రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

2 Nov, 2020 01:45 IST|Sakshi

అవినీతికి, వివక్షకు తావులేని సంక్షేమ పాలన.. 17 నెలల పాలనలో కులం, మతం, వర్గం, రాజకీయాలు ఏవీ చూడలేదు

రాష్ట్రావతరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేసి ప్రజలతో మమేకమై సమస్యలు గుర్తించాం

అధికారంలోకి వచ్చాక వాస్తవిక దృక్పథంతో పనిచేస్తున్నాం

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చదువు, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం కోసం సంక్షేమ కార్యక్రమాలు 

దేవతల యజ్ఞానికే రాక్షసుల పీడ తప్పనప్పుడు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వానికి ఆటంకాలు ఎదురుకాకుండా ఉంటాయా?

తెలుగు నేలపై కులాల కలుపు మొక్కలు మన పరువును బజారుకీడుస్తున్నాయి.. 

తమ వాడు గెలవలేదన్న కడుపు మంటతో ఓ వర్గం మీడియా నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తోంది

కొందరు వ్యక్తులు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు

క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కలెక్టర్లు, ఎస్‌పీలతో వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, అమరావతి: కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ, రాజకీయాలు, ఇవేవీ చూడకుండా ఎక్కడా వివక్షకు, అవినీతికి తావులేకుండా తమ 17 నెలల పాలన సాగిందని, ఇకముందు కూడా అదేవిధంగా కొనసాగుతుందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో చదువు, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని సగర్వంగా చెబుతున్నానన్నారు. తెలుగు వారందరికీ మంచి జరగాలని, గ్రామాల రూపురేఖలు మార్చాలన్న ఒక కలతో ముందుకు పరుగెత్తామని సీఎం పేర్కొన్నారు. మన తెలుగు రాష్ట్రంలో ఒక మహా యజ్ఞం జరుగుతోందని, దేవతల యజ్ఞానికే రాక్షసుల పీడ తప్పనప్పుడు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న మన ప్రభుత్వానికి ఆటంకాలు ఎదురుకాకుండా ఉంటాయా? అని జగన్‌ ప్రశ్నించారు. తెలుగు నేల మీద పుట్టిన కులాల కలుపు మొక్కలు మన పరువు ప్రతిష్టలను బజారుకీడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తన క్యాంప్‌ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

గట్టిగా ఆలోచించాల్సిన అంశాలివి..
– నా వారు, కాని వారు అన్న ధోరణులు ఈ రోజుకీ బాహాటంగా రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్నాయి. ఇలాంటి ధోరణులను సమర్థించవచ్చా? 
–  ప్రజల తీర్పును, ప్రజా ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, వ్యక్తులు చేస్తున్న వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ మొత్తంగా తెలుగు జాతి ప్రయోజనాలకు వేరు పురుగుగా మారింది. దీన్ని ఇలాగే కొనసాగిద్దామా? 
– తన వాడు గెలవలేదు, తమ వాడు పదవిలో, అధికారంలో లేడన్న కడుపు మంటతో నిత్యం అసత్యాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న టీవీలు, పేపర్ల వ్యవహారాన్ని సమాచార స్వేచ్ఛ అందామా? వీటన్నిటిపైనా మనం గట్టిగా ఆలోచన చేయాలి.

మహనీయుల త్యాగఫలం ఆంధ్రప్రదేశ్‌
– అమరజీవి పొట్టి శ్రీరాములు మహాత్యాగాన్ని స్మరించుకుంటూ, ఒక రాష్ట్రంగా మనల్ని మనం సమీక్షించుకుంటూ మరిన్ని అడుగులు ముందుకు వేసేందుకు ఈరోజు అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.
– తెలుగువారికి రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్‌ 19న పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించడం, 58 రోజుల పాటు ఆ దీక్ష కొనసాగడం, 1952 డిసెంబర్‌ 15న ఆయన మన రాష్ట్రం కోసం అమరులు కావడం, 1953 అక్టోబర్‌ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించడం, ఆ తర్వాత తెలుగు వారందరి ఉమ్మడి రాష్ట్రంగా 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడం మనందరికీ తెలిసిన గొప్ప చరిత్ర. మన బంగారు భవిష్యత్తు కోసం ఎందరో త్యాగమూర్తులు చేసిన త్యాగ ఫలితం ఇది.

