అవి సహజ మరణాలే

24 Mar, 2022 03:36 IST|Sakshi

సాక్షి, అమరావతి: జంగారెడ్డి గూడెంలో ఇటీవల మృతి చెందిన వారివి సహజ మరణాలేనని సంబంధిత కుటుంబాల వారు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. మృతుల కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోలను చూపించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.    

పక్షవాతంతో బాధపడుతూ..
మా నాన్న మూడేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ మంచంలోనే ఉన్నారు. 6వ తేదీన ఫిట్స్‌ వచ్చి చనిపోయాడు. అయితే ఆయన సారా తాగి చనిపోయాడని ప్రచారం చేస్తున్నారు. చాలా బాధగా ఉంది. 
– మృతుడు వేమవరపు గురుబ్రహ్మం కుమార్తె, దేవాయగూడెం

ఆరోగ్యం చెడిపోయి మృతి
వెంకటరమణను 2018 నుంచి ఆస్పత్రికి తిప్పుతున్నాం. అంతకు ముందే మద్యం అలవాటుంది. ఆస్పత్రిలో పరీక్షలు చేస్తే గుండె, లివర్, ఎముకలు పాడయ్యాయన్నారు. మద్యం తాగడం వల్లనే ఇలా జరిగిందని, ఎక్కువ రోజులు బతకవని డాక్టర్లు చెప్పారు. ఇప్పటికైనా మద్యం మానకపోతే వైద్యం చేయమని కోప్పడ్డారు. ఆరోగ్యం పూర్తిగా చెడిపోవడం వల్లే ఇప్పుడు చనిపోయాడు. 
– మృతుడి సోదరి, తల్లి, జంగారెడ్డిగూడెం

సారా అలవాటే లేదు 

అప్పారావు కూలి పనులకు గుడివాడ వెళ్లాడు. అక్కడ పడిపోవడంతో వైద్యం చేయించి, ఇంటికి తీసుకొచ్చారు. మళ్లీ ఇబ్బంది రావడంతో ఏలూరు ఆస్పత్రికి తీసుకెళ్లిన అరగంటకే చనిపోయాడు. కానీ పేపర్లలో నాటు సారా తాగి చనిపోయాడని రాశారు. అతడికి సారా అలవాటే లేదు. మా పరువు తీశారు.
– మృతుడి కుటుంబ సభ్యులు, ఉణుదుర్రు

ఆస్తమా జబ్బుతో చనిపోయాడు

సత్యనారాయణకు పదేళ్లుగా దగ్గు, ఆయాసం ఉన్నాయి. 73 ఏళ్లు. 6వ తేదీన ఆయాసం ఎక్కువవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. వైద్యం చేస్తుండగానే చనిపోయాడు. ఆయనకు మద్యం అలవాటు లేనేలేదు. కానీ పేపర్లు, టీవీల్లో సారా తాగి చనిపోయాడని ప్రచారం చేశారు. ఇప్పుడు మేం బయటకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. 
– మృతుడి కుటుంబ సభ్యులు, బుట్టాయిగూడెం

పురుగుల మందు తాగి.. 
నాగరాజు దంపతుల మధ్య గొడవలున్నాయి. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆమెను బెదిరిద్దామని పురుగుల మందు తాగి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఇతనికి మద్యం తాగే అలవాటైతే ఉంది. కానీ పురుగుల మందు తాగడం వల్లే చనిపోయాడు. కానీ నాటు సారా తాగి చనిపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. 
– మృతుడి కుటుంబ సభ్యులు, గుండుగొలను 

మరిన్ని వార్తలు