులు మాట్లా­డారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సానుకూల అంశాలేమిటో వివరించారు.

 ఆటోమొబైల్, ఈవీ సెక్టార్, హెల్త్‌ కేర్, మెడికల్‌ ఎక్విప్‌మెంట్, రెన్యూవబుల్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా, అగ్రి ప్రాసెసింగ్, టూరిజం తదితర రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశా­లను విశదీకరించారు. మరిన్ని రంగాల్లో మరిన్ని పెట్టుబ­డులకు అవకాశాలను అన్వేషించేందుకు యూఏఈ, నెద­ర్లాండ్స్, వియత్నాం, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాలను భాగ­స్వా­ములుగా చేసుకుని మరో నాలుగు సెషన్లు కూడా నిర్వహించాం. సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ ఎరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

 ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ అనే థీమ్‌తో 137 స్టాళ్లను ఈ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశాం. సమ్మిట్‌ సందర్భంగా రెండు రోజులపాటు కేంద్ర మంత్రులు, విదేశీ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, రాయబారులు, దేశీయ, అంతర్జాతీయ పారి­శ్రామికవేత్తలతో ముఖాముఖి చర్చలు జరపడం సం­తోషంగా ఉంది. ఈ సమావేశాలన్నీ ఫలప్రదమయ్యాయి. 
పరిశ్రమల గ్రౌండింగ్‌కు కమిటీ

 పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ మీద ప్రత్యేకించి మా ప్రభుత్వం మీద మీరు చూపించిన నమ్మకానికి ధన్యవాదాలు. ఎంవోయూలు కుదుర్చుకున్న వారంతా త్వరగా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలని కోరుతు­న్నా­ను. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటుంది. అన్ని సదుపాయాలు కల్పిస్తుంది.

♦ పరిశ్రమలు స్థాపించేలా పర్యవేక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసే ఈ కమిటీలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఈ సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకుంటుంది. పరిశ్రమలు స్థాపించే క్రమంలో పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ఎంవోయూలు ఫలప్రదమయ్యేలా చూస్తుంది. 

మా సానుకూల దృక్పథానికి నిదర్శనం
 రూ.3,841 కోట్లతో స్థాపించిన 14 పారిశ్రామిక యూనిట్లను ఈ సమ్మిట్‌ వేదిక నుంచి ప్రారంభించాం. వాటితో 9,108 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కింబర్లే క్లార్క్, బ్లూస్టార్, క్‌లైమాటిక్, లారస్‌ ల్యాబ్, హేవెల్స్‌ ఇండియా, శారదా మెటల్స్, అల్లాయిస్‌ తదితర కంపెనీలు ఈ పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీలను ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నాను. 

 రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును సాకారం చేయడానికి, పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందించడంలో మా ప్రభుత్వ సానుకూల దృక్పథానికి ఈ రోజు ప్రారంభించిన ఈ పారిశ్రామిక యూనిట్లే నిదర్శనం. ఈ రోజు  యూనిట్లు ప్రారంభించిన వారందరికీ శుభాకాంక్షలు. వారి పారిశ్రామిక కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. సరైన మార్గ నిర్దేశం చేస్తాంపారిశ్రామికవేత్తలను ఆహ్వానించడమే కాకుండా, వారికి సరైన మార్గనిర్దేశం చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. నైపుణ్యవంతమైన మానవ వనరులను అందించే చక్కటి వాతావరణం ఇక్కడ కల్పిస్తున్నాం. వ్యాపారాల్లో ఉన్న నష్టతరమైన సంక్లిష్టతను తగ్గించడంతోపాటు ఎంవోయూల మేరకు ఆటంకాలు లేకుండా పరిశ్రమల స్థాపనకు ఇది దోహదపడుతుంది. 


378 ఒప్పందాలు.. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు
రెండు రోజుల సదస్సులో రూ.13,41,734 కోట్ల విలువైన పెట్టుబడులతో 378 ఎంఓయూలు కుది­రాయి. ఈ ఒప్పందాల వల్ల మొత్తం 6,09,868 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఒక్క ఇంధన రంగంలోనే రూ.9,57,112 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాం. దాంతో  1,80,918 మందికి ఉద్యోగాలు వస్తాయి. 

ఐటీ, ఐటీ ఆధారిత రంగాలకు సంబంధించి 82 ఒప్పందాలు చేసుకున్నాం. వీటి విలువ రూ.73,819 కోట్లు. దాంతో 1,40,002 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పర్యాటక రంగానికి సంబంధించి 117 అవగాహన ఒప్పం­దాలు చేసుకున్నాం. వాటితో రూ.22,096 కోట్ల పెట్టుబడులు వస్తాయి. దాంతో 30,787 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రెండో రోజు సదస్సులో భాగంగా రూ.1.56 లక్షల కోట్ల పెట్టుబడులతో 286 ఎంఓయూలు చేసుకున్నాం. వీటి ద్వారా సుమారు 2.09 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

 పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్‌ ఎనర్జీ) రంగంలో భారీగా పెట్టుబడులు సాధించాం. గణనీయమైన పెట్టు­బడులకు అవకాశాలున్న రంగాల్లో రెన్యూవబుల్‌ ఎనర్జీ రంగం ప్రధానం. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంప్డ్‌ స్టోరేజీ, గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి మేం సాధిస్తున్న పెట్టుబడులు ఈ రంగంలో ఉన్న సమస్యను, సంక్లిష్టతను పరిష్కరిస్తాయి. శిలాజ ఇంధన ఆధారిత ఉత్పత్తికి విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ ఇంధన వనరులను చూపిస్తాయి. కర్బన రహిత లక్ష్యంగా గ్రీన్‌ ఎనర్జీ సాధన దిశగా మన దేశ లక్ష్య సాధనకు ఆంధ్రప్రదేశ్‌ తగిన సహకారం అందిస్తుంది. 

మరిన్ని వార్తలు