నెరవేర్చాల్సిన పనులు కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి 
– 28 రాష్ట్రాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం పడనంతగా, ఇన్ని త్యాగాల నడుమ కూడా ఇంతగా దగా పడిన రాష్ట్రం మనదే అని గుర్తుంచుకోవాలి. బయటివారి కత్తిపోట్లు, సొంతవారి వెన్నుపోట్లు వీటన్నింటితో తల్లడిల్లిన రాçష్ట్రం మనది.
– నేటికీ రాష్ట్రంలో 33 శాతం మంది చదువు రానివారు ఉన్నారు. దాదాపుగా 85 శాతం ప్రజలు తెల్ల రేషన్‌కార్డులతో బీపీఎల్‌ దిగువన ఉన్నారు. 
– స్వయం సహాయక బృందాలలో చేరి దాదాపు 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలు నేటికీ సమరం చేస్తున్నారు. ఒక పంటకు కూడా కనీçస నీటి సదుపాయం లేని కోటి ఎకరాల భూములు ఇవాళ్టికీ మన రాష్ట్రంలో ఉన్నాయి. 
– ఆవాసం కోసం నేటికీ 32 లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. అలాగే పిల్లల చదువులు, కుటుంబసభ్యుల ఆరోగ్యం కోసం ఎన్నో కుటుంబాలు ఆస్తులు అమ్ముకుంటున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి హక్కుగా దక్కాల్సిన సేవల కోసం కూడా దేబిరించాల్సిన పరిస్థితి ఉంది. 
– ఇలాంటి అనేక అంశాలు నెరవేర్చాల్పిన మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. కాబట్టే గ్రామ, గ్రామాన ప్రజల ఆకాంక్షలు, అవసరాలను వారిలో ఒకరిగా ఉండి, వారితో మమేకమై, వేల కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణం చేసి సమస్యలు గుర్తించాం.

ప్రతి అంశంపైనా దృష్టి పెట్టాం
– మన గ్రామం, మన వ్యవసాయం, మన కుటుంబం, మన బడి, మన ఆస్పత్రి, మన వైద్య ఆరోగ్య రంగం, మన నీటి పారుదల రంగం వంటి ప్రతి ఒక్క అంశంపైనా.. అధికారంలోకి వచ్చిన తర్వాత దృష్టి పెట్టాల్సిన దానికన్నా మరింత వాస్తవిక ధృక్పథంతో దృష్టి పెడుతున్నాం. 
– గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని సుపరిపాలన దిశగా కనీవినీ ఎరుగని విధంగా అడుగులు వేస్తున్నాం. చరిత్రలో లేని విధంగా మొత్తం వ్యవస్థలోనే మార్పులకు శ్రీకారం చుట్టాం.

అందుకే ఈ ఫలితాలు
–  ఇప్పుడు ఒక గ్రామంలోకి ఒక వ్యక్తి అడుగుపెట్టిన వెంటనే, 2 వేల జనాభా కలిగిన ఆ గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తోంది.  
– ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ ఏర్పాటుతో ప్రతి ప్రభుత్వ సేవ ఈరోజు డోర్‌ డెలివరీ జరుగుతోంది.
– నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో నాడు–నేడు కార్యక్రమంతో ఒక ఇంగ్లిష్‌ మీడియమ్‌ స్కూల్‌ రూపురేఖలు కనిపిస్తున్నాయి.
–మరో నాలుగు అడుగులు ఇటువేస్తే.. ఏకంగా 51 రకాల మందులతో, ఏఎన్‌ఎం నర్సు, ఆశా వర్కర్లతో ఆరోగ్యశ్రీకి రెఫరల్‌గా వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ 24/7 సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
–అటువైపు చూస్తే రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. విత్తనం నుంచి పంట అమ్ముకునే వరకు ప్రతి దశలోనూ రైతును చేయిపట్టి నడిపిస్తున్న ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. మరో నాలుగు అడుగులు వేస్తే జనతా బజార్లు కూడా కనిపించే విధంగా కార్యాచరణ జరుగుతోంది.

ప్రజాబలం, దేవుడి ఆశీస్సులతో ముందుకుసాగుతాం..
– సమస్యలు ఉన్నాయి. సవాళ్లు కూడా ఉన్నాయి. అయినా మన ముందున్న కర్తవ్యం పవిత్రమైనది. లక్ష్యం ఉన్నతమైనది కాబట్టి ప్రజాబలంతో అందుకు మార్గం వేయగలమని, దేవుడి ఆశీస్సులతో అడుగులు ముందుకు వేయగలమనే నమ్మకం ఉంది. 
– ఇక మీదట మనందరి ప్రభుత్వం మన రాష్ట్రంలోని ప్రతి ఇంటి ఆత్మగౌరవం నిలబెట్టేలా వెరుపన్నది లేకుండా ముందుకు సాగుతుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

పొట్టి శ్రీరాములు విగ్రహానికి సీఎం నివాళులు 
తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం కోవిడ్‌–19 నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగు తల్లి, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు నమస్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడీ కృష్ణమోహన్, సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌సవాంగ్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